Snail Curry: కొన్నిచోట్ల నత్తల కూరను ఇష్టంగా తింటారు, నత్తలు తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి
Snail Curry: తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల నత్తలను ఇష్టంగా తినే వారి సంఖ్య ఎక్కువే. నత్తలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయో తెలుసుకుందాం.
Snail Curry: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వంటి తెలుగు రాష్ట్రాలతో పాటూ అనేక చోట్ల నత్తల కూరలను తినేందుకు ఇష్టపడతారు. అవి దొరికితే చాలు కొన్నిచోట్ల పండగ చేసుకుంటారు. గోదావరి నదీ ఒడ్డున ఉన్న జిల్లాలోని మాంసాహార ప్రియులు కూడా నత్తలతో చేసిన కూరను తినేందుకు ఇష్టపడతారు. నత్తల వ్యాపారంతో బతుకుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే నాన్ వెజ్ తినే వారంతా నత్తలు తినేవారు కాదు. కొంతమంది మాత్రమే నత్తలను తినేందుకు ఇష్టపడతారు. మరి కొందరు వాటిని ఇష్టపడరు. నత్తలు తినడం వల్ల ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
నత్తల కూర రుచి ఎలా ఉంటుంది?
నత్తల మాంసం మెత్తగా ఉంటుంది. తినేవారు చెబుతున్న ప్రకారం ఇది మేక మాంసం కంటే రుచిగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా గర్భం ధరించాక నత్తలను తినడం వల్ల పిల్లలకి కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. వారి మానసిక అభివృద్ధి కూడా చక్కగా ఉంటుందని వివరిస్తున్నారు.
నత్తల కూర తినడం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్, అలసట వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయని ఎంతోమంది నమ్మకం. వీటి ధర చాలా తక్కువే ఉంటుంది. కిలో ₹100 నుంచి 200 రూపాయలకే లభిస్తాయి. కాబట్టే మాంసం ప్రియులు పెద్ద ఎత్తున వీటిని కొనుక్కొని తినేందుకు ఇష్టపడుతున్నారని తెలుస్తోంది.
ఎవరు తినాలి?
శ్వాస కోశ సమస్యలతో ఇబ్బంది పడేవారు, పైల్స్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు నత్తలను తినడం ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్తమాతో ఇబ్బంది పడుతున్న వారు నత్తలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చని అంటున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం నత్తలను తినడం వల్ల గుండెకు కూడా ఎంతో మేలు జరుగుతుందని తెలుస్తోంది.
వర్షాల తర్వాతే నత్తలు అధికంగా లభిస్తాయి. ఇక స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలో నత్తలను ప్రత్యేకంగా పెంచుతారు. వాటి పెంపకం అక్కడ భారీ ఎత్తున జరుగుతోంది. దీన్ని పేదవారి మాంసాహారంగా కూడా చెప్పుకుంటారు.
చరిత్రకారులు చెబుతున్న ప్రకారం నత్తలను క్రీస్తుపూర్వం 10700 నుండి మనిషి తింటున్నట్టు తెలుస్తోంది. గ్రీకు గుహలో ఎన్నో నత్తల షెల్స్ లభించాయి. అక్కడ ఉన్న మానవులు వాటిని తిని షెల్స్ వదిలేసారని అధ్యయనాల్లో తేలింది.
చాలా చోట్ల నత్తలను చేపలగానే భావించి తింటారు. అయితే అన్ని నత్తలు తినదగినవి కాదు. కొన్ని మాత్రమే తినదగి నత్తలు. ఆ పరిజ్ఞానం ఉంటేనే నత్తలను వండుకొని తినాలి.
నత్తల్లో 82% నీరే ఉంటుంది. అలాగే మెగ్నీషియం, ఇనుము, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, నియాసిన్, సెలీనియం కూడా అధిక స్థాయిలోనే నత్తల్లో ఉంటాయి. ప్రోటీన్ కూడా దీనిలో అధికంగా లభిస్తుంది. అందుకే నత్తలను చాలా చోట్ల ఇష్టంగా తింటారు. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు నత్తలను తినడం వల్ల ఆ లోపం నుంచి బయటపడొచ్చు. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కూడా అందిస్తుంది.
టాపిక్