పచ్చి మాంసాన్ని తినే ‘తేనేటీగలు’! ఆశ్చర్యపోతున్నారా? -scientists discover bees meat eating vulture bees have evolved special gut bacteria ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పచ్చి మాంసాన్ని తినే ‘తేనేటీగలు’! ఆశ్చర్యపోతున్నారా?

పచ్చి మాంసాన్ని తినే ‘తేనేటీగలు’! ఆశ్చర్యపోతున్నారా?

Rekulapally Saichand HT Telugu
Dec 23, 2021 11:53 PM IST

ఇప్పటివరకు మనకు తియ్యని తేనెను పంచే తేనెటీగల గురించి మాత్రమే తెలుసు, కానీ మాంసాన్ని తినే తేనెటీగలు ఉన్నాయంటే నమ్ముతారా.. అవును అలాంటి మాంసాహార తేనెటీగలు కూడా ఈ భూమి మీద ఉన్నాయి.

vulture-bees
vulture-bees

ఇప్పటివరకు మనకు తియ్యని తేనెను పంచే తేనెటీగల గురించి మాత్రమే తెలుసు కానీ మాంసాన్ని తినే తేనెటీగలు ఉన్నాయంటే నమ్ముతారా?  అవును.. అలాంటి మాంసాహార తేనెటీగలు కూడా ఈ భూమి మీద ఉన్నాయి. మాంసాన్ని తిని జీర్ణించుకునే తేనెటీగలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.  వాటికి "రాబందు తేనెటీగలు" అని  నామకరణం చేశారు.  

కార్నెల్ యూనివర్శిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్‌సైడ్‌తో పాటు అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ శాస్త్రవేత్తల బృందం ఈ తేనెటీగలపై పరిశోధనలు జరిపి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.  

ఈ తేనెటీగల పేగుల్లో యాసిడ్‌ను విడుదల చేసే కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయని, వీటి సహయంతో అవి మాంసాన్ని సులభంగా జీర్ణం చేసుకుంటాయని వివరించారు. సాధారణంగా రాబందులు, గాడిదల కడుపులలో మాత్రమే ఈ రకమైన బ్యాక్టీరియా కనిపిస్తుందని వారు వెల్లడించారు.

ఈ ఆసక్తికరమైన పరిశోధన చాలా కాలం పాటు కొనసాగింది.  మొదటగా పరిశోధకులు ఈ తేనెటీగలను శాకాహారులుగా భావించబవించినప్పటికీ, అవి సేకరించిన తేనెలో సూక్ష్మజీవులను గమనించిన తర్వాత వీటిని సర్వభక్షకులుగా తేల్చారు . ఆపై మరిన్ని పరిశోధనలు చేసి ఇవి మాంసాన్ని తినే ‘రాబందు తేనెటీగలు’ అని  గుర్తించారు. 

రాబందు తేనెటీగలు

రాబందు తేనెటీగల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు మెుదట కోస్టారికాలో పరిశోధనలు జరిపారు.  అవి నివిసించే ప్రదేశాన్ని కనుగొని అక్కడ పచ్చి చికెన్ ముక్కలను చెట్ల కొమ్మలకు కట్టారు. వాటిని చీమలు తీనకుండా ఉండేందుకు కుండీలపై పెట్రోలియం జెల్లీ పూతను పూశారు. అనుకున్నట్టుగానే మాంసాన్ని తినడం కోసం వచ్చిన రాబందు తేనెటీగలు.. చెట్లకు కట్టిన చికెన్ తినడంతో పాటు వాటి వెనుక కాళ్ల సందుల్లో కూడా కొంత భద్రపరుచుకున్నట్లు గుర్తించారు. రాబందు తేనెటీగలు మాంసాన్ని ఇష్టంగా తింటాయని పరిశోధకులు పేర్కొన్నారు. మరిన్ని పరిశోధనల కోసం వీటిని సేకరించి  ప్రయోగశాలకు తరిలించారు.

బాక్టీరియా నుండి రక్షణ

రాబందు తేనెటీగలలో ఉండే సూక్ష్మజీవులలో ఆమ్ల బ్యాక్టీరియా ఉంటుందని అధ్యయన శాస్త్రవేత్తలలో ఒకరైన క్విన్ S. మెక్‌ఫెడ్రిక్ తెలిపారు. వీటి పేగులలో ఆవాసం ఉండే ఈ బ్యాక్టీరియా వల్ల అవి కుళ్ళిన మాంసాన్ని తిన్నప్పటికి వాటికి ఎలాంటి హాని కలగదని వివరించారు.

మాంసాన్నే కాదు తియ్యని  తేనె కూడా సేకరిస్తాయి

ఈ తేనెటీగలు మాంసాన్నే కాదు తియ్యటి తేనెను కూడా సేకరిస్తాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం రాబందు తేనెటీగలు వాటి తెట్టలో రెండు ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేస్తాయి. కట్టలుగా కట్టిన గదులలో మాంసాన్ని ఉంచితే, పుప్పొడి నుంచి సేకరించే ఆహారాన్ని వేరు గదుల్లో భద్రపరుస్తాయి. రాబందు తేనెటీగలపై జరిపిన ఈ అధ్యయనాలకు సంబంధించిన విషయాలను అమెరికన్ సొసైటీ ఆఫ్ మైక్రోబయాలజిస్ట్స్ జర్నల్‌లో ప్రచురించారు.

WhatsApp channel