Schezwan Idli Recipe: ఉదయం చేసిన ఇడ్లీలు మిగిలాయా.. సాయంత్రం ఇలా టేస్టీ స్నాక్‍గా చేసేసుకోండి
Schezwan Idli Recipe: ఉదయం చేసుకున్న ఇడ్లీలు మిగిలిపోతే టేస్టీ స్నాక్‍గా చేసుకోవచ్చు. సాయంత్రం టేస్టీగా తినేందుకు ‘షెజ్వాన్ ఇడ్లీ’గా చేయవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఉదయాన్నే చేసిన ఇడ్లీలు చాలాసార్లు మిగిలిపోతుంటాయి. చల్లారిన ఇడ్లీలు తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అందుకే చాలాసార్లు ఇడ్లీలు వేస్ట్ అవుతుంటాయి. అయితే, వాటితో సాయంత్రం టేస్టీ స్నాక్ చేసుకోవచ్చు. మిగిలిన పోయిన ఇడ్లీలతో ‘షెజ్వాన్ ఇడ్లీ’ చేసుకోవచ్చు. ఇది టేస్టీగా ఉండటంతో ఈవింగ్ స్నాక్‍గా బాగా సెట్ అవుతుంది. ఇడ్లీలు కూడా వేస్ట్ అవవు. ఈ షెజ్వాన్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలంటే..
షెజ్వాన్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు
- ఆరు ఇడ్లీలు (సైజ్‍ను బట్టి ఆరు ముక్కల వరకు కట్ చేసుకోవాలి)
- మూడు టీస్పూన్‍ల షెజ్వాన్ సాస్
- ఓ తరిగిన ఉల్లిపాయలు
- రెండు నిలువుగా తరిగిన పచ్చిమిర్చి
- 3 టేబుల్ స్పూన్‍ల నూనె
- కొన్ని క్యాప్సికం ముక్కలు (ఆప్షనల్)
- తరిగిన ఉల్లికాడలు
- తగినంత ఉప్పు, రెండు సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, గరం మాసాల, కొత్తిమీర
తయారీ విధానం
- ఒక్కో ఇడ్లీని ఆరు ముక్కల వరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఓ ప్యాన్‍ను స్టవ్‍పై పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్‍ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక అందులో ముందుగా ఆవాలు వేయాలి. అవి చిట్లాక సన్నగా తరిగిన వెల్లుల్లి, రెండు చీరిన పచ్చిమిర్చి వేసి కలపాలి.
- కాసేపటి తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, స్పింగ్ ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలు వేసి హైఫ్లేమ్‍పై వెంటవెంటనే బాగా కలపాలి.
- ఆ తర్వాత ప్యాన్‍లో మూడు టేబుల్ స్పూన్‍ల షెజ్వాన్ సాస్ వేయాలి. ఉప్పు, గరం మసాలా తగినంత వేసుకోవాలి. అనంతరం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓ 30 సెకన్లు హైఫ్లేమ్‍పై ఉడకనివ్వాలి.
- అనంతరం అందులో కట్ చేసుకున్న ఇడ్లీలు వేయాలి. అన్ని ముక్కలకు షెజ్వాన్ మిశ్రమం అంటుకునేలా బాగా కలపాలి. కాస్త ఫ్రై అయ్యేలా 45 సెకన్ల పాటు కలపాలి. చివర్లో పైన కాస్త కొత్తిమీర చల్లుకోవాలి. అంతే షెజ్వాన్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇక ప్లేట్‍లో తీసుకొని తినేయవచ్చు.
ఒకవేళ కారం తక్కువగా కావాలనుకుంటే షెజ్వాన్ సాస్ రెండు టేబుల్ స్పూన్‍లు వేసుకున్నా సరిపోతుంది. క్యాప్సికమ్ కూడా అందుబాటులో ఉంటేనే వేసుకోవచ్చు.
మరింత క్రిస్పీగా కావాలంటే..
కావాలంటే షెజ్వాన్ ఇడ్లీ మరింత క్రిస్పీగా చేసుకోవచ్చు. అందుకోసం.. ఓ ప్యాన్‍లో కాస్త నూనె వేసుకొని కాసేపు ఇడ్లీ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. కాస్త రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత తీసి పక్కనపెట్టుకోవాలి. అనంతరం పైన చెప్పిన ప్రాసెస్ అదే విధంగా ఫాలో అవ్వాలి.