Telugu News  /  Lifestyle  /  Saturday Motivation On Don't Go Through Life, Grow Through Life
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : మీరు కూడా బట్టలు వేసుకున్న ఆదిమానవులేనా?

01 October 2022, 6:54 ISTGeddam Vijaya Madhuri
01 October 2022, 6:54 IST

Saturday Motivation : మార్పు. ఈ చిన్ని పదం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా, ఏ మనిషైనా.. ఎలాంటి పరిస్థితి అయినా మారుతూ ఉంటుంది. మారాలి కూడా. అదే జీవితం. లైఫ్​ మంచిగా ఉండాలని దానికి అనుగుణంగా మారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్లు ఉన్నారు. చెడు దారిలో వెళ్తూ.. నాశనం చేసుకునే వాళ్లు ఉన్నారు. మరి ఈ మార్పులు అవసరమేనా?

Saturday Motivation : మార్పు అనేది కచ్చితంగా అవసరం. ఏ విషయమైనా.. పరిస్థితి అయినా.. మనిషి అయినా.. మారుతూనే ఉండాలి. దాని అర్థం ఊసరవెళ్లిలా రంగులు మార్చాలని కాదు. పరిస్థితులను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మారాలి. ప్రకృతి కూడా అదే చెప్తుంది. వేసవి కాలం, చలి కాలం, వానా కాలం అంటూ ఇలా కాలాలు మారుస్తూ ఉంటుంది. ఈ వాతావారణ మార్పులనేవి లేకపోతే జీవన మనుగడ ఉండేదా? ఇలాంటి అవసరమైన మార్పులనేవి కచ్చితంగా ఉండాలి.

ట్రెండింగ్ వార్తలు

కొందరు మార్పు అంటే ఓ బూతులా చూస్తారు. కానీ మార్పులు అనేవి జీవన మనుగడను సులభం చేస్తాయి. కాలానుగుణంగా టెక్నాలజీ, మనుషులు, సాంకేతికత మారకుండా ఉండి ఉంటే.. ఇప్పటికీ మనం ఆది మానవుల్లానే ఉండే వాళ్లం. అసలు డబ్బు అనేది లేకుండా.. ఆకలితో ఒకరినొకరు చంపుకుంటూ.. దిగంబరులుగానే ఉండేవాళ్లం కదా. కానీ మంచి కోసం మారాం. ఏది మంచి.. ఏది చెడు అనేది ఆలోచించగలుగుతున్నాం. బట్టలు కప్పుకోవాలి.. ఆహారానికి ప్రత్యామ్నాయాలు.. ఇలా చాలా విషయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి కాబట్టే నాగరికత పెరిగింది.

ఒకటి గుర్తుపెట్టుకోండి మారడం అనేది బూతు కాదు. కొందరు ఎలా ఉంటారంటే చెప్పి వెళ్లాలి చెప్పులు వేసుకుని వెళ్లాలి అనే టైప్ ఉంటారు. ఛాదస్తాలు, మూఢనమ్మకాలే నిజమని నమ్ముతూ.. వాటిని ఇతరులపై రుద్దుతూ.. అది మాత్రమే నిజమని భావిస్తారు. ఓ వ్యక్తి సాంప్రదాయంగా ఉండాలనుకోవడం తప్పులేదు. అది తనకి మంచిదని భావిస్తారు కాబట్టి. అదే భావనను మరో వ్యక్తిపై రుద్దడం సరికాదు. ఎందుకంటే అతని ఆలోచనలు వేరు కాబట్టి. ఎప్పుడూ చీరలే కట్టాలి.. పంచలే చుట్టాలి అంటే అందరికీ కష్టమే. ఎవరు ఎలా ఉండాలి అనే విషయాన్ని నిర్ణయించే హక్కు ఇంకొకరికి లేదు.

మీకు ఓ వ్యక్తి డ్రెస్సింగ్, ప్రవర్తన నచ్చలేదనుకో.. ఎందుకు వారు ఇలా ఉన్నారు అని ప్రశ్నించుకోవాలి. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారు ఎందుకు అలా మారారో తెలుసుకోవాలి. వారి అవసరాలు వారిని మార్చాయా? చుట్టూ ఉన్నా పరిస్థితులు మార్చాయా.. లేదా కాలానికి తగ్గట్లుగా (నేటి ఆధునిక ధోరణితో) మారిపోయాడా అని ఆలోచించాలి. చెడుగా మారినట్లు అనిపిస్తే.. ఓ మాట చెప్పి చూడండి. బాబు ఇలా కాదురా నాయనా అని.. వాడు విన్నాడా సరే. వినలేదా మీరు వారిని తప్పు పట్టకూడదు. మీకు అనిపించిన మంచి అతనికి చెప్పారు. అతనికి అనిపించిన కంఫర్ట్​లెవల్​లో అతను ఉన్నాడు. ఈ రకమైన మార్పు ప్రతి ఒక్కరికీ అవసరం. దేనిలో మార్పు వచ్చినా.. రాకపోయినా ఆలోచనల్లో మార్పు రావడం కచ్చితంగా అవసరం. మంచిగానే అండోయ్.. చెడుగా కాదు.

కొన్ని విషయాలు అయితే కచ్చితంగా మారాలి. ఓ అమ్మాయి లుక్స్​ని చూసి ఆ అమ్మాయి మంచిదో కాదో.. అదే అమ్మాయి ఓ అబ్బాయితో మాట్లాడుతుంటే క్యారెక్టర్​ జడ్జి చేయడంలో.. ఓ అమ్మాయి తనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటే.. తనకు రమ్మని సిగ్నల్ ఇస్తుందని అని భావించే వారిలో.. ఆడపిల్ల పెద్దదైంది అంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపేయాలి.. ఆడది ఇంట్లోనే ఉంటూ సేవలు చేయాలి.. ఇలా ఒకటా, రెండా? చెప్పుకుంటూ పోతే.. చాలా విషయాల్లో అమ్మాయిని చూసే ధోరణిలో మార్పు కచ్చితంగా రావాలి.

అబ్బాయిల విషయానికి వస్తే.. వాడికి జాబ్ లేదనో.. లేదా వాడి లుక్స్ చూసి.. తప్పు లేకపోయినా.. తప్పు చేయకపోయినా.. వాడి వాలకం చూశారా అని ఓ మాట అనేస్తారు. కొన్ని సందర్భాల్లో అమ్మాయి తప్పా.. అబ్బాయి తప్పా అని కూడా ఆలోచించకుండా.. తప్పు.. అబ్బాయి అని మాత్రమే చూసి.. అబ్బాయిలను బ్లేమ్ చేస్తారు. ఈ ధోరణి కూడా కచ్చితంగా మారాలి. ఎందుకంటే ఇలాంటి పరస్థితుల వల్ల అబ్బాయి మాత్రమే కాదు.. అతని ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది.

డాక్టర్ చెప్పాడని బరువు తగ్గుతాం. షుగర్ కంట్రోల్ చేస్తాం. ఒత్తిడి తగ్గించుకుంటాం. కోపాన్ని అదుపులో పెట్టుకుంటాం. ఈ మార్పులు ఎందుకంటే మన శరీరాన్ని కాపాడుకోవడం కోసం. అలాగే ఆలోచనల్లో మార్పులు కూడా మీకు, ఈ సమాజానికి మంచివే. ఈ సమాజమే మీ శరీరం అనుకుని ఆలోచించి చూడండి. మిమ్మల్ని మీరు ఎక్కడ ఎలా కంట్రోల్ చేసుకోవాలో గుర్తించండి. అంతేకానీ మూఢనమ్మకాలు, చాధస్తాలతో.. అన్నీ మీకే తెలుసు అనే ధోరణితో ఉండకండి. ఈ మార్పులు మీకు, మీ కుటుంబానికి, మీ సమాజానికి కచ్చితంగా మంచే చేస్తాయి. ఒకవేళ ఈ మార్పులు మీలో రాలేదనుకో.. మీరు కూడా బట్టలు వేసుకున్నా ఆదిమానవులే అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి.. రాజ్యంగంలోని సవరణలు కూడా.. కాలానుగుణంగా జరిపే మార్పులే.