Saturday Motivation: ప్రేమలో విఫలమైతే పెరగాల్సింది పగ కాదు, జీవితంలో గెలిచి నిలిచి చూపించాలన్న కసి
Saturday Motivation: ప్రేమను కాదంటే చాలు ఆ కాదన్న వారిని చంపేయడానికి సిద్ధపడి పోతున్నారు ఎంతోమంది. ఇలా మీరు ద్వేషాన్ని పెంచుకుంటే ఎప్పుడైనా ఓడిపోతారు. మిమ్మల్ని కాదన్నవారి ముందే గెలిచి నిలిచి చూపించండి. అదే వారికి పెద్ద చెంప దెబ్బ.
Saturday Motivation: ప్రేమలో ఎంతోమంది విఫలమవుతారు. బంధాలు విడిపోవడం, తెగిపోవడం అనేది మనసును బాధ పెట్టే అంశాలు. కొంతమంది ప్రేమలో విఫలం అయితే తట్టుకోలేరు. తీవ్రమైన మానసిక వేదనకు గురవుతారు. ఎదుటివారిపై పగను పెంచుకుంటారు. వారిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనుకుంటారు. చివరికి వారిని చంపడం లేక తాము చావడం వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎదుటివారి జీవితంతో పాటు మీ జీవితం కూడా కోల్పోవడం తప్ప జరిగేది, ఒరిగేది ఏమీ ఉండదు. అదే మిమ్మల్ని కాదన్న వారి ఎదుటే... జీవితంలో గెలిచే నిలిచి చూపిస్తే అదే వారికి పెద్ద చెంప దెబ్బ.
ప్రేమంటే రెండు కుటుంబాలు
ప్రేమలో విఫలమవ్వడం బాధపెడుతుంది. ప్రేమ అనే మధురమైన అనుభూతిని కోల్పోతున్నామనే భావన మనసును కుంగ దీసేస్తుంది. అందులోని మనం ప్రేమించిన వారు మరో వ్యక్తి పక్కన కనిపిస్తే అది పగగా మారిపోతుంది. ఒకప్పుడు ప్రేమలో విఫలమైన వారు దేవదాసులుగా మారేవారు. ఇప్పుడు గాడ్సేల్లా మారి ప్రేమను నిరాకరించిన వారిని చంపేస్తున్నారు. మరి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రెండు పనులు రెండు జీవితాలనే కాదు రెండు కుటుంబాలను నాశనం చేస్తాయి. అమ్మాయి ప్రేమనో లేక అబ్బాయి ప్రేమనో కోల్పోతే సర్వం కోల్పోయినట్టు బాధపడక్కర్లేదు. మీకు భవిష్యత్తులో అంతకన్నా మంచి జీవిత భాగస్వామి రావచ్చునేమో... అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి మీ జీవితం నుంచి బయటకు వెళుతున్నాడేమో... ఇలా పాజిటివ్ గా ఆలోచించుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు.
ప్రేమను కాదన్నారని పగ పెంచుకుంటే మిగిలేది వినాశనమే. ప్రేమను మర్చిపోవడానికి చదువు పైనో, ఉద్యోగం పైనో దృష్టి పెట్టండి. ఆ రంగంలో మీరు నిష్ణాతులుకండి. మిమ్మల్ని కాదన్న వారే పశ్చాత్తాప పడేలా ఎదిగి చూపించండి. మిమ్మల్ని మిస్ అయినందుకు వారు ఎప్పటికైనా బాధపడేలా చేయండి. అది చాలు వారి జీవితాంతం పశ్చాత్తాపంతో నలిగిపోవడానికి.
మీ ప్రేమను ఎదుటి వ్యక్తి అంగీకరించాలని లేదు. ఆమె నీకు నచ్చితే సరిపోదు, మీరు కూడా ఆమెకు నచ్చాలి. మీకు ఇష్టం లేని పని ఎలా చేయలేరో, ఎదుటి వ్యక్తి కూడా తనకు నచ్చని పని చేయలేరు. మీ వైపు నుంచే కాదు ,వారి వైపు నుంచి కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మనకు నచ్చినవన్నీ మనకు దక్కాలనే ఆలోచనలు వదిలేస్తే... మీతో పాటు మీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటారు.
ప్రేమతో ఓడిపోతే జీవితం అక్కడితో ఆగిపోదు. ఇంకా జీవితంలో ఎంతో మంది పరిచయం అవుతారు. జీవితం చాలా సుదీర్ఘమైనది. మీకు నచ్చినట్టు మీ జీవితాన్ని బతకవచ్చు. ఎన్నో ఆనందమైన క్షణాలు మీ కోసమే ఎదురు చూస్తూ ఉంటాయి. అలాంటి మధురమైన అనుభూతులను కోల్పోకుండా ఉండాలంటే... ప్రేమ విఫలమైనప్పుడు మీపై మీకు నియంత్రణ ఉండాలి. అమ్మాయి ప్రేమనో లేక అబ్బాయి ప్రేమనో కోల్పోతే ఒక్కసారి మీ తల్లిదండ్రుల ప్రేమను, మీ తోబుట్టువుల ప్రేమను, మీ మీద ఆధారపడి బతుకుతున్న వారి జీవితాలను గుర్తు చేసుకోండి. వారి ముందు అమ్మాయి ప్రేమ లేదా దూది కన్నా తేలిక అనిపిస్తుంది.
మన జీవితంలో మనతో నడిచే భాగస్వామి వచ్చేదాకా ఓపికగా వేచి ఉండాలి. ఆమె మీకు కొండంత ప్రేమను పంచవచ్చు. మీ పాత జ్ఞాపకాలను, పాత ప్రేమను మర్చిపోయేలా చేయవచ్చు. కాబట్టి ప్రేమ విఫలమైతే ఎదుటివారిపై పగను పెంచుకోవడం మాని, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.