Saggubiyyam kesari: సగ్గుబియ్యం వాడకం చాలా వరకు తగ్గిపోయింది. నిజానికి మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో సగ్గుబియ్యం ఒకటి. ఆరోగ్యం బాగోనప్పుడు సగ్గుబియ్యంతో జావ చేసుకుని తాగే వారు తప్ప, దీంతో ఇతర వంటకాలు చేసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంది. నిజానికి సగ్గుబియ్యంతో ఎన్నో టేస్టీ వంటకాలు వండుకోవచ్చు. అలాంటి వాటిలో ఒకటి సగ్గుబియ్యం కేసరి. రవ్వ కేసరి లాగే సగ్గుబియ్యంతో కూడా కేసరి టేస్టీగా చేసుకోవచ్చు. పండగలప్పుడు నైవేద్యంగా సమర్పించవచ్చు. సగ్గుబియ్యం కేసరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
సగ్గుబియ్యం - ఒక కప్పు
నెయ్యి - ఒక స్పూను
డ్రైఫ్రూట్స్ - గుప్పెడు
పంచదార - అరకప్పు
ఆరెంజ్ ఫుడ్ కలర్ - చిటికెడు
యాలకుల పొడి - అర స్పూను
నీళ్లు - తగినన్ని
పచ్చ కర్పూరం - చిటికెడు
1. సగ్గుబియ్యాన్ని ముందుగానే నీటిలో వేసి నానబెట్టుకోవాలి.
2. ఒక గంట పాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్లు వేయాలి.
4. ఆ నీళ్లలోనే ఒక టీ స్పూన్ నెయ్యి వేయాలి.
5. నీళ్లు సలసలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసి వేసి ఉడికించాలి.
6. సగ్గుబియ్యం మెత్తగా ఉడికాక వడకట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి.
7. ఆ సగ్గుబియ్యంలో ఒక అర స్పూన్ నెయ్యిని వేసి కలుపుకొని పక్కకు పెట్టాలి.
8. ఇప్పుడు మరో కళాయిని స్టవ్ మీద పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి.
9. అందులో డ్రై ఫ్రూట్స్ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
10. అదే కళాయిలో సగ్గుబియ్యాన్ని వేసి వేయించాలి. అవి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.
11. తర్వాత అందులో పంచదారను కలుపుకోవాలి.
12. పంచదార కరిగి పాకంలా అవుతుంది.
13. ఆ సమయంలో ఫుడ్ కలర్ ను వేసి బాగా కలపాలి.
14. అలాగే పచ్చ కర్పూరం పొడిని, యాలకుల పొడిని కూడా వేసి కలుపుకోవాలి.
15. చిన్న మంట మీద ఉంచి గరిటతో కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగు అంటుకుపోయే అవకాశం ఉంది.
16. మళ్లీ రెండు స్పూన్ల నెయ్యిని పైన వేసి, ముందుగా వేయించి పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా చల్లుకోవాలి.
17. హల్వా లాగా కేసరి దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.
18. అంతే సగ్గుబియ్యం కేసరి రెడీ అయినట్టే. ఇది వండుతున్నప్పుడే ఘుమఢుమలాడిపోతుంది.
19. పిల్లలకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. అమ్మవారికి నైవేద్యంగా కూడా దీన్ని వడ్డించుకోవచ్చు.
బియ్యంతో చేసే వంటకాలు టేస్టీగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. దీనిలో ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్ వంటివి ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. సగ్గుబియ్యం తినడం వల్ల శరీరానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. పిల్లలకు సగ్గుబియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఫోలేట్ ఉంటుంది. కాబట్టి మెదడుకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సగ్గుబియ్యంతో చేసిన గారెలు కూడా పిల్లలకి అప్పుడప్పుడు తినిపించండి. ఈ సగ్గుబియ్యం కేసరిలో ఫుడ్ కలర్ వేయడం మీకు ఇష్టం లేకపోతే దాన్ని దూరం పెట్టవచ్చు. కాకపోతే కేసరి రంగు తెలుపుగా వస్తుంది. రుచి మాత్రం ఏమాత్రం మారదు. ఆరంజ్ ఫుడ్ కలర్ వేయాలా వద్దా అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాపిక్