Nokia 2660 Flip । చాలా కాలం తర్వాత నోకియా నుంచి ఆకర్షణీయమైన ఫ్లిప్ ఫోన్!
నోకియా బ్రాండ్ నుంచి మూడు ఆకర్షణీయమైన ఫీచర్ ఫోన్లు విడుదలయ్యాయి. Nokia 2660 Flip ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర తదితర సమాచారం కోసం ఈ స్టోరీ చూడండి.
ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్‌లే. మార్కెట్లో కూడా రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలవుతోంది. ఒక దానిని మించి ఒకటి ఫీచర్లు అందిస్తున్నాయి. నేడు ఫోన్ గురించి మాట్లాడంటే కెమెరా ఎలా ఉంది, స్టోరేజ్ ఎంత ఉంది, ర్యామ్ కెపాసిటీ ఎంత మొదలైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల గురించే చర్చంతా. కానీ ఒక పదేళ్లు వెనక్కి వెళ్తే ఆకర్షణీయమైన డిజైన్లతో ఫోన్లు వచ్చేవి. ఫ్లిప్ ఫోన్లు, స్లైడ్ ఫోన్లు, ఎర్రబటన్, పచ్చబటన్ కలిగి ఉన్న క్వెర్టీ కీప్యాడ్ ఫోన్లదే అప్పుడు హవా. నేటికి ఫ్లిప్ ఫోన్ ఉంటే బాగుండని అనుకునే వారెందరో. కాల్ వచ్చినపుడు అలా ఫ్లిప్ ఎత్తి, పెట్టేయడంలో ఒక స్టైల్ ఉండేది. ఇప్పుడు ఆ స్టైల్, ఆ మెమొరీలను నోకియా మరోసారి తీసుకువచ్చింది.
HMD గ్లోబల్ సరికొత్తగా నోకియా 2660 ఫ్లిప్, నోకియా 8210 4జి, అలాగే నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో అనే మూడు ఫీచర్ ఫోన్‌లను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది.
కొత్త Nokia 2660 Flip ఫోన్ ధర 64.99 యూరోలు ( భారతీయ కరెన్సీలో సుమారు రూ. 5,190) గా ఉంది. ఇక నోకియా 8210 4జీ, నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో ఫోన్ల ధరలు వరుసగా 64.99 యూరోలు (సుమారు రూ. 5,190) , 74.99 యూరోలు (సుమారు రూ. 5,970) గా ఉన్నాయి.
Nokia 2660 Flip ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
నోకియా 2660 ఫ్లిప్‌లో పాలికార్బోనేట్ బ్యాక్‌తో పాటు లోపల 2.8-అంగుళాల QVGA డిస్‌ప్లే అలాగే బయట 1.77-అంగుళాల QQVGA డిస్‌ప్లే ఉంది. ఇది కూడా స్మార్ట్‌ఫోన్ తరహాలో పనిచేస్తుంది. ఇందులో Unisoc T107 SoC ప్రాసెసర్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ S30+ OSతో నడుస్తుంది.
ఇందులో 48 MB RAM, అలాగే 128 MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 32GB వరకు స్టోరేజ్ సామర్థ్యాన్ని విస్తరించుకోవచ్చు.
ఇంకా ఈ హ్యాండ్ సెట్లో 1,450mAh బ్యాటరీ, VGA కెమెరా, QWERTY కీప్యాడ్, డ్యుఎల్ సిమ్ స్ల్పాట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
రెడ్, బ్లాక్, బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
జూలై 28 నుంచి ఈ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రత్యేకంగా భారత మార్కెట్లో విడుదల చేస్తుందా? అనే విషయంలో స్పష్టత లేదు.
మరోవైపు, నోకియా 8210లో 2.8-అంగుళాల QVGA స్క్రీన్, Unisoc T107 SoC ప్రాసెసర్, 1,450mAh , S30+ OS ఫీచర్లతో వచ్చింది. ఇందులో కూడా అదే ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి ఈ స్టోరేజ్ ను 32GB వరకు విస్తరించవచ్చు. అయితే ఈ ఫోన్ 4G కనెక్టివిటీని కలిగి ఉంది.
సంబంధిత కథనం