Rasam Powder: ఇంట్లోనే చారు పొడి ఇలా చేసుకుంటే, టేస్టీ టేస్టీ రసం రెడీ అయిపోతుంది-rasam powder recipe in telugu know how to make this charu podi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rasam Powder: ఇంట్లోనే చారు పొడి ఇలా చేసుకుంటే, టేస్టీ టేస్టీ రసం రెడీ అయిపోతుంది

Rasam Powder: ఇంట్లోనే చారు పొడి ఇలా చేసుకుంటే, టేస్టీ టేస్టీ రసం రెడీ అయిపోతుంది

Haritha Chappa HT Telugu
Jun 09, 2024 11:50 AM IST

Rasam Powder: తెలుగిళ్లల్లో చారుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్ని కూరలు ఉన్నా చివరలో చారు వేసుకొని తినేవారు ఎంతోమంది. చారు పొడి రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

చారు పొడి రెసిపీ
చారు పొడి రెసిపీ

Rasam Powder: తెలుగు ఇళ్లల్లో చారు లేదా రసం తినే అలవాటు ఎక్కువ. దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని మలబద్ధకం రాకుండా ఉంటుందని నమ్ముతారు. అందుకే పిల్లలకు కూడా చారు అన్నం తినిపిస్తారు. చారు పొడిని ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే ప్రతిరోజు టేస్టీ రసం రెడీ అయిపోతుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఒకసారి చేసుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. చారు పొడి ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం.

చారు పొడి రెసిపీకి కావలసిన పదార్థాలు

మిరియాలు - ఒక స్పూన్

ధనియాలు - ఒక కప్పు

మినప్పప్పు - ఒక స్పూను

ఇంగువ - పావు స్పూను

ఎండుమిర్చి - ఎనిమిది

వెల్లుల్లి - పదిరెబ్బలు

జీలకర్ర - ఒక స్పూన్

కరివేపాకులు - గుప్పెడు

చారు పొడి రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేయించాలి.

2. వాటిని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో అర చెంచా నూనె వేసి ఎండుమిర్చిని వేయించి తీసి మిక్సీ జార్ లో వేసుకోవాలి.

3. అలాగే వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండానే అందులో వేయాలి.

4. ఇంగువను వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని పొడి చేసుకోవాలి.

5. అంతే చారు పొడి రెడీ అయినట్టే.

6. దీన్ని గాలి చొరబడని డబ్బాల్లో వేసుకుంటే ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది.

7. ఇక్కడ మేము ఇచ్చిన కొలతలు ఒక వారానికి మాత్రమే ఇచ్చాము.

8. ఆరు నెలల పాటు సరిపోవాలంటే మీరు ఎంత మొత్తంలో తీసుకోవాలో అంచనా వేసుకోండి. కొంతమంది ప్రతిరోజూ చారును వండుతారు. మరి కొందరు రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే చారు వండుకుంటారు. ప్రతిరోజూ చారు వండుకునే వారికి ఎక్కువ పొడి అవసరం అవుతుంది. అప్పుడప్పుడు వండుకునే వారికి తక్కువ పొడి సరిపోతుంది. కాబట్టి మీ వాడకాన్ని బట్టి చారు పొడిని రెడీ చేసుకుంటే మంచిది.

ఏ ఆహారం తిన్న చివరిలో చారుతో అన్నాన్ని తినడం వల్ల మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు రావు. చారును అన్నంలో కలుపుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. మంచిగా అరుగుతుంది. అందుకే చిన్నపిల్లలకి గ్రామాల్లో చారు వేసిన అన్నాన్ని కలిపి పెడుతూ ఉంటారు. వయసు ముదిరిన వాళ్ళు చిన్న పిల్లలు చారు అన్నాన్ని కచ్చితంగా తినడం చాలా అవసరం. అలాగే అజీర్తి సమస్యలతో బాధపడేవారు కూడా రసం చేసిన అన్నాన్ని తినడం వల్ల ఆ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే జలుబు, దగ్గు వంటివి ఎన్నో సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. చారును కొన్ని వేల ఏళ్ల క్రితం నుంచి తెలుగు భోజనంలో భాగం చేసినట్టు చెబుతారు.

Whats_app_banner