Paracetamol: పారాసెటమాల్ టాబ్లెట్ మీకు నచ్చినట్టు వేసేసుకుంటున్నారా? కాలేయానికి ముప్పు తప్పదు
Paracetamol: పారాసెటమాల్ టాబ్లెట్స్ ఇష్టం వచ్చినట్టు వాడితే కాలేయం ప్రమాదంలో పడవచ్చు. కాబట్టి వాటిని వాడే పద్ధతిని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Paracetamol: ప్రతి ఇంట్లోనూ పారాసిటమాల్ కచ్చితంగా ఉంటుంది. ఒళ్ళు నొప్పులుగా అనిపించినా, కాస్త జ్వరంగా అనిపించినా వెంటనే పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకునే వారి సంఖ్య ఎక్కువే. ఇలా దీర్ఘకాలంపాటు ఎప్పుడు పడితే అప్పుడు పారాసిటమాల్ అధికంగా తీసుకుంటే... అది కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు అంతర్జాతీయ వైద్యులు. చివరికి కాలేయ వైఫల్యానికి దారితీయ వచ్చని వివరిస్తున్నారు.
అమెరికాలోని ఉటా విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు మానవ, ఎలుక కణజాలంపై పారాసిటమాల్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. అందులోనే పారాసిటమాల్ కాలేయంలోని కణాల మధ్య ఉన్న నిర్మాణ సంబంధాలకు హాని కలిగిస్తుందని గుర్తించారు. దీనివల్ల కాలేయ ఆరోగ్యం దిగజారుతున్నట్టు చెప్పారు.
పారాసిటమాల్ ట్యాబ్లెట్లను మితంగా తీసుకుంటే పరవాలేదు, కానీ పెయిన్ కిల్లర్ అయిన పారాసిటమాల్ ఎక్కువసార్లు దీర్ఘకాలం పాటు తీసుకుంటే తీవ్రమైన కాలేయం వ్యాధులకు కారణం అవ్వచ్చు. ముఖ్యంగా కాలేయం పనిచేయడం ఆపేయొచ్చు. దీనివల్ల సమస్య ప్రాణాంతకంగా మారుతుంది.
పారాసెటమాల్ పెయిన్ కిల్లర్ గా ఎక్కువ మంది వినియోగిస్తారు. అలాగే జ్వరాన్ని తగ్గించడానికి వేసుకుంటూ ఉంటారు. సాధారణంగా అయితే ఇది హాని చేయని మందే. కానీ ఎక్కువగా వేసుకున్నా, దీర్ఘకాలం పాటు వాడినా కాలేయ ఆరోగ్యానికి ముప్పు తప్పదు. ఈ టాబ్లెట్ వేసుకున్నాక అది శరీరంలో విచ్ఛిన్నమవుతుంది. అది విచ్ఛిన్నమయ్యాక కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ రసాయనాలే కాలేయానికి హాని చేస్తాయి. కాలేయంలోని కణాలను ఇది నేరుగా దెబ్బతీస్తుంది. కాబట్టి వైద్యుల సూచన మేరకు పారాసిటమాల్ మాత్రలను వాడడం మంచిది.
ఒక రోజులో పారాసిటమాల్ మాత్రలు మూడు కన్నా ఎక్కువ వేయకూడదు. అంతకన్నా ఎక్కువ వేస్తే సమస్య మొదలయ్యే అవకాశం ఉంది. ఇక 24 గంటల్లో 8 కంటే ఎక్కువ మాత్రలు వేస్తే మరీ ప్రమాదం. వికారం, పొట్టనొప్పి, కామెర్లు వంటి సమస్యలు మొదలవుతాయి. ఊపిరి ఆడక పోవడం, అలసటగా అనిపించడం, పెదవి నీలం రంగులోకి మారడం వంటివి కనిపించవచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
పారాసెటమాల్ వేసుకున్నా అది పనిచేయడానికి ఒక గంట సమయం పడుతుంది. ఒక రోజులో నాలుగుకు మించి ట్యాబ్లెట్లు ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. అంతకుమించి వేసుకుంటే కొత్త సమస్యలు మొదలవుతాయి. అధికంగా ఈ ట్యాబ్లెట్లను తింటే మరణం కూడా సంభవించవచ్చు. గడువు ముగిసిన పారాసెటమాల్ ను వినియోగించకూడదు. వాటిని వెంటనే పడేయాలి.
టాపిక్