Onion Chutney Recipe : ఉల్లిపాయ చట్నీ.. దోసె, ఇడ్లీల కోసం రెండు నెలలు వాడుకోవచ్చు
Onion Chutney For Dosa : ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లోకి ఎక్కువగా పల్లి చట్నీ తింటుంటాం. అలాకాకుండా ఉల్లితో చట్నీ చేయండి. భలే టేస్ట్ ఉంటుంది. లొట్టలేసుకుంటూ తింటారు.
ఉల్లితో తయారుచేసిన పదార్థాలు నోరూరించేలా ఉంటాయి. ఎక్కువగా మామిడికాయ, టమాటా, వంకాయల చట్నీలాంటివి చేసుకుంటాం. అయితే ఉల్లిపాయతో చట్నీ చేసినా బాగుంటుంది. దోసె, ఇడ్లీ, అన్నంలోకి తింటే మళ్లీ తినాలి అనిపిస్తుంది. ఇది పెద్దలే కాదు.. పిల్లలకు కూడా ఇష్టపడతారు.
ఉల్లి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అనేక సమస్యలను నయం చేస్తుంది. ఉల్లిపాయలో అవసరమైన పోషకాలు ఉన్నందున ప్రతిరోజూ తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయలను నేరుగా తినడం ఇష్టం లేకుంటే వాటితో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అందులో ఉల్లిపాయ చట్నీ ఒకటి. కొన్ని ప్రాంతాలలో దీనిని పచ్చడి అని కూడా అంటారు. ఒకసారి తయారు చేస్తే రెండు నెలలపాటు వాడుకోవచ్చు.
ఉల్లిపాయ చట్నీని ఇడ్లీ, దోసె, అన్నం మొదలైన వాటితో ఆస్వాదించవచ్చు. వేడి వేడి అన్నంతో ఉల్లిపాయ చట్నీ, కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి వేరు. ఉల్లిపాయ చట్నీ ఎలా చేయాలో, ఏ పదార్థాలు కావాలో చూద్దాం.
ఉల్లిపాయ చట్నీకి కావల్సినవి
ఉల్లిపాయలు - అర కేజీ, చింతపండు - నిమ్మకాయ సైజు అంత, జీలకర్ర - 1 టేబుల్ స్పూన్, ఆవాలు - 1 టేబుల్ స్పూన్, మెంతి గింజలు - 1 టేబుల్ స్పూన్, నూనె - 1 కప్పు, మిరియాలు - ఐదు, వెల్లుల్లి రెబ్బలు - 15, పసుపు - ఒకటి టేబుల్ స్పూన్, నాలుగు ఎండు మిర్చి, కారం- 4 చిన్న చెంచాలు, ఉప్పు - రుచికి, కొత్తిమీర - 1 చెంచా
ఉల్లిపాయ చట్నీ తయారీ విధానం
ఉల్లిపాయ చట్నీ చేయడానికి ముందుగా చింతపండును నీళ్లలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి ఆవాలు, మెంతులు, కొత్తిమీర, జీలకర్ర వేసి వేయించాలి. వీటిని మిక్సీ జార్‌లో మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో కప్పు నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఒలిచిన వెల్లుల్లి వేసి కలపాలి.
తర్వాత నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఉల్లిపాయ మెత్తగా అయ్యాక మంట తగ్గించాలి.
ఇప్పుడు అందులో ఉప్పు, కరివేపాకు, పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంలో కారం పొడిని కలపాలి.
తర్వాత చిక్కటి చింతపండు రసం వేసి అన్నింటినీ బాగా కలపాలి. నూనె పైకి తేలే వరకు తక్కువ మంట మీద ఉంచండి. నూనె పైకి తేలుతూ ఉంటే, అప్పుడు చట్నీ సిద్ధంగా ఉంది. దీన్ని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోండి.
బయట ఉంచితే పదిరోజులపాటు తాజాగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ చట్నీ నెల నుండి రెండు నెలల వరకు తాజాగా ఉండాలంటే ఫ్రిజ్ లో పెట్టాలి.
దీన్ని దోసె, ఇడ్లీ, అన్నంతో కలిపి తింటే మరింత రుచి వస్తుంది. ఈ రెసిపీని ఇంట్లోనే తయారుచేసుకుని డబ్బాలో భద్రపరుచుకుంటే బాగుంటుంది.