Thursday Motivation: ప్రపంచంలో చీకటి అంతా ఏకమైనా కూడా ఒక్క దీపం వెలుగును ఆపలేవు. అలాగే మీ లక్ష్యానికి సాధించాలన్నా, పట్టుదల తోడైతే మీ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. విజయం సాధించే క్రమంలో ఎన్నో కష్టాలు రావచ్చు, కన్నీళ్లు ఎదురవచ్చు, అవాంతరాలు అడ్డు తగలొచ్చు. కష్టాలు మీ శత్రువులు కాదు. మీ బలాలను, బలహీతల్ని తెలియజేసే నిజమైన మిత్రుడు. సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని కనిపెట్టాలన్నా ఆలోచన వస్తుంది. సమస్య లేకపోతే పరిష్కారమే ఉండదు కాబట్టి సమస్యను స్వీకరించడం నేర్చుకోండి.
విజయం సాధించాలన్న నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరుకోవాల్సిందే. జీవితం ఎప్పుడూ కూడా మనం ఎదురు చూస్తున్నట్టు మారదు. మనమే మన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రయత్నిస్తే అది తప్పకుండా అవుతుంది. మీరు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో ఎదురయ్యే మీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
విజయం సాధించాలన్న పట్టుదలతో పనిచేసిన ప్రతిసారి సత్ఫలితాలు రావాలని కోరుకోవద్దు. ఏ పనీ చేయకపోతే ఏ ఫలితం రాదు కదా. దానికి కావాల్సింది ఓపిక. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఎవరూ తోడు లేకపోవచ్చు, మీకు ఎవరూ తోడు లేకపోయినా మీలో ఉన్న ధైర్యం మిమ్మల్ని కచ్చితంగా లక్ష్యం వైపు నడిపిస్తుంది. కాబట్టి ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ విడవకండి.
సమయం వృధా చేసే అర్థరహితమైన మాటలకన్నా, అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఇతరులతో అనవసర వాదన పెట్టుకోకండి. వాదన పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చి వస్తే నిశ్శబ్దంగా ఉండిపోండి.
మీ లక్ష్య సాధనలో మిమ్మల్ని బాగా ఏది భయపెడుతుందో ఒకసారి కూర్చుని ఆలోచించండి. దేనికైతే మీరు ఎక్కువ భయపడతారో, దేనికైతే ఎక్కువగా మీరు వెనకడుగు వేస్తారో... అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి దానికి ఒక్కసారి ఎదురెళ్లి చూడండి. మీ భయం పోతుంది. దీనివల్ల లక్ష్యసాధన కూడా సులువు అవుతుంది.
మీ లక్ష్యసాధనలో ఒంటరి పోరాటమే చేయాల్సి వస్తుంది. ఎవరి కోసమో వేచి చూసే కన్నా మీరు చేయగలిగింది చేయండి. ఇతరుల మీద ఆశ పెట్టుకుంటే విజయం ఆమడ దూరం వెనక్కి వెళ్తుంది. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు, ఎప్పుడైతే మీలో ఉంటాయో... అప్పుడు మీరు జీవితంలో గెలవబోతున్నారని అర్థం. ఆ గెలుపు కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండండి.