Textovert: ఈ 5 విషయాల గురించి ఎప్పుడూ చాటింగ్ చేయొద్దు. అపార్థాలు, కష్టాలు చుట్టుముట్టేస్తాయ్-never text or chatting about these 5 matters which leads to misunderstandings ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Textovert: ఈ 5 విషయాల గురించి ఎప్పుడూ చాటింగ్ చేయొద్దు. అపార్థాలు, కష్టాలు చుట్టుముట్టేస్తాయ్

Textovert: ఈ 5 విషయాల గురించి ఎప్పుడూ చాటింగ్ చేయొద్దు. అపార్థాలు, కష్టాలు చుట్టుముట్టేస్తాయ్

Koutik Pranaya Sree HT Telugu
Aug 20, 2024 12:30 PM IST

Textovert?: టెక్స్ట్ ఆధారిత సంభాషణలు ‘టెక్స్ట్రోవర్ట్’లకు కంఫర్ట్ జోన్. కానీ ప్రతిదీ టెక్స్ట్ ద్వారా సరిగ్గా వ్యక్తీకరించలేరు. చాటింగ్ లేదా మెసేజ్ ద్వారా చెప్పకూడని విషయాలు కొన్నుంటాయి. అలా వర్చువల్ గా చెప్పేస్తే వాటి విలువ తగ్గుతుంది. కొన్ని విషయాల్లో అపార్థాలు రావచ్చు.

మెసేజ్ ద్వారా చెప్పకూడని విషయాలు
మెసేజ్ ద్వారా చెప్పకూడని విషయాలు (Pixabay/terimakasih0)

ఎక్స్‌ట్రోవర్ట్స్ ఏ విషయాన్నైనా, ఎక్కడైనా మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ఇంట్రోవర్ట్స్ ఏకాంతాన్ని కోరుకుంటారు. ఆచీతూచీ మాట్లాడతారు. మనకు తెలిసిన మనుషుల స్వభావాలు రెండే. కానీ ఈ మధ్య మరో రకం వ్యక్తిత్వం ఉద్భవించింది. వాళ్లే టెక్ట్సో వర్ట్స్. అంటే మెసేజీల ద్వారా ఏ విషయాన్నైనా చాకచక్యంగా, మనిషిని బట్టి చెప్పే రకం. వీళ్లు ఎవరితో చాట్ చేస్తున్నారో దాన్ని బట్టి మెసేజ్ స్టైల్ మార్చేస్తారు. మాటలతో కన్నా మెసేజ్ ద్వారానే వాళ్లనుకున్నది చెప్పడానికి ఇష్టపడతారు. అలానీ ప్రతిదీ మెసేజ్‌లలో చెప్పేయకూడదు. అలా చెప్పకూడని విషయాలు ఏంటో చూడండి.

భావ వ్యక్తీకరణ

భావోద్వేగాలు, ఫీలింగ్స్ మెసేజ్ ద్వాారా తెలియజేయకండి
భావోద్వేగాలు, ఫీలింగ్స్ మెసేజ్ ద్వాారా తెలియజేయకండి (Pexels)

చాటింగ్ చేస్తున్నప్పుడు ఏ ప్రశ్నకైనా కాస్త ఆలోచించుకునే సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. టక్కుమని సమాధానం చెప్పక్కర్లేదు. ఇవన్నీ చాటింగ్ వల్ల వచ్చే సానుకూలతలు అనుకోకండి.. ఇవే చాటింగ్‌లో ఉన్న లోటుపాట్లు. 

ప్రేమ గురించి ప్రపోజ్ చేయడం, మీకు ఒక వ్యక్తి మీదున్న ఆసక్తి తెలియజేయడం లాంటివన్నీ ఈ మధ్య వాట్సాప్, సోషల్ మీడియాల్లోనే జరిగిపోతున్నాయి. దీనివల్ల అపార్థాలకు తావుంటుంది. ముఖాముఖి మాట్లాడుకుంటే మీ భావోద్వేగాలను బాడీ ల్యాంగ్వేజ్ ద్వారా స్పష్టంగా తెలియజేయగలరు. కళ్లలోకి చూసి మాట్లాడటానికి ధైర్యం తెచ్చుకుంటారు. అవతలి వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకుంటారు. అతి గొప్ప బంధమైన ప్రేమను నేరుగా తెలియజేయండి. మెసేజ్ ద్వారా చెప్పి దానికున్న గొప్ప అనుభూతిని మిస్ అవ్వకండి. 

క్షమాపణలు

క్షమాపణలు చాటింగ్ లో చెప్పకండి
క్షమాపణలు చాటింగ్ లో చెప్పకండి (Pexels)

మెసేజ్ ద్వారా క్షమాపణలు తెలియజేస్తే ఏదో మొక్కబడికి చెప్తున్నారనిపిస్తుంది. మీ గొంతు ధ్వనించకుండా మీరు చెప్పే మాటలు కొన్నిసార్లు వ్యంగ్యంగానూ అనిపించొచ్చు. మీరు నిజంగా ఒక విషయం గురించి విచారిస్తున్నా, అపరాధ భావంతో బాధపడుతున్నా మెసేజీలలో అతి ప్రతిబింబించదు. కాబట్టి నిజమైన క్షమాపణలు కోరాలంటే నేరుగానే మాట్లాడండి.

బ్రేకప్

బ్రేకప్
బ్రేకప్ (Pexels)

ఒక మెసేజ్ ద్వారా బ్రేకప్ చెప్పడం అనేది నిజంగా అమానవీయ సంఘటన. ఒక మనిషి మనసుకు మీరు ఏమాత్రం విలువ ఇవ్వనట్లే లెక్క. ఒక బంధాన్ని అగౌరవంగా ముగిస్తున్నట్లే. ఎందుకంటే మెసేజ్ స్పష్టంగా మీరనుకున్నది తెలియజేయదు. ప్రపోజ్ చేయాలన్నా, బ్రేకప్ చెప్పాలన్నా ధైర్యం కావాలి. ఈ రెండు విషయాల్లో అపార్థాలకు తావు ఎక్కువ. కాబట్టి ఇంత ముఖ్యమైన విషయాన్ని మెసేజ్ చేసి చెప్పకండి.

సీక్రెట్స్

రహస్యాలు చెప్పడానికి చాటింగ్ మంచిది కాదు
రహస్యాలు చెప్పడానికి చాటింగ్ మంచిది కాదు (Pexels)

రహస్యం అంటేనే దాచి ఉంచేది. గాలిలో మాటల్లాగా, నీటి మీద రాతల్లాగా వెంటనే కనుమరుగై పోవాలి. అంతేకానీ మెసేజ్ ద్వారా అలాంటి విషయాలు ఎవరితోనూ పంచుకోకూడదు. మెసేజ్ చేసిన స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ అనుమతి దీనికేం అక్కర్లేదు. దీంతో లేనిపోని చిక్కుల్లోపడతారు. కాబట్టి వేరెవరికీ తెలియకూడని రహస్యం ఏదైనా సరే నేరుగా మాట్లాడి చెప్పండి. అంతేగానీ టెక్ట్స్ ద్వారా కాదు. 

ముఖ్యమైన కబురు

 

మంచి కబుర్లు చాటింగ్ ద్వారా చెప్పకండి
మంచి కబుర్లు చాటింగ్ ద్వారా చెప్పకండి (Pexels)

మీరు సాధించిన విజయమైనా, ముఖ్యమైన మైలు రాయి అయినా మెసేజ్ ద్వారా చెప్పి దాని విలువ తగ్గించకండి. ఎమోజీలు పెట్టి చాటింగ్ చేసినంత మాత్రానా భావోద్వేగాలు మాత్రం అవతలి వ్యక్తికి చేరవు. అంత అర్థ వంతగానూ ఉండవు. ఎదుటి వ్యక్తి ఆనందంతో వేసే అరుపుల్ని, కేకల్ని వినడం మిస్ అయిపోతారు. కాబట్టి నేరుగా కలుసుకునో, లేదంటే ఫోన్లో మాత్రమే ఈ వార్తల్ని పంచుకోండి.

టాపిక్