WednesDay Motivation: ప్రకృతే మనిషికి మొదటి పాఠశాల, నేర్చుకోవాలే కానీ ప్రకృతిని మించి పరమగురువు లేరు
WednesDay Motivation: ఈ ప్రపంచంలో ప్రకృతిని మించిన పరమ గురువు ఎవరూ లేరు. ప్రకృతి సహాయంతోనే మనిషి ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రకృతి నుంచి మనిషి నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది.
WednesDay Motivation: ప్రకృతిని మించిన పరమ గురువు మనిషికి లేడు అన్నది అందరికీ తెలిసిన రహస్యమే. నేర్చుకోవాలే కానీ ప్రకృతి నేర్పనిది లేదు. మనిషి ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రకృతి నియమాలను తీక్షణంగా పరిశీలిస్తే మనిషికి అర్థమవుతుంది ఎలా జీవించాలో.
ప్రకృతిలో ఏదైనా కూడా మొదట జనిస్తుంది. ఆపై పెరుగుతుంది. తనని తనను పోషించుకుంటుంది. తన నుంచి ఉత్పత్తి చేస్తుంది. తరువాత క్షీణించడం మొదలు పెడుతుంది. ఇక చివరి దశ మరణించడం. ప్రకృతిలో పుట్టే ఏ జీవి అయినా, ఏ ఉత్పత్తి అయినా ఇదే పద్ధతిలో ప్రయాణం చేస్తాయి.
విత్తుల నుంచి వృక్షాలు ఎదిగినట్టే... పుడమిపై ఎన్నో తమంతట తామే మొలకెత్తి జీవించడం ప్రారంభిస్తాయి. ఆహారాన్ని వెతుక్కుంటాయి. తమ నుంచి తమ జాతులను సృష్టిస్తాయి. చివరికి అదే భూమిలో కలిసిపోతాయి. ఇదే ప్రకృతిలోని జీవన చక్రం. మొక్క నుంచి జీవి వరకు ప్రతి ఒక్కటి ఇదే జీవన చక్రంలో తిరుగుతూ ఉంటుంది.
ప్రకృతిలో కనిపించే ప్రతి జీవి మనకు ఏదో ఒక విషయాన్ని నేర్పేందుకే ఉంటుంది. ఉదాహరణకు ఒక సాలెపురుగును తీసుకోండి. ఆ చిన్న సాలెపురుగు సాలెగూడును ఎంత నైపుణ్యంగా నిర్మిస్తుందో చూడండి. చీమలు కూడా తమ పుట్టను నిర్మించడంలో ఎంతో సహనాన్ని ప్రదర్శిస్తాయి. ఇవన్నీ కూడా మనిషి చూసి నేర్చుకోవాల్సినవే. తల్లి పక్షి తన పిల్లలకు ఎగరడం నేర్పే విధానం కూడా ఎంతో ఆదర్శనీయంగా ఉంటుంది. మనిషి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి నుంచి ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకోవచ్చు.
చీమలు, సాలీడులు, పక్షులు... అన్నీ ఒక క్రమశిక్షణతో జీవిస్తాయి. మనిషి తప్ప ఇవేవీ తమకు ఆకలి వేసినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఇతర జీవులను చంపడానికి గాని, ఇతర జీవుల ఆస్తులను నాశనం చేయడానికిగానీ చూడవు. కేవలం ఆకలి వేసినప్పుడు లేదా తమకు ప్రాణ భయం ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి జీవి పై దాడి చేసేందుకు సిద్ధపడతాయి. కానీ మనిషి మాత్రమే తన స్వార్థం కోసం, స్వలాభం కోసం, డబ్బు కోసం ఆస్తులు, అంతస్తుల కోసం ఎదుటి జీవిని హింసించడం, చంపడం వంటివి చేస్తున్నాడు. ప్రకృతిలో ఈ పద్ధతి లేనేలేదు. ప్రకృతిని తొలి గురువుగా స్వీకరించిన ఏ మనిషి కూడా ఎదుటి మనిషి పై దాడి చేయలేడు.
మన ఆధ్యాత్మిక వ్యవస్థలో దత్తాత్రేయుడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ప్రకృతిని తన గురువుగా స్వీకరించారు. ప్రకృతి నుంచే తను అన్ని నేర్చుకున్నాను అని కూడా చెప్పారు. మనిషి కూడా ప్రకృతిలోని వివిధ జంతువుల నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి.
భూమిని దున్నినా, అపరిశుభ్రం చేసిన అది జీవుల శ్రేయస్సునే కోరుకుంటుంది. భూమిని చూసి మనిషి సహనాన్ని, ఓపికను నేర్చుకోవాలి. ఇక సముద్రంలాగా మనిషి పరిపూర్ణంగా ఉండాలి. నదులన్నీ పొంగిపొర్లుతూ తనలో చేరినా సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో మనిషి కూడా ఎలాంటి చంచలత్వం లేకుండా గంభీరంగా జీవించడం నేర్చుకోవాలి.
చీమ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఆకలేసినా ఎదుటివారి ఆహారాన్ని దొంగిలించదు. కష్టపడి సంపాదించేందుకే ప్రయత్నిస్తుంది. అలాగే క్రమశిక్షణను కూడా తప్పదు. కాబట్టి చీమ నుంచి నిజాయితీని క్రమశిక్షణలో నేర్చుకోవాలి. ఇలా పరిశీలించి చూడాలే కానీ ప్రకృతిలోని ప్రతి జీవి మనకి ఏదో ఒకటి నేర్పేందుకే సిద్ధంగా ఉంటుంది. మనిషి ధనవంతుడిగా కాదు.. గొప్ప వ్యక్తిగా బతికేందుకు ప్రయత్నించాలి. మంచి పేరు తెచ్చుకోవాలి.