Munakkaya Pulusu Recipe: ఎప్పుడూ మునక్కాయ కూనే కాదు, ఓసారి మునక్కాయ పులుసు చేసి చూడండి, వేడి వేడి అన్నంలో రుచిగా ఉంటుంది
Munakkaya Pulusu Recipe: మునక్కాయ, టమోటో కలిపి చేసే కర్రీ రుచిగా ఉంటుంది. ఈ కూర ప్రతి తెలుగింట్లో కనిపిస్తుంది. ఎప్పుడు ఇలా కూరనే కాదు ఓసారి మునక్కాయ పులుసు వండి చూడండి, రెసిపీ అదిరిపోతుంది.
Munakkaya Pulusu Recipe: మునక్కాయలతో చేసే వంటకాలు అంటే తెలుగు వారికి ఎంతో ఇష్టం. సాంబార్లో జతగా వేసుకుంటార, టమోటో మునక్కాడ కూరగా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు.మునక్కాడలతో ఒకసారి పులుసు చేసుకొని చూడండి. ఎప్పుడూ సాంబారు, చారు పెట్టుకునే వారికి ఈ మునక్కాడ పులుసు చాలా రుచిగా అనిపిస్తుంది. దీని చింతపండు వేసి చేస్తాము కనుక రుచి రెట్టింపు అవుతుంది. మునక్కాడ పులుసు ఒకసారి చేసుకుంటే రెండు పూటలకు సరిపడా వస్తుంది. రెసిపీ చాలా సులువు.
మునక్కాడ పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు
మునక్కాడ ముక్కలు - పది
టమాటోలు - రెండు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
ధనియాల పొడి - ఒక స్పూను
చింతపండు - నిమ్మకాయ సైజులో
నీరు - తగినంత
కరివేపాకులు - గుప్పెడు
నూనె - రెండు స్పూన్లు
మెంతులు - పావు స్పూను
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి సెనగపప్పు - అర స్పూను
మినప్పప్పు - అర స్పూను
మునక్కాడల పులుసు రెసిపీ
1. మునక్కాడలను మీకు నచ్చిన సైజులో కోసి పెట్టుకోండి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
3. నూనెలో ముందుగా మెంతులను వేసి వేయించండి.
4. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి.
5. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి.
6. ఆ తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
7. ఉల్లిపాయలు మెత్తగా ఉడికాక కోసి పెట్టుకున్న టమోటాలను వేసి మెత్తగా అయ్యేవరకు పైన మూత పెట్టి ఉడికించాలి.
8. ఉప్పు వేస్తే టమాటాలు త్వరగా ఉడికిపోతాయి.
9. ఇప్పుడు టమోటాలలో, కరివేపాకులు కూడా వేసి వేయించుకోవాలి.
10. అలాగే మునక్కాడ ముక్కలను వేసి కలుపుకోవాలి.
11. పసుపు, కారం, ధనియాల పొడి వేసి అంతటినీ ఒకసారి కలుపుకోవాలి.
12. ఇప్పుడు ముందుగా చింతపండు నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి.
13. ఆ నీళ్లను కూడా వేసి బాగా కలపాలి. మీకు పులుసు ఏ పరిమాణంలో కావాలనుకుంటున్నారో అన్ని నీళ్లను వేసుకోవాలి.
14. రెండు గ్లాసుల నీళ్లు వేస్తే సరిపోతుంది. పైన మూత పెట్టి ములక్కాడలు ఉడికేవరకు ఉడికించుకోవాలి. స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ మునక్కాడల పులుసు రెడీ అయినట్టే.
15. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.
16. ఎప్పుడూ సాంబారు, రసమే కాదు ఇలా ములక్కాడల పులుసును కూడా ప్రయత్నించండి.
మునక్కాయలను మన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది. మునక్కాడల్లోనూ, మునగ ఆకుల్లోనూ మనకి అవసరమైన పోషకాలు నిండుగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి మునక్కాడల్ని తినడం వల్ల జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు త్వరగా రాకుండా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు కూడా మునక్కాడలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆస్తమా, దగ్గుతో బాధపడేవారు, గురక పెట్టేవారు, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు మునగ ఆకులను, మునక్కాయలను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం. వారంలో రెండు నుంచి మూడుసార్లు మునక్కాయలను తిని చూడండి. మీకు ఎన్నో పోషకాలు అందుతాయి. రోగ నిరోధక వ్యవస్థ కూడా బలంగా మారుతుంది.
టాపిక్