Mughlai Egg Curry: క్రీమీ మొగలాయీ ఎగ్ కర్రీ.. సులువుగా చేసుకోండి..
Mughlai Egg Curry: డ్రై ఫ్రూట్స్ దట్టించిన మసాలాలతో చేసే మొగలాయీ ఎగ్ కర్రీ రుచి అదిరిపోతుంది. దీన్నెలా తయారు చేయాలో చూసేయండి.
మొగలాయీ ఎగ్ కర్రీ (freepik)
ఎగ్ కర్రీ ఎప్పుడూ ఒకేలా తినడం బోర్ కొట్టేస్తుంటే ఒకసారి కాస్త విభిన్నంగా మంచి మసాలాలతో చేసిన మొగలాయీ ఎగ్ కర్రీ ప్రయత్నించండి. ఈ కూరకు చేసే గ్రేవీ చిక్కగా, క్రీమీగా, రుచిగా ఉంటుంది. ఇది డ్రై ఫ్రూట్స్ వాడి చేసే మొగలాయీ వంటకం. ఈ కూర నాన్స్ లోకి, చపాతీలోకి, రైస్ లోకి కూడా తినొచ్చు.
కావాల్సిన పదార్థాలు:
4 గుడ్లు
3 చెంచాల వంటనూనె
2 యాలకులు
1 చెంచా షాజీరా
1 కప్పు ఉల్లిపాయ ముక్కలు
1 చెంచా అల్లం ముక్కలు
సగం చెంచా అల్లం ముద్ద
2 చెంచాల బాదాం తురుము
2 పచ్చిమిర్చి, ముక్కలు
సగం చెంచా పసుపు
1 చెంచా కారం
1 చెంచా గరం మసాలా
పావు చెంచా కుంకుమ పువ్వు
కొద్దిగా కొత్తిమీర తురుము
తయారీ విధానం:
- ముందుగా గుడ్లను ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. పెంకు తీసి గుడ్డును రెండు సగాలుగా చేసుకుని పెట్టుకోవాలి.
- కడాయిలో 2 చెంచాల నూనె వేసుకుని వేడి అవ్వనివ్వాలి. అందులో షాజీరా, యాలకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, బాదాం, అల్లం ముక్కలు, వేసుకుని వేగనివ్వాలి. ఒక అయిదు నిమిషాలు వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- కడాయిలో నూనె వేసుకుని మిక్సీ పట్టుకున్న ముద్ద, అల్లం ముద్ద, మిగతా మసాలాలు, ఉప్పు, కొద్దిగా నీళ్లుపోసుకుని కలుపుకోవాలి. నూనె తేలేదాకా ఈ ముద్దను సన్నం మంట మీద ఉడకనివ్వాలి.
- ఇప్పుడు గుడ్లు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటూ మూతపెట్టి ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర, బాదాం ముక్కలు వేసుకుని దించేసుకుంటే చాలు.
టాపిక్