Dry Ginger benefits: అల్లం కంటే శొంఠి వాడితే ఎక్కువ ప్రయోజనమా?-ginger vs dry ginger know health benefits of dry ginger ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Ginger Vs Dry Ginger, Know Health Benefits Of Dry Ginger

Dry Ginger benefits: అల్లం కంటే శొంఠి వాడితే ఎక్కువ ప్రయోజనమా?

HT Telugu Desk HT Telugu
Sep 07, 2023 03:38 PM IST

Dry Ginger benefits: ఎండిన అల్లాన్ని శొంఠి అంటాం. మామూలు అల్లంతో పోలిస్తే దీనికున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకోండి.

శొంఠి లాభాలు
శొంఠి లాభాలు (freepik)

మన భారతీయ వంటల్లో పూర్వ కాలం నుంచి అల్లం వాడకం ఎక్కువగా ఉంది. దీనికి ఉండే ఘాటు వాసన వల్ల వంటలకు ఇది అమోఘమైన రుచిని ఇస్తుంది. అందుకనే మాంసాహారం, శాకాహారం అనే తేడా లేకుండా అన్నింటిలోనూ దీన్ని వాడతుంటారు. అయితే తాజా అల్లం మంచిదా? ఎండ బెట్టిన అల్లం మంచిదా? అని ఈ మధ్య కాలంలో చర్చలు జరుగుతున్నాయి. మనం శొంఠి అని పిలుస్తుంటాం కదా. దాన్నే డ్రై జింజర్‌, లేదా పొడి అల్లం అనీ పిలుస్తుంటారు. ఈ రెండింటిలో ఏది తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సందేహాలు వెల్లడవుతున్నాయి. ఇవి రెండూ దేనికదే ప్రత్యేకమైన సువాసనతో నిండి ఉంటాయి. అయితే తాజా అల్లంతో పోలిస్తే శొంఠితో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

శొంఠి లాభాలు:

కొంచెంలో ఎక్కువ ఔషధాలు:

అల్లంలో జింజెరాల్‌ అనే కాంపౌండ్‌ ఉంటుంది. దీని వల్ల అల్లానికి ఘాటు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లనూ ఇది కలిగి ఉంటుంది. అదే డ్రై జింజర్‌లో అయితే పూర్తిగా తేమ ఉండదు. అందుకనే చాలా కొంచెం శొంఠిలోనే ఈ లక్షణాలు ఎక్కువగా చేరి గాఢంగా ఉంటాయి. దీని వల్ల శరీరం లోపల అవాంఛితంగా వచ్చే వాపుల్లాంటివి నియంత్రణలోకి వస్తాయి.

వంటలో కొంచెం చాలు:

ఎప్పుడైనా తాజా అల్లం అందుబాటులో లేనప్పుడు వంటల్లో డ్రై జింజర్‌నీ వాడొచ్చు. అయితే శొంఠి మామూలు అల్లంతో పోలిస్తే ఘాటుగా ఉంటుంది. అందుకని దాన్ని అల్లం వేసినట్లుగా ఎక్కువ పరిమాణంలో వేయకూడదు. బదులుగా చిటికెడు శొంఠి పొడి అయినా సరిపోతుంది. అల్లం కంటే ఎక్కువ ఘాటును అది కూరకు అందిస్తుంది.

జీర్ణానికి:

తాజా అల్లమైనా, శొంఠి అయినా జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. అయితే శొంఠిలో ఈ లక్షణాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యల నుంచి ఇది మెరుగైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీనిలో ఉన్న ఔషధ లక్షణాల వల్ల జీర్ణానికి అవసరమైన ఎంజైములు తగినంత స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైనా కడుపు కాస్త నొప్పిగా అనిపించినా, మలబద్దకం అనిపించినా దీన్ని ఉపయోగించడం వల్ల చక్కని ఫలితాలుంటాయి.

వైద్యంలోనూ శొంఠి:

భారతీయ సంప్రదాయ వైద్యాలు, ఆయుర్వేద మందులు తదితరాల్లో అల్లంతో పోలిస్తే శొంఠిని ఎక్కువగా ఉపయోగిస్తారు. జలుబు, కఫం, వికారం.... తదితర ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఇది చక్కని మందులా పని చేస్తుంది. ఈ విషయంలో మాత్రం అల్లం కంటే శొంఠి ఎక్కువ ప్రభావవంతంగా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు.

WhatsApp channel