Morning Mantras | ఉదయం లేవగానే ఈ మంత్రాలు జపిస్తే మీకు తిరుగే లేదు!-morning mantras to chant offer prayers and have a blessed day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Mantras | ఉదయం లేవగానే ఈ మంత్రాలు జపిస్తే మీకు తిరుగే లేదు!

Morning Mantras | ఉదయం లేవగానే ఈ మంత్రాలు జపిస్తే మీకు తిరుగే లేదు!

Manda Vikas HT Telugu
Jul 25, 2022 06:52 AM IST

ఉదయం లేవగానే ఈ మంత్రాలు పఠిస్తే రోజంతా గొప్పగా గడుస్తుంది. ఎలాంటి ప్రతికూల శక్తి మీపై ప్రభావం చూపదు. సానుకూల దృక్పథం ఉంటుంది. శుభ ఫలితాలు ఉంటాయి.

<p>Morning Prayer</p>
Morning Prayer (Unsplash)

ప్రతిరోజూ మంచి రోజు కావాలని అందరూ కోరుకుంటారు. ఉదయాన్నే లేచి తమకు ఈరోజు బాగుండాలని ప్రార్థించేవారు ఎందరో మంది ఉంటారు. సానుకూలతలను మీవైపు ప్రసరింపజేసే శక్తి ఈ ప్రార్థనకు ఉంది. ప్రార్థన అంటే మరేమిటో కాదు అది కూడా కొన్నిక్షణాల పాటు ఏకాగ్రతతో చేసే ఒక ధ్యానం లాంటిది. సనాతన ధర్మాలలో మానసిక ప్రశాంతతను కలుగజేసే ప్రార్థనలు, జపించటానికి మంత్రాలు ఎన్నో ఉన్నాయి. రోజు ఎంత బాగా ప్రారంభమైతే ఆ రోజంతా అంత బాగుంటుందని అంటారు. మరి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం ద్వారా అది మీ వ్యక్తిగత జీవితానికి ఎన్నో విధాల మేలు చేస్తుంది.

నిద్ర లేవగానే మీరు చూసే మొదటి విషయం మీ రోజు ఎంత మంచిగా లేదా చెడుగా ఉంటుందో నిర్ణయిస్తుందని ఒక నమ్మకం ఉంది. అయితే అధ్యాత్మిక చింతన కలిగి ఉంటే ఎలాంటి ప్రతికూల ప్రభావాలు మీ దరి చేరవు. ఇందుకోసమే మీరు ఉదయం లేవగానే చదివేందుకు ఇక్కడ కొన్ని మంత్రాలను అందజేస్తున్నాము. వీటిని పఠించటం ద్వారా మీ రోజు గొప్పగా గడుస్తుంది. కాబట్టి ఉదయం లేవగానే ఏం చూడాలి? ఎలాంటి మంత్రాలు జపించాలి ఇక్కడ తెలుసుకోండి.

Morning Mantras ఉదయం లేచి ఈ మంత్రాలు జపించండి

మన అరచేతుల్లో ముక్కోటి దేవతలు ఉంటారని చెబుతారు. అరచేతి కొనలో లక్ష్మి (శ్రేయస్సు దేవత) నివసిస్తుంది, మధ్యలో సరస్వతి (జ్ఞాన దేవత) నివసిస్తుంది. అలాగే అడుగుభాగంలో గౌరి (జీవిత దేవత) దాని నివసిస్తుంది. కాబట్టి, మీరు నిద్రలేచిన వెంటనే మీ అరచేతిని చూసి, ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి.

ఈ మంత్రాన్ని ఉదయం సూర్యోదయానికి ముందు జపించాలి. ఈ మంత్రాన్ని పఠించే ముందు, చేతిని చూస్తూ అరచేతులను చదవాలి.

కరాగ్రే వసతు లక్ష్మీ, కరామధ్యే సరస్వతి,

కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కర దర్శనం!

తరువాత భూదేవి ప్రార్థన చేయాలి. మన భారాన్ని మోసేది భూమాత. నిద్రలేవగానే మొదటి అడుగు నేలపై పెట్టే ముందు ఓ భూతల్లి మమ్ములను క్షమించమంటూ ఆ తల్లిని ప్రసన్నం చేసుకునే ప్రార్థన చేయాలి. అందుకు ఈ మంత్రం చదవాలి.

సముద్ర వాసనే దేవి, పర్వత స్థాన మందితే,

విష్ణు పత్ని నమస్తుభ్యం, పద స్పర్శం క్షమాశ్వ మే!

మనం మన రోజువారీ కార్యక్రమాలలో ఏ కార్యమైనా ప్రారంభించే ముందు మన జన్మకు కారణమైన దేవుళ్ళను ప్రార్థించాలి. ఈ మంత్రంతో మనకు శుభం కలిగించమని భగవంతుడిని వేడుకుంటున్నాము.

బ్రహ్మే ముహూర్తే చోథాయ చింతయేదాత్మనో హితం

స్మరణం వాసుదేవస్య కుర్యాత్ కలిమలాపహరమ్!

ఏడు మహాసముద్రాలు, ఏడు పర్వతాలు, ఏడు ఋషులు, ఏడు అడవులు, ఏడు ద్వీపాలు, ఏడు లోకాలు. ఈ ఉదయం నాకు గొప్పగా ఉండనివ్వండి అంటూ ప్రకృతిలోని శక్తులను వేడుకునే ప్రార్థన

శతార్ణ్వ సప్త కులాచలశ్చ,

సప్తర్షయో ద్వీప పావననీ సప్త,

భూరధి క్రుత్వా, భువనై సప్త,

కుర్వన్తు మమ సుప్రభాతం!

సూర్యుడు సకల జీవాలకు కనిపించే దేవుడు. శక్తికి మూలం సూర్యభగవానుడే. కాబట్టి ఉదయం లేవగానే సూర్యోదయం సమయంలో తూర్పువైపుకి తిరిగి దీర్ఘాయువు, సంపద, తెలివితేటల ప్రసాదించాలని సూర్య భగవానుణ్ని ప్రార్థించాలి.

భానో, భాస్కర మార్తాండ, చంద రస్మయి, దివాకరా..

ఆయుర్, ఆరోగ్యం, బుద్ధిమ్, శ్రీ యమశ్చ దేహి మే!

మీరు హిందూ ధర్మాన్ని ఆచరించే వారైతే ప్రతిరోజు నిద్రలేవగానే ఈ మంత్రాలు పఠించండి. సానుకూల శక్తిని, మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం