Moongdal Nuggets: పెసరపప్పు నగ్గెట్స్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
Moongdal Nuggets: నగ్గెట్స్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇవి క్రిస్పీగా ఉంటాయి. ఇంట్లో కూడా వీటిని తేలికగా చేసుకోవచ్చు. పెసరపప్పుతో వీటిని సులువుగా చేయవచ్చు.
Moongdal Nuggets: పెసరపప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి పెసరపప్పుతో స్నాక్స్ ను తయారు చేసుకుని తింటే మంచిది. ఇక్కడ మేము మూంగ్ దాల్ నగ్గెట్స్ రెసిపీ ఇచ్చాం. పెసరపప్పుతో చేసే నగ్గెట్స్ చేయడం చాలా సులువు. రుచి కూడా అదిరిపోతుంది. క్రిస్పీగా వస్తాయి. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.
పెసరపప్పు నగ్గెట్స్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పెసరపప్పు - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
క్యారెట్ తురుము - పావు కప్పు
బ్రెడ్ - మూడు స్లైసులు
కారం - అర స్పూను
మిరియాల పొడి - పావు స్పూను
చాట్ మసాలా - రెండు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
నూనె - సరిపడినంత
పెసరపప్పు నగ్గెట్స్ రెసిపీ
1. పెసరపప్పును శుభ్రంగా కడిగి మూడు గంటలు నానబెట్టాలి.
2. వీటిని కుక్కర్లో వేసి రెండు గ్లాసుల నీళ్లు వేసి ఉడికించాలి.
3. పప్పు సగం వరకు ఉడికితే చాలు. తర్వాత స్టవ్ కట్టేయాలి.
4. నీటిని వడకట్టి పప్పును ఒక గిన్నెలో వేయాలి. పప్పును చల్లబరచాలి.
5. ఈ పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
6. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కరివేపాకులు వేసి బాగా కలుపుకోవాలి.
7. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
8. ఆ తర్వాత జీలకర్ర, చాట్ మసాలా, మిరియాల పొడి, కారం వేసి బాగా కలుపుకోవాలి.
9. బ్రెడ్ ముక్కలను పొడిలా చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
10. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, నీళ్లు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
11. ఇప్పుడు పెసరపప్పు మిశ్రమాన్నినగ్గెట్స్ లాగా చేతితోనే ఒత్తుకోవాలి.
12. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కాక ఈ పెసరపప్పు పిండితో చేసిన నగ్గెట్స్ ను ఒకసారి కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పొడిలో ఇటు అటు దొర్లించాలి.
13. తర్వాత తీసి నూనెలో వేసి వేయించాలి. రెండు వైపులా ఎర్రగా కాగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
14. అంతే క్రిస్పీ మూంగ్ దాల్ నగ్గెట్స్ రెడీ అయినట్టే.
15. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
ముఖ్యంగా పిల్లలకు ఇది ఎక్కువగా నచ్చుతుంది. టమోటో సాస్ లో ఉంచుకొని తింటే రుచి అదిరిపోతుంది. అలాగే మయోనెస్ లో తిన్నా కూడా బాగుంటుంది. ఎలాంటి సైడ్ డిష్‌లు లేకపోయినా ఈ నగెట్స్ తినాలనిపించేలా ఉంటాయి.