Montra Electric 3W । ఎలక్ట్రిక్ సూపర్ ఆటోరిక్షా.. ఒక్క ఛార్జ్‌తో 197 కిమీ రేంజ్!
దేశీయ EV కంపెనీ Montra Electric 3W పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోను విడుదల చేసింది. ఇప్పుడు ఉన్న ఆటోలతో పోలిస్తే ఇదొక సూపర్ ఆటోరిక్షాగా చెప్పవచ్చు. దీని ప్రత్యేకతలు చూడండి.
ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. స్టార్టప్ కంపెనీల నుంచి ప్రసిద్ధ ఆటోమొబైల్ బ్రాండ్ ల వరకు EVలను విడుదల చేస్తున్నాయి. స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, కార్లలో ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ వెర్షన్ వాహనాలు లాంచ్ అయ్యాయి. ఆటోరిక్షాలలో కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్లు వచ్చేస్తున్నాయి.
తమిళనాడుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Ti క్లీన్ మొబిలిటీ తాజాగా భారత మార్కెట్లో Montra Electric 3W పేరుతో ఒక త్రీవీలర్ ను విడుదల చేసింది. మోంట్రా ఎలక్ట్రిక్ సూపర్ ఆటోరిక్షా ధర ఎక్స్-షోరూం వద్ద రూ. 3.02 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.
సరికొత్త మోంట్రా ఎలక్ట్రిక్ 3W ఆటో అనేక ఫీచర్లతో పాటు క్లాస్-లీడింగ్ మైలేజీని అందిస్తుంది. ఆదర్శవంతమైన డ్రైవింగ్ లో ఫుల్ ఛార్జ్ మీద ఈ ఎలక్ట్రిక్ సూపర్ ఆటో సుమారు 197 కిమీ రేంజ్ అందించగలదు.
మోంట్రా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను ప్రత్యేకమైన యాప్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో డ్రైవర్- ప్రయాణికుల కోసం పలు ఉపయోగకరమైన సేవలు అందుబాటులో ఉంటాయి. లొకేషన్ ట్రాకింగ్, డిజిటల్ ఫైనాన్సింగ్, 24 x 7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఛార్జింగ్ స్టేటస్, డాక్యుమెంట్ హోల్డర్, ఎర్నింగ్ లెడ్జర్, సర్వీస్ బుక్ మొదలైన వివరాలు వివిధ ప్రాంతీయ భాషల్లో పొందవచ్చు.
Montra Electric 3W డిజైన్
మోంట్రా ఎలక్ట్రిక్ 3W ఆటో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్ పరిశీలిస్తే.. ప్రస్తుతం చలామణీలో ఉన్న సాధారణ ఆటోలతో పోలిస్తే చాలా విశాలంగా ఉంటుంది. బలమైన మెటల్ బాడీ కారణంగా , కారు లాంటి పైకప్పు , పెద్ద విండ్ షీల్డ్ ఏరోడైనమిక్ లుక్ అలాగే స్టైలిష్ సేఫ్టీ డ్యూయల్ డోర్లు కూడా ఇచ్చారు.
Montra Electric 3W బ్యాటరీ, స్పెసిఫికేషన్లు
ఈ ఎలక్ట్రిక్ ఆటో 10kwh అలాగే 7 kWh సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 10kwh బ్యాటరీ 197km (ARAI సర్టిఫైడ్) రేంజ్ అందిస్తుంది. అయితే కంపెనీ ప్రకారంగా ఈ ఆటో సుమారు 155 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.
ఈ బ్యాటరీ ప్యాక్ 60Nm అత్యుత్తమ గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆటో 4 సెకన్లలోనే 0-20 కిమీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 55 కిలో మీటర్లు.
ఇంకా ఈ సూపర్ ఆటో రివర్స్ పార్కింగ్ సహా 5 గేర్‌లను కలిగి ఉంది. బహుళ డ్రైవ్ మోడ్‌లను కూడా అందిస్తుంది. ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలో పార్క్ అసిస్ట్ మోడ్ కూడా ఉంది.
ప్రస్తుతం 40 డీలర్ల ద్వారా దక్షిణ భారతంలో ఈ ఎలక్ట్రిక్ ఆటోలను కంపెనీ విక్రయించనుంది. 2023 నాటికి భారతదేశమంతటా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.
సంబంధిత కథనం