Monday motivation: అత్యాశకు ఆశకు తేడా ఎంతో.. ఆశతో ఆనందం అత్యాశతో అనర్థం
Monday motivation: అత్యాశ వల్ల కలిగే అనర్థాలు అనేకం. ఏ విషయంలో అయినా సరే అత్యాశ పడితే చివరికి మిగిలేది దు:ఖం మాత్రమే.
కోరికలు, ఆశలు లేని జీవితానికి అర్థం లేదు అనిపిస్తుంది. ఒక రకంగా మన జీవితాన్ని ముందుకు నడిపించేవి కోరికలు మాత్రమే. రేపటి రోజుల్లో ఏదో కొనాలనో, ఏదో సాధించాలనో ఆశ మనం రోజూ కొత్త ఉత్సాహంతో పనిచేసేలా చేస్తుంది. ఆశ అంటే చెడు అర్థం ఉన్న పదం కాదు. ఏ ఆశా లేని జీవి జీవితం జీవితమే కాదు. ఇక అన్నీ సాధించేశాం అని కష్టపడకుండా అలా కూర్చుని తింటూ ఆనందంగా ఉండటం అసాధ్యం. అలా ఉంటే ఏదో ఒక రోజు మన మీద మనకే అనాసక్తి వస్తుంది.
అలాగని అత్యాశ ఉన్నా.. జీవితం ఆనందమయం ఎప్పటికీ కాలేదు. మన తాహతు, ఓపిక, శక్తి.. వీటన్నింటిని బేరీజు వేసుకున్నాకే దేనిమీదయినా ఆశపడాలి. దురాశ దు:ఖానికి చేటు అనే సామెత మన చిన్నప్పటి నుంచీ వింటున్నాం. ఒక మనిషి నిన్ను ప్రేమించాలి అనుకోవడం ఆశ. కేవలం నిన్నే ప్రేమించాలి అనుకోవడం, వాళ్ల జీవితంలో ఇంకెవరూ ఉండకూడదు అనుకోవడం అత్యాశ. రోజుకు పది గంటలు కష్టపడి డబ్బులు సంపాదించాలి అనుకోవడం ఆశ. తిండీ తిప్పలు మాని 24 గంటలు డబ్బు కోసమే ఆలోచిస్తే అత్యాశ. ఒకసారి పరీక్ష రాసినప్పుడు అదృష్టం కలిసొస్తే బాగుండు అనుకోవడం ఆశ. ఎప్పుడూ అదృష్టం తోనే పరీక్షల్లో నెగ్గాలి అనుకోవడం అత్యాశ.
ఒకసారి ఒక పేద రైతు పొలం దున్నుతూ..'దేవుడా నా కష్టాల్ని తీర్చే మార్గం చూపవా' అంటూ దేవుణ్ని ప్రార్థిస్తాడు. వెంటనే అకస్మాత్తుగా నాగలికి ఏదో తగిలినట్లు అనిపించి చూస్తే, చిన్న పెట్టె దొరుకుతుంది. అంతలోనే ఆకాశవాణి వచ్చి ఇలా చెబుతుంది.. 'ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. చేయి పెట్టిన ప్రతిసారీ ఒకటి తప్పకుండా దొరుకుతుంది. నీకు కావాల్సినన్ని తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో పారెయ్యి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, పెట్టెను నదిలో పడేశాక మాత్రమే నువ్వు డబ్బుని ఖర్చు చెయ్యాలి. అలాకాక మధ్యలో ఖర్చు చేస్తే నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమవుతుంది' అని చెప్పింది.
రైతు పరమానందంతో ఆ పెట్టెను ఇంటికి తీసుకెళ్లి ఆ రాత్రంతా పెట్టెలో నుంచి బంగారు నాణేలు తీసి, ఒక పెద్ద సంచిలో నింపాడు. ఆ మర్నాడు కూడా తిండీ నిద్రా మానేసి మరీ నాణేలు తీసి మరో పెద్ద గోనె సంచి నింపాడు. ఏమైనా తినడానికి కూర్చున్నా, నిద్రపోయినా సమయం వృథా అవుతుందని అలా చాలా రోజులపాటు ఏమీ తినకుండా తాగకుండా నిద్రపోకుండా గడిపేస్తూ దాదాపు పది గోనె సంచీల నాణేలు జమ చేశాడు. అప్పటికీ ఆశ తీరలేదు. నాణేలు నింపే పని ఆపలేదు. తన అత్యాశకు ఫలితంగా బాగా నీరసించిపోయి కొన్ని రోజులకు మరణించాడు.
అత్యాశ ఫలితం ఎప్పుడూ చేదుగానే ఉంటుందని ఈ కథ నీతి చెబుతుంది. కాబట్టి ఏదైనా ఆశించేటప్పుడు అది ఎంతవరకు సమంజసమనమే ఆలోచన మనలో తప్పకుండా ఉండాలి. ప్రతి విషయంలో, ప్రతి రోజూ దీన్ని నిత్య పాఠంలా గుర్తుంచుకుంటే హాయిగా ఉంటాం.