Honda CB125F | ఈ మేడ్- ఇన్- ఇండియా హోండా బైక్‌కు ఫారెన్‌లో ధర ఎంతో తెలుసా?
ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ ఇండియా (HMSI) భారతదేశంలో తయారుచేసే 125cc మోటార్‌సైకిల్ Honda SP 125కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అక్కడ దీని ధర ఎంతో తెలుసుకోండి.
మన భారతదేశంలోని యువతకు దేశీయంగా తయారయ్యే బైక్‌ల కంటే ట్రయంఫ్, బీఎండబ్ల్యూ, కేటీఎం లాంటి ఇంపొర్టెడ్ బైక్‌ల మీదే ఎక్కువ ఆసక్తి. అయితే ఇండియాలో తయారయ్యే ఒక సాధారణ బైక్‌కు ఇప్పుడు విదేశాల్లో డిమాండ్ ఉంది. దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన 125cc మోటార్‌సైకిల్ Honda SP 125 మోటార్ సైకిల్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బైక్ అక్కడ Honda CB125F పేరుతో లాంచ్ అవుతుంది.
ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రం, అల్వార్‌లోని కంపెనీకి చెందిన తపుకరా ప్లాంట్‌లో తయారు అవుతున్న ఈ మోటార్‌సైకిల్ CBU (కంప్లీట్ బిల్డ్ యూనిట్) గా ఈ మార్కెట్‌లకు ఎగుమతి చేస్తున్నారు.
దీని గురించి హోండా మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, CEO అయిన అట్సుషి ఒగాటా మాట్లాడుతూ.. ఇది భారతదేశంలో ఉత్పత్తి సామర్థ్యానికి ముందడుగు అని చెప్పారు. దేశంలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరించడానికి దీర్ఘకాలికమైన ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. భారత్ నుంచే ప్రపంచం నలుమూలకు తమ ద్విచక్రవాహనాలను ఎగుమతి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Honda CB125F ఫీచర్లు, ధర
Honda CB125Fలో పూర్తి డిజిటల్ మీటర్ ఉంటుంది. ట్యాంకులో ఉన్న ఇంధనంతో చేయగల ప్రయాణం , సగటు ఇంధన సామర్థ్యం, రియల్ టైమ్ ఇంధన సామర్థ్యం, LED DC హెడ్‌ల్యాంప్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, ఇంటిగ్రేటెడ్ హెడ్‌ల్యాంప్ బీమ్/పాసింగ్ స్విచ్, ఎకో ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో దీని ధర 5000 ఆస్ట్రేలియన్ డాలర్లకు పైగా ఉంది. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 2 లక్షల పైమాటే. మన ఇండియాలో అయితే ఇది రూ. లక్షలోపే లభించే బడ్జెట్ బైక్.
జపనీస్ తయారీదారు అయిన హోండా మోటార్స్ 2001 నుంచే ఇండియాలో తయారు చేసిన యాక్టివాలను విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం, కంపెనీ ఆసియా, ఓషియానియా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికాలలోని 38 మార్కెట్లకు భారత్ నుంచే తమ మోటార్ సైకిళ్లు, స్కూటర్లను ఎగుమతి చేస్తోంది.