Antibiotics: యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? అనర్థం తప్పదంటున్న ఐసీఎంఆర్
Antibiotics: చిన్న చిన్న జ్వరం వంటి వాటికే యాంటీ బయాటిక్స్ వాడడం ఎక్కువైపోయింది. అయితే వీటి వల్ల ఉపయోగం లేదని, అనర్థాలే ఎక్కువని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరిస్తోంది.
యాంటిబయాటిక్స్ అతి వినియోగంపై ఐసీఎంఆర్ స్పందించింది. చిన్నచిన్న జ్వరాలకే యాంటిబయాటిక్స్ వినియోగం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తూ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. చిన్నచిన్న జ్వరాలు, వైరల్ బ్రాంకైటిస్ వంటి వాటికి యాంటీబయాటిక్స్ వాడడంపై హెచ్చరిక జారీచేసింది. యాంటిబయాటిక్స్ సిఫారసు చేసినప్పుడు వైద్యులు కచ్చితమైన కాల వ్యవధిని అనుసరించాలని సూచించింది.
యాంటీబయాటిక్స్ చర్మ, సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్లకు 5 రోజులు, కమ్యూనిటీ ద్వారా సంక్రమించిన న్యుమోనియాకు 5 రోజులు, హాస్పిటల్ ద్వారా సంక్రమించిన న్యూమోనియాకు 8 రోజుల పాటు సిఫారసులు చేయాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.
‘ఇన్ఫెక్షన్‌ను తెలుసుకోవడానికి జ్వరం, ప్రొకాల్సిటోనిన్ లెవెల్స్, డబ్ల్యూబీసీ కౌంట్, కల్చర్స్ లేదా రేడియోలజీ వంటివాటిపై గుడ్డిగా ఆధారపడకుండా, క్లినికల్ డయాగ్నసిస్ జరిగితే పాథోజెన్లకు సరైన కారణాన్ని తెలుసుకోవచ్చు. తద్వారా క్లినికల్ సిండ్రోమ్‌ను బట్టి సరైన యాంటీబయోటిక్ సిఫారసు చేయవచ్చు..’ అని ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాలు సూచించాయి.
ఎంపైరిక్(అబ్జర్వేషన్) యాంటీబయాటిక్ థెరపీని ఐసీఎంఆర్ మార్గదర్శకాలు కేవలం తీవ్ర అనారోగ్యం బారిన పడినవారికే పరిమితం చేశాయి.
సాధారణంగా ఎంపైరిక్ యాంటీబయాటిక్ థెరిపీ కేవలం ఎంపిక చేసిన పేషెంట్ల సమూహానికి సిఫారసు చేస్తారు. తీవ్రమైన సెప్సిస్, సెప్టిక్ షాక్, కమ్యూనిటీ నుంచి సంక్రమించిన న్యూమోనియా, వెంటిలేటర్ అవసరమైన న్యూమోనియా, నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌తో బాధపడుతున్న రోగుల నుంచి ఎంపిక చేసిన బృందాలకు మాత్రమే ఎంపైరిక్ యాంటిబయాటిక్ థెరపీ సిఫారసు చేస్తారు.
అందువల్ల ఎంపైరిక్ థెరపీ సమర్థనీయమా? లేక తగ్గించవచ్చా అంచనా వేయాలి. తదుపరి థెరపీ కాలాన్ని ప్లాన్ చేయాలని ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ సూచిస్తున్నాయి.
న్యూమోనియా, సెప్టిసెమియా వంటి వ్యాధులకు చికిత్సలో భాగంగా ఇచ్చే శక్తిమంతమైన కార్బపెనెమ్ అనే యాంటీబయోటిక్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని 2021 జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్య ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వే ప్రకారం తేలింది. ఈ యాంటీబయాటిక్స్‌కు యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యిందని సర్వే తేల్చింది. డ్రగ్ రెసిస్టెంట్ పాథోజెన్ల పెరుగుదల వల్ల ఆయా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టమని తేల్చింది.
ఇ కొలి బ్యాక్టీరియాకు చికిత్సలో ఉపయోగించే ఇమిపీనెమ్‌కు నిరోధకత 2014లో 14 శాతంగా ఉండగా, 2021లో 36 శాతానికి పెరిగిందని సర్వే తేల్చింది. ఐసీయూ పేషెంట్లలో అసినెటొబాక్టర్ 70 శాతం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు దారితీసిందని డేటా తేల్చింది.
ఫంగల్ పాథోజెన్లు సి.పారాప్సిలోసిస్, సి.గ్లాబ్రాటా వంటివి యాంటీ ఫంగల్ ఔషధాలైన ఫ్లుకోనాజోల్ వంటి వాటికి రెసిస్టెన్స్ చూపిస్తున్నాయని, అందువల్ల వీటిని కొన్ని సంవత్సరాల పాటు పర్యవేక్షించాలని ఐసీఎంఆర్ సూచించింది.
అందువల్ల సొంత వైద్యంతో తరచుగా యాంటీబయాటిక్స్ వాడడం కారణంగా ఆ మందులు పనిచేయకపోగా మీ శరీరంపై సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం మొదలుపెడతాయి. ముఖ్యంగా మీకు జ్వరం వచ్చిందనగానే వాళ్లూవీళ్లు సూచించే యాంటీబయాటిక్స్ వాడి మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుకోకండి.