Late-night Dinner | రాత్రికి ఆలస్యంగా భోజనం చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం అధికం
రాత్రికి ఆలస్యంగా భోజనం చేసేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. ఏ సమయంలో భోజనం చేయాలో సిఫారసు చేశారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి..
మీరు రోజూ ఏ సమయంలో డిన్నర్ చేస్తున్నారు? మీరు రాత్రికి చేసే భోజనం సమయం మీ ఆరోగ్యాన్ని, మీ శ్రేయస్సును ప్రభావితం చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వలన బరువు పెరుగుతారు. అంతేకాదు ఆలస్యంగా భోజనం చేయడం వలన మీ జీర్ణవ్యవస్థకు విరామం లేని శ్రమ కల్పించిన వారవుతారు. మీరు తిన్న ఆహారంలోని కేలరీలను బర్న్ చేయడంలో జీర్ణవ్యవస్థ బిజీగా ఉంటుంది. ఇది మీ నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. ఇవన్నీ ఒకెత్తు అయితే రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే వారిలో గుండెపోటు వచ్చే ముప్పు కూడా ఎక్కువట.
ఒక క్రమపద్ధతి లేకుండా అసమయ భోజనాలు చేస్తే అది అంతర్లీనంగా వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. డిన్నర్ ఆలస్యంగా చేయడం వలన పుర్రె లోపల రక్తనాళాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఆ రక్తనాళం చిట్లిపోయి మెదడు చుట్టూ రక్తస్రావం కలుగుతుంది. చివరకు ఇది పక్షవాతానికి దారితీస్తుందని తాజా అధ్యయనం ఒకటి నివేదించింది.
డిన్నర్ ఆలస్యం అయితే స్ట్రోక్ ఎలా వస్తుంది?
గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని న్యూరాలజీ విభాగం ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా లేట్ నైట్ డిన్నర్స్ కారణంగా స్ట్రోక్ ఎలా వస్తుందో వివరించారు.
రాత్రి భోజనం చేసిన తర్వాత సాధారణంగానే రక్తపోటు పెరుగుతుంది. అయితే రాత్రికి సమయానుసారంగా భోజనం చేయని సందర్భంలో అది హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, తద్వారా రక్తపోటు అధికమవుతుంది. ఈ రక్తపోటు తీవ్రమైనపుడు హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే ఆస్కారం ఉందని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో రుజువైంది.
నిద్రకు ఉపక్రించే సందర్భంలో భోజనం చేసిన సమయం గంటలోపే ఉన్నట్లయితే వారికి స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. అని డాక్టర్ ప్రవీణ్ గుప్తా అన్నారు. కాబట్టి రాత్రి 8 గంటలలోపు డిన్నర్ చేసేయాలని ఆయన సలహా ఇస్తున్నారు.
భోజనం తర్వాత వెంటనే నిద్రపోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి తిన్న తర్వాత కనీసం ఒక గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం పాటు గ్యాప్ ఇవ్వండి. నిద్రపోయే ముందు తేలికపాటి వ్యాయామం చేయండి. ఇలా చేస్తే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని పేర్కొన్నారు.
చాలా వరకు స్ట్రోక్స్ రాత్రికి లేదా తెల్లవారుజామున సంభవిస్తాయి. కాబట్టి అలవాట్లను మార్చుకోవడం ద్వారానే స్ట్రోక్స్ రావడాన్ని నివారించవచ్చు. ఆరోగ్యం కోసం ఇదే ఖర్చు లేని పని అని డాక్టర్ ప్రవీణ్ గుప్తా ముగించారు.
సంబంధిత కథనం