Korrala Kheer: కొర్రలతో బెల్లం పాయసం, చిరుధాన్యాలతో హెల్తీ స్వీట్ రెసిపీ
Korrala Kheer: కొర్రలంటే చాలా మందికి తినాలనిపించదు. ఏదో ఆరోగ్యం కోసం కష్టంగా తింటారు. అలా కాకుండా వాటిని రుచిగా మార్చేయాలంటే కొర్రల పాయసం ట్రై చేయండి. మీకు నచ్చేసే ఈ రెసిపీ తయారీ చూసేయండి.
కొర్రలు, సామలు, రాగులు.. ఇలా అన్ని రకాల చిరుధాన్యాలు తినడం ఆరోగ్యకరమని చాలా మంది ఆహారంలో వాటిని చేర్చుకుంటున్నారు. అయితే వాటితో అంబలి వండుకోవడం, లేదా ఉప్మాలు చేసుకుని తినడమే ఎక్కువగా చేస్తాం. బదులుగా ఒకసారి కొర్రలతో తియ్యటి పాయసం ప్రయత్నించండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. దాన్నెలా తయారు చేయాలో వివరంగా తెల్సుకోండి.
కొర్రలతో బెల్లం పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు:
సగం కప్పు కొర్రలు
3 చెంచాల పెసరపప్పు
సగం కప్పు బెల్లం
రెండున్నర కప్పుల నీళ్లు
1 చెంచా పంచదార
2 యాలకులు
చిటికెడు ఉప్పు
2 చెంచాల నెయ్యి
గుప్పెడు జీడిపప్పు
కొర్రలతో బెల్లం పాయసం తయారీ విధానం:
1. ముందుగా కొర్రల్ని శుభ్రంగా కడిగి కనీసం గంటపాటు నీళ్లల్లో నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి.
2. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో పెసరపప్పు వేయించుకోవాలి. బాగా వాసన వచ్చేదాకా కలుపుతూ వేయించాలి.
3. అలాగే పెసరపప్పు బాగా కడుక్కోవాలి. కడిగిన పెసరపప్పు, నానబెట్టుకున్న కొర్రల్ని ప్రెజర్ కుక్కర్లో వేసుకోవాలి.
4. సగం కప్పు కొర్రలకు రెండున్నర కప్పుల నుంచి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి. సన్నం మంట మీద పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
5. కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో ఒకసారి కొర్రల్ని, పప్పుని బాగా మెదుపుకోవాలి.
6. అందులోనే సన్నగా తరుగుకున్న బెల్లం కూడా వేసి కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగేదాకా సన్నం మంట మీద ఉడకనివ్వాలి. దాంతోపాటే పంచదార, యాలకుల పొడి కూడా వేసి మరోసారి కలియబెట్టుకుని స్టవ్ కట్టేయాలి.
7. మరొక కడాయిలో నెయ్యి వేసుకుని జీడిపప్పును వేయించుకోవాలి. అవి రంగు మారాక నెయ్యితో పాటూ జీడిపప్పును పాయసంలో కలిపేసుకోవాలి. అంతే కొర్రల బెల్లం పాయసం రెడీ అయినట్లే.
టాపిక్