Korrala Idli: పిల్లలకు కొర్రల ఇడ్లీ తినిపించండి, వారు బలంగా మారుతారు-korrala idli recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Korrala Idli: పిల్లలకు కొర్రల ఇడ్లీ తినిపించండి, వారు బలంగా మారుతారు

Korrala Idli: పిల్లలకు కొర్రల ఇడ్లీ తినిపించండి, వారు బలంగా మారుతారు

Haritha Chappa HT Telugu
Feb 28, 2024 06:00 AM IST

Korrala Idli: చిరుధాన్యాలైన కొర్రలను తినడం వల్ల ఆరోగ్యానికి శక్తి అందుతుంది. ముఖ్యంగా పిల్లలకు కొర్రలతో చేసిన ఆహారాలను పెట్టడం మంచిది. ఒకసారి కొర్రల ఇడ్లీ రెసిపీ ప్రయత్నించండి.

కొర్రల ఇడ్లీ రెసిపీ
కొర్రల ఇడ్లీ రెసిపీ (youtube)

Korrala Idli: కొర్రలు ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాలు. ఒకప్పుడు వీటిని విరివిగా తినేవారు. కానీ ఇప్పుడు తినే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. తెల్ల అన్నం అరిగినంత సులువుగా కొర్రలు అరగవు. అందుకనే చాలామంది వీటిని దూరం పెడుతున్నారు. కానీ బరువు తగ్గేందుకు, శక్తి అందేందుకు కొర్రలతో చేసిన ఆహారాన్ని తినడం చాలా అవసరం. కొర్రలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కొర్రలతో అన్నం మాత్రమే కాదు ఎన్నో రకాల వంటలు చేయవచ్చు. అందులో ఒకటి కొర్రల ఇడ్లీ. పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ రెసిపీగా కొర్రలు ఇడ్లీని ఒకసారి పెట్టి చూడండి, వారికి నచ్చుతుంది. అలాగే మధుమేహ రోగులు కూడా కొర్రల ఇడ్లీలను తినడం అలవాటు చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కొర్రల ఇడ్లీకి పిండి ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకోండి.

కొర్రల ఇడ్లీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కొర్రలు - మూడు కప్పులు

మినప్పప్పు - ఒక కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - సరిపడా

కొర్రల ఇడ్లీ రెసిపీ

1. కొర్రలు చాలా గట్టిగా ఉంటాయి. వీటిని మిక్సీలో వేసి రవ్వలా చేయండి.

2. నీటిలో ఆ రవ్వను వేసి నానబెట్టండి. అలాగే మినప్పప్పును కూడా నీటిలో వేసి నానబెట్టండి.

3. రెండింటినీ నాలుగు గంటల పాటు నానబెట్టాక మిక్సీ జార్లో వేసి మెత్తని పిండిలా రుబ్బుకోండి.

4. ఇప్పుడు ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసి రుచికి సరిపడా ఉప్పులు వేసుకోండి.

5. రాత్రంతా ఆ పిండిని బయటే వదిలేయండి. అది కాస్త పులిసి మెత్తని ఇడ్లీలు వచ్చేందుకు పిండి సిద్ధమవుతుంది.

6. ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి లేదా నూనె రాసుకుని ఈ పిండిని వేయండి.

7. ఆవిరి మీద ఉడికిస్తే ఇడ్లీలు రెడీ అయిపోతాయి.

8. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని ఏ చట్నీతో తిన్నా రుచిగానే ఉంటాయి.

9. పిల్లలకు పైన క్యారెట్ తురుమును చల్లి ఇస్తే మంచిది. కొర్రలు ఇడ్లీ రెసిపీ వారానికి కనీసం రెండు మూడు సార్లు ప్రయత్నించండి.

చిరుధాన్యాలు అంటేనే ఆరోగ్యానికి మేలు చేసేవి అని అర్థం. చిరుధాన్యాల్లో కొర్రలు ఒక భాగం. మహిళలు, పిల్లలు కచ్చితంగా కొర్రలతో చేసిన ఆహారాన్ని తినాలి, ఎందుకంటే వారిలోనే ఎక్కువగా రక్తహీనత సమస్య ఉంటుంది. కొర్రలకు అనీమియాను తగ్గించే శక్తి ఉంది. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా కొర్రలతో చేసిన ఆహారాలను తింటే మంచిది. వారు ఇడ్లీలను చాలా సులువుగా తినగలరు.

కొర్రలతో చేసిన అన్నం నమలడం కష్టం అనుకుంటే మెత్తని ఇడ్లీలు తినండి. బరువు తగ్గే ప్రయాణంలో మీకు కొర్రలు ఎంతో సాయం చేస్తాయి. ఎక్కువసేపు మీకు ఆకలి వేయకుండా ఉంచుతాయి. దీనివల్ల మీరు ఇతర ఆహారాలను తినరు. అలాగే కొర్రల్లో ఉన్న యాంటీ యాక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్ క్యాల్షియం, ఐరన్ వంటివన్నీ శరీరానికి అందుతాయి. కాబట్టి నీరసం కూడా రాదు.

అధికరక్తపోటుతో బాధపడేవారు కొర్రలలో మెనూలో కచ్చితంగా చేర్చుకోవాలి. క్యాన్సర్ తో బాధపడేవారు కూడా కొర్రలు ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. క్యాన్సర్ రానివారు అది రాకుండా అడ్డుకోవాలంటే కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జ్వరాలు, జలుబు, దగ్గు వంటివి తరచూ దాడి చేయకుండా అడ్డుకుంటాయి.

టాపిక్