Fried Idli: రోజూ ఇడ్లీ తిని బోర్ కొట్టిందా? ఒకసారి ఫ్రైడ్ ఇడ్లీ ట్రై చేయండి, రుచి మామూలుగా ఉండదు
Fried Idli: ఇడ్లీలతోనే ఫ్రైడ్ ఇడ్లీ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగాను ఉంటుంది. ఈ ఫ్రైడ్ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం.
Fried Idli: వారంలో మూడు నుంచి నాలుగు రోజులు కొందరి ఇళ్లల్లో ఇడ్లీనే బ్రేక్ ఫాస్ట్. అది తిని తిని బోర్ కొట్టిన వాళ్ళు ఎంతోమంది. అయినా సరే ఆరోగ్యం కోసం అమ్మ ఇడ్లీనే తినిపిస్తుంది. ఇడ్లీ బోర్ కొట్టిన వాళ్లు ఆ ఇడ్లీలతోనే ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీ ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా తినాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీ చాలా సులువుగా చేసుకోవచ్చు.
ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీకి కావలసిన పదార్థాలు
ఇడ్లీలు - పది
ఉల్లిపాయ - రెండు
టమోటోలు - మూడు
క్యాబేజీ తరుగు - ఒక కప్పు
క్యాప్సికం తరుగు - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
టమోటా కెచప్ - రెండు స్పూన్లు
ఆవాలు - అర స్పూను
పచ్చిమిర్చి - రెండు
నూనె - రెండు స్పూన్లు
ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేయాలి.
2. నూనె వేడెక్కాక ఆవాలు చిటపటలాడే వరకు ఉంచాలి.
3. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించాలి. ఇవి రంగు మారేవరకు ఉంచాలి.
4. ఆ తరువాత టమోటో తరుగు, క్యాబేజీ తరుగు, క్యాప్సికం తరుగు, పచ్చిమిర్చి తరుగును వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
5. పైన మూత పెడితే అవి త్వరగా ఉడుకుతాయి.
6. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుంటే కూరగాయలన్నీ త్వరగా వేగిపోతాయి.
7. ఈలోపు ఇడ్లీలను మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి.
8. ఇడ్లీ ముక్కలను కళాయిలో వేసి కలుపుకోండి. పైన కొత్తిమీరను చల్లుకోండి. అంతే ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిపోతుంది.
ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలని మీరే అనుకుంటారు. ముఖ్యంగా పిల్లలకు ఇది కొత్తగా ఉంటుంది. ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదే కాబట్టి దీన్ని ఎన్నిసార్లు చేసుకుని తిన్నా మేలే.
ఈ ఇడ్లీ రెసిపీలో మనం కూరగాయలను జత చేసాము. కాబట్టి ఇది మరింత హెల్తీ రెసిపీ అని చెప్పవచ్చు. క్యాప్సికం, ఉల్లిపాయ, టమోటా, క్యాబేజీ... ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి అవసరమైనదే. మీకు ఇది స్పైసీగా కావాలనుకుంటే కాస్త పచ్చిమిర్చి తరుగును ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. కారం ఇష్టపడని వారు మిరపకాయలను తగ్గించుకోండి. వాటిని వేసుకోవాలా? వద్దా? అనేది పూర్తిగా మీ ఇష్టం. కొంతమంది పసుపును కూడా వేస్తారు. కావాలనుకుంటే మీరు పసుపు వేసి ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీని ట్రై చేయొచ్చు.