Food Synergy: ఫుడ్ సినర్జీ అంటే తెలుసా? ఇలా తింటే పోషకాలు మెరుగ్గా అందుతాయి!
Food Synergy: కొన్ని ఆహారాల్లో ఉండే పోషకాలు మన శరీరానికి అందాలంటే వాటిని కొన్ని కాంబినేషన్లలో తినాలి. అలా కలిపి తినడాన్నే ఫుడ్ సినర్జీ అంటాం. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మన ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి మనం రోజూ రకరకాల ఆహార పదార్థాలను తింటుంటాం. వాటిలో ఉండే పోషకాలను దృష్టిలో ఉంచుకుని మన ఇష్టా ఇష్టాలకు తగినట్లుగా వాటిని తయారు చేసుకుని ఆరగిస్తాం. అయితే కొన్ని రకాల ఫుడ్ సినర్జీలతో లాభాలు ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక పదార్థంతో ఉన్న పోషకాలకు సరిపోయే మరో పదార్థాన్నికలిపి తినడం వల్ల లాభాలు రెట్టింపు అవుతాయన్న మాట. ఆ అన్ని పోషకాలనూ శరీరం మెరుగ్గా శోషించుకోగలుగుతుంది. ఇలా రెండు, మూడు పదార్థాల పోషకాల కాంబినేషన్నే ఫుడ్ సినర్జీ అంటారు. మరి వేటితో వేటిని కలిపి తినడం వల్ల మన ఆరోగ్యం చక్కగా ఉంటుందో న్యూట్రీషనిస్ట్ వివరిస్తున్నారు. అదేంటో చదివేద్దాం..
నిమ్మ రసంతో బ్రోకలీ :
బ్రోకలీలో మొక్కల ఆధారిత ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే నిమ్మకాయలో సీ విటమిన్ అధికంగా ఉంటుంది. ఇవి రెండూ కలిపి తినడం వల్ల సీ విటమిన్ ఇనుమును శోషించుకోవడంలో శరీరానికి సహకరిస్తుంది. విడిగా తినడం కంటే వీటిని కలిపి తినడం వల్ల పోషకాలు మెరుగ్గా శరీరానికి అందుతాయి.
శెనగల్ని అన్నంతో:
శెనగల్లో మెథియోనిన్ అనే అమైనో యాసిడ్ తక్కువగా ఉంటుంది. అన్నంలో ఇది ఎక్కువ మోతాదులో లభిస్తుంది. శెనగల్లో సహజంగా ప్రొటీన్‌లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని రెండింటినీ కలిపి తినడం వల్ల ప్రొటీన్ మెరుగ్గా ఉపయోగపడుతుంది. సరైన మోతాదులో అమీనో యాసిడ్లూ అందుతాయి.
గుడ్లతో స్ట్రాబెరీలు :
గుడ్లలో ఉండే కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లను మెరుగ్గా శోషించుకోవడానికి ఉపయోగపడతాయి. స్ట్రా బెరీల్లో ఎలాజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనం ఉంటుంది. దీన్ని మన శరీరం గ్రహించేందుకు గుడ్లలో ఉండే పోషకాలు ఉపయోగపడతాయన్నమాట.
క్యారెట్లతో, ఆలివ్ ఆయిల్:
ఏ విటమిన్ అధికంగా లభించే క్యారెట్ల లాంటి వాటిని ఆలివ్ ఆయిల్ వాటితో కలిపి తీసుకోవడం వల్ల లాభాలు రెట్టింపు అవుతాయి. ఎందుకంటే విటమిన్ ఏ అనేది కొవ్వుల్లో కరిగే విటమిన్. ఆలివ్ ఆయిల్లో ఉండే సహజమైన కొవ్వులు దీన్ని కరిగించుకుని మెరుగ్గా శరీరానికి అందిస్తాయి.
గ్రీన్ టీతో నిమ్మకాయ:
గ్రీన్ టీ తాగే అలవాటు ఉన్న చాలా మంది అందులో నిమ్మకాయ పిండుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అది కేవలం రుచి కోసమే కాదండీ. ఇలా తాగడం వల్ల పెద్ద ఉపయోగమే ఉంది. నిమ్మకాయలో ఉండే సీ విటమిన్ వల్ల.. గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లను శరీరం మెరుగ్గా తీసుకోగలుగుతుంది. అందువల్ల గరిష్ఠంగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.