Cold and flu home remedies: జలుబు ఫ్లూ జ్వరం నయం చేసే 5 మసాలా దినుసులు
Cold and flu home remedies: జలుబు, ఫ్లూ నుంచి రక్షణకు ఇంట్లో ఉండే 5 అద్భుతమైన సుగంధ ద్రవ్యాలు ఔషధంగా పనిచేస్తాయి.
వింటర్ వచ్చిందంటే చాలు.. జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాసకోశ నాళాల్లో ఇబ్బందులు, తలనొప్పి, చెవినొప్పి.. ఈ లిస్ట్‌కు అంతేలేదు. ఈ కారణంగా చలికాలాన్ని పూర్తిగా ఆస్వాదించలేం. అలా చేయాలంటే శరీరం వీటన్నింటి నుంచి తట్టుకునేలా రోగనిరోధకత శక్తి మన సొంతమవ్వాలి. బయట వాతావరణం బాగోలేదని మనం ఇంటిపట్టునే ఉండడం కూడా శరీరం మరింత బలహీనంగా తయారవడానికి కారణమవుతుంది. ఈ సమస్యలన్నింటికి పరిష్కారంగా మనం హోమ్ రెమెడీస్ పాటించాలి. మీ డైట్‌లో కొన్ని మసాలా దినుసులు జత చేయాలి. భోజనంలో గానీ, పానియాల రూపంలో గానీ వీటిని జత చేసుకుంటే మీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అంతేకాకుండా మీరు వింటర్‌లో కొత్త రుచులు ఆస్వాదించినట్టవుతుంది.
‘జలుబు, ఫ్లూ వంటి వంటిని పారదోలేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. దుప్పటి కప్పుకుని ఓటీటీ చూస్తూ పక్కనే మెడిసిన్ పెట్టుకుని చీదుతూ కూర్చోవాల్సిన పనిలేదు..’ అని క్లినికల్ న్యూట్రీషనిస్ట్, డైట్ స్టూడియో ఫౌండర్ కోమల్ పటేల్ అంటున్నారు. శీతాకాలం వచ్చే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు 5 సుగంధ ద్రవ్యాలను సూచిస్తున్నారు.
1. Ginger: అల్లం
జలుబుకు చికిత్సగా పనిచేసే అల్లానికి చాలా చరిత్ర ఉంది. మీ శరీరంలో వెచ్చదనం ఇచ్చే అల్లం మీకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుంది.
అల్లంను జింజర్ టీ రూపంలో తీసుకున్నా మీకు ఉపశమనంగా ఉంటుంది. లేదా కాస్త అల్లం తురిమి వేడి నీళ్లలో వేసుకుని కాస్త తేనె కలిపి తాగినా గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. Cinnamon: దాల్చిన చెక్క
దాల్చిన చెక్క వాసనను పీల్చినా మీరు రిఫ్రెష్ అవుతారు. అంతటి శక్తి దానికి ఉంది. అయితే దీని నుంచి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో యాంటీఆక్సిడంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లమేషన్‌పై ఇవి పోరాడుతాయి. జలుబు, ఫ్లూ జ్వరం ఉన్నప్పుడు దాల్చిన చెక్కను తీసుకుంటే చక్కటి ఉపశమనం లభిస్తుంది.
అర టీ స్పూన్ దాల్చిన చెక్కను తురిమిన అల్లంతో కలిపి ఒక కప్పు వేడి నీటిలో వేసి బాగా కలపాలి. తేనె కూడా వేసి కలపాలి. రోజుకు రెండుసార్లు దీనిని తీసుకుంటే మీకు ఉపశమనం లభిస్తుంది.
3. Black Pepper: మిరియాలు
మిరియాలు ప్రతి తెలుగింటా ఉండేవే. దీనిలో యాంటీబాక్టీరియల్ గుణాలు ఉంటాయి. జలుబు, ఫ్లూ పెరగకుండా కాపాడతాయి. వింటర్‌లో మిరియాలను మీ డైట్‌లో చేర్చుకుంటే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాస కోశ ఇన్ఫెక్షన్ల నుంచి, చెస్ట్ కంజెషన్ నుంచి కాపాడుతాయి.
ఒక కప్పు పాలు తీసుకుని దానిలో పుసుపు, అలాగే పొడి చేసిన లేదా దంచిన మిరియాలను కలపాలి. రోజూ రెండు పూటలా తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలు తాగని వారు బ్లాక్ టీతో కలిపి తీసుకోవచ్చు.
4. Turmeric: పసుపు
పసుపు చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడంట్‌గా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. జలుబు, ఫ్లూ జ్వరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది.
పసుపు, అల్లం మిశ్రమం జలుబు సమయంలో శక్తిమంతంగా పనిచేస్తుంది. ఒక ఇంచ్ సైజ్ ఉన్న అల్లం ముక్కను తరిగి ఒక టీ స్పూన్ పసుపు, సగం నిమ్మకాయ రసం కలిపి ఈ మిశ్రమాన్ని ఒక కప్పు తాగునీటిలో కలుపుకోవాలి. రెండు మూడు రోజులకోసారి ఇలా తాగితే మీకు జలుబు, జ్వరం నుంచి ఉపశమనం కలగడమే కాకుండా, మీ రోగనిరోధకత శక్తి పెరుగుతుంది.
5. Tulsi: తులసి
తులసి ఆకులు అనేక అనారోగ్య సమస్యలకు హోం రెమెడీగా వాడుతారు. సూక్ష్మజీవుల వల్ల కలిగే అనారోగ్యాలను దూరం చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది. యాంటీబ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండడమే కాకుండా పొడి దగ్గు, వంటి వాటి నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది. తులసి టీ అలర్జీతో కూడిన బ్రాంకైటిస్, ఆస్తమాను దూరం చేస్తుంది.
ఐదు లవంగాలు, 8 తులసి ఆకులు ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. కాస్త ఉప్పు జోడించి చల్లారనివ్వండి. రోజుకు వీలైనన్ని సార్లు ఈ పానీయం తాగితే మీకు దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటిలో పోసుకుని గార్గిల్ చేయడం వల్ల గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
టాపిక్