Exam preparation tips: ఎగ్జామ్స్ ప్రిపేరవుతున్నారా? ఈ 10 టెక్నిక్స్ మీ కోసమే
Exam preparation tips: ఎగ్జామ్ షెడ్యూల్స్ వచ్చేశాయి. మరికొద్ది రోజుల్లో పరీక్షలు. ప్రిపరేషన్ సీరియస్‌గా సాగాల్సిన సమయం ఇది. ఇందుకు 10 టిప్స్ మీకోసం..
Exam preparation tips: ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టూడెంట్స్‌లో ఆందోళనను రేకెత్తిస్తుంది. పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు టన్నుల కొద్దీ నేర్చుకున్నదంతా వడపోసి ఆ రెండున్నర గంటలో, మూడు గంటలో సమాధానాలు రాయాలి. చాలా మంది విద్యార్థుల్లో ఎగ్జామ్స్ అంటే ఆందోళన ఎక్కువగా ఎందుకుంటుందంటే వారు మొదటి నుంచి ప్రిపేర్ కాకపోవడమే. చాలా టైమ్ ఉందిలే అనుకుంటూ ప్రిపరేషన్ అటకెక్కించడమే ఇందుకు కారణం. మరి ఎలాంటి ఆందోళన లేకుండా ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా సాగాలో ఇప్పుడు చూద్దాం.
1. ఎగ్జామ్ ప్రిపరేషన్: స్టడీ ప్లాన్
ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం చివరలో హడావుడి పడడం కంటే ముందునుంచే అప్రమత్తంగా ఉండడం మేలు. పరీక్షల్లో రాణించడానికి ఇది అత్యుత్తమ పద్ధతి. ఒకవేళ ఆలస్యంగానైనా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టే ముందు ఒక స్టడీ ప్లాన్ తయారు చేయండి. ఏది చదవాలి? ఎంత సమయం కేటాయించాలి? దేనికెంత సమయం పడుతుంది? అనే ప్రశ్నలకు వాస్తవిక అంచనాలకు తగ్గట్టుగా ఈ ప్లాన్ తయారు చేసుకోవాలి.
2. ఎగ్జామ్ ప్రిపరేషన్: ఆల్టర్నేటివ్ మెకానిజం
ఒకే సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించడం కంటే సబ్జెక్టులను మార్చుతూ ఉంటే మీ శ్రద్ధ, ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.
3. ఎగ్జామ్ ప్రిపరేషన్: ఒకేసారి చదవడం సరిపోదు
ఒకేసారి చాలా మెటిరియల్ ముందేసుకుని దానిని చదవడం కంటే.. ఒక అంశానికి కొనసాగింపుగా పలుమార్లు చదివితే.. మీకు బాగా గుర్తుంటుంది. బట్టీ పట్టడం కంటే ఆయా ఛాప్టర్లపై అవగాహన తెచ్చుకుంటే పని సులువవుతుంది.
4. ఎగ్జామ్ ప్రిపరేషన్: ఎంత సేపు చదివామన్నది ముఖ్యం కాదు
పలానా సబ్జెక్టు ఇన్ని గంటలు చదివాను.. మార్కులు బాగానే వస్తాయి.. అంటూ ఇలా ఆలోచించడం సరికాదు. సమయాన్ని బట్టి కాకుండా, మీరు ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం, దానిని ఎలా తిప్పి తిప్పి అడిగినా సమాధానం చెప్పగలిగేలా సంపూర్ణ అవగాహన తెచ్చుకోవడం ముఖ్యం. అందువల్ల ఎంత సేపు చదివామన్నది కాకుండా, పోర్షన్ చిన్నచిన్న భాగాలుగా చేసుకుని పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం.
5. ఎగ్జామ్ ప్రిపరేషన్: ఒకసారి సమీక్షించుకోండి
ఎగ్జామ్ ప్రిపరేషన్ మీ ప్లాన్‌కు తగ్గట్టుగా సాగుతోందా? సమయం అటూఇటూ అవుతోందా? వంటి విషయాలన్నీ రివ్యూ చేసుకోండి. మీరు ఆశించిన ఫలితం ఉంటే సమయం కాస్త అటూఇటూ అయినా పెద్దగా వర్రీ అవసరం లేదు. మిగిలి ఉన్న వ్యవధిలో చదవాల్సిన సబ్జెక్టులు పూర్తవుతాయా? స్టడీ ప్లాన్ మార్చుకోవాలా? వంటి అంశాలు చెక్ చేసుకుని ఆమేరకు సర్దుబాటు చేసుకోండి.
6. ఎగ్జామ్ ప్రిపరేషన్: చిన్న బ్రేక్ తీసుకోండి..
ఎగ్జామ్ ప్రిపరేషన్ భారంగా కాకుండా ఉల్లాసంగా సాగాలంటే మీకు తగిన బ్రేక్ అవసరం. అంటే ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చే ఆటపాటలవైపు అప్పుడప్పుడు దృష్టి పెడితే మీ కష్టం మరిచిపోతారు.
7. ఎగ్జామ్ ప్రిపరేషన్: పాత ప్రశ్నపత్రాలు పరిశీలించండి
టన్నుల కొద్ది ఉండే అధ్యాయాలను చూసి జడుసుకోకుండా పాత క్వశ్చన్ పేపర్లు తిరగేసి వాటిలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు? ఏయే ఛాప్టర్లకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? వంటి అంశాలు గమనించండి. ఆయా పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. వీలైతే ఆ పాత ప్రశ్నపత్రాలకు జవాబులు రాయండి. రాయడం వల్ల మీకు మరింతగా గుర్తుంటుంది.
8. ఎగ్జామ్ ప్రిపరేషన్: ప్రశ్నలను అంచనా వేయండి
పాత ప్రశ్నపత్రాలు విశ్లేషించడం ద్వారా గానీ, లేక పాఠ్యాంశాలకు ఉన్న ప్రాధాన్యత గుర్తించడం ద్వారా గానీ మీరు ఏయే ప్రశ్నలు వస్తాయో అంచనా వేస్తూ వాటిపై ఫోకస్ పెంచండి. కానీ వీటిని మాత్రమే చదివి మిగిలినవి విస్మరించకండి. వీటికి సంబంధించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే ప్రశ్న ఏ రకంగా ఉన్నా జవాబు బాగా రాయగలుగుతారు.
9. ఎగ్జామ్ ప్రిపరేషన్: రివిజన్ ఇలా..
ఒక్కో పాఠ్యాంశం రివిజన్ చేస్తున్నప్పుడు ఆయా టాపిక్స్‌ను నోట్ బుక్‌లో రాస్తూ ఉండండి. ఇంకా అర్థం కానివి, మరోసారి చదవాల్సిన టాపిక్స్ ఏవైనా ఉంటే ఒక పక్కన రాసుకోండి. కొన్ని టాపిక్స్‌కు సమ్మరీ రాయడం వల్ల గానీ, డయాగ్రమ్స్ గీయడం వల్ల గానీ అర్థం చేసుకునేందుకు, గుర్తు పెట్టుకునేందుకు ఈజీగా ఉంటుంది.
10. ఎగ్జామ్ ప్రిపరేషన్: ఆందోళన వద్దు
ఎగ్జామ్ ప్రిపరేషన్ త్వరగా ప్రారంభించడం ద్వారా ఒత్తిడి ఎదురవదు. అలాగే ప్రిపరేరషన్ సమయంలో తగినంత నిద్ర, చక్కటి ఆరోగ్యకరమైన భోజనం అవసరం. లేచి అటూ ఇటూ నడవడం, స్ట్రెచింగ్ వ్యాయామాలు అవసరం. యోగా, ధ్యానం ఇంకా బెటర్.