Teas For Sore throat: శీతాకాలంలో గొంతు సమస్యలా.. ఈ హెర్బల్‌ టీలతో ఉపశమనం..-know how to make four different herbal teas for soar throat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Teas For Sore Throat: శీతాకాలంలో గొంతు సమస్యలా.. ఈ హెర్బల్‌ టీలతో ఉపశమనం..

Teas For Sore throat: శీతాకాలంలో గొంతు సమస్యలా.. ఈ హెర్బల్‌ టీలతో ఉపశమనం..

Koutik Pranaya Sree HT Telugu
Nov 27, 2023 09:00 AM IST

Teas For Sore throat: శీతాకాలంలో గొంతు సమస్యలు కాస్త ఎక్కువగానే ఇబ్బంది పెడతాయి. గొంతులో నొప్పి, మంట, జలుబు.. ఇలా చాలా సమస్యలు తగ్గించే హెర్బల్ టీలు ఎలా చేసుకోవాలో చూసేయండి.

హెర్బల్ టీ లు
హెర్బల్ టీ లు (pexels)

చలి కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియాలు, వైరస్‌ల్లాంటివి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సాధారణంగా ఈ కాలంలో గొంతుకు సంబంధించి సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. టాన్సిలైటిస్, అలర్జీలు, యాసిడ్ రిఫ్లక్స్‌, నోటితో గాలి పీల్చుకోవడం లాంటి అనారోగ్య లక్షణాలు అన్నీ గొంతు ఇబ్బందులను సూచిస్తాయి. ఇలాంటప్పుడు గొంతు నొప్పి, మంట, గొంతు దగ్గర వాపు లాంటివి కనిపిస్తాయి. మరి ఇవి ఉన్నప్పుడు కొన్ని హెర్బల్‌ టీలను తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఆ టీలేంటో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి.

1. అల్లం టీ :

అల్లంలో 400కు పైగా ఔషధ సమ్మేళనాలు ఉంటాయి. అందుకనే గొంతు ఇబ్బందులు ఉన్నప్పుడు అల్లం టీని తాగేందుకు ప్రయత్నించాలి. నీటిలో అల్లం వేసి బాగా మరగనివ్వాలి. ఆ నీటిని అలాగే తాగొచ్చు. లేదంటే రుచి కోసం తేనె, నిమ్మరసం కలుపుకుని తాగొచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గొంతు వాపు, దాని వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. చామంతి టీ :

మరుగుతున్న నీటిలో చామంతి రేకులను వేసుకుని టీ తయారు చేసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోర్పడతాయి. సీజనల్‌గా వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. మంచిగా నిద్ర పట్టేలా చేస్తాయి. అందువల్ల గొంతు ఇబ్బందుల వల్ల తలెత్తే తల నొప్పులు, ముఖం బరువుగా ఉండటం లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ టీ మధుమేహాన్ని నియంత్రించడంలోనూ, మహిళల పీరియడ్స్‌ నొప్పుల్ని తగ్గించడంలోనూ కూడా చక్కగా పని చేస్తుంది.

3. పసుపు టీ:

మరుగుతున్న నీటిలో రెండు చిటికెడుల పసుపు వేసి కాగనివ్వాలి. తర్వాత దాన్ని వడగట్టుకుని కావాలనుకుంటే తేనె కలుపుకుని తాగవచ్చు. ఈ హెర్బల్‌ టీలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే కుర్క్యుమిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కణజాలాల ఇబ్బందులను తగ్గిస్తుంది. గోరు వెచ్చగా ఈ టీ తాగడం వల్ల గొంతుకు హాయిగా అనిపిస్తుంది. వ్యాధి కారక గుణాలు కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి.

4. పెప్పర్‌ మింట్‌ టీ:

పుదీనా ఆకుల్లోనే పెప్పర్‌ మింట్‌ అనేది ఓ హైబ్రీడ్‌ రకం. దీని రుచి కాస్త స్పైసీగా ఉండి గొంతు సంబంధిత సమస్యలకు బాగా పనికి వచ్చేలా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శీతాకాలపు శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Whats_app_banner