Bonalu | ఆశాఢమాసంలో ఆదివారం.. బోనాల సమర్పణతో మొదలైన సంబరం
తెలంగాణ రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు కోలాహలంగా మొదలయ్యాయి. ఆషాఢమాసంలో వచ్చే తొలి ఆదివారం నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. స్థానికంగా ఉండే పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ వంటి కాళీమాత రూపాలకు బోనాలు సమర్పిస్తారు.
బోనాలు అనేవి హైదరాబాద్- సికింద్రాబాద్ పరిధిలోని హిందూ సమాజం ఘనంగా జరుపుకునే ఒక వార్షిక ఉత్సవం. భక్తులు అత్యధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొంటూ మహాకాళి దేవిని ఆరాధిస్తారు. సాధారణంగా వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఆషాఢ మాసం మొదలైన నాటి నుంచి ఈ బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆదివారం రోజున మరింత కోలాహలంగా ఉంటుంది. దేవతలకు కొత్తకొండలో వండిన బెల్లంపాకం, కల్లుశాఖంతో బోనం సమర్పిస్తారు. యాటలు కోసి మొక్కులు చెల్లించుకుంటారు.
నిజానికి తెలంగాణ అంతటా ప్రతీ ఆదివారం ప్రజలు తమ వీలును బట్టి తమకు స్థానికంగా ఉండే గ్రామదేవతల మందిరాలకు వెళ్లి బోనం సమర్పిస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఆషాఢమాసంలో వచ్చే బోనాలు ఎంతో ప్రసిద్ధి. హైదరాబాద్ నగరంలో బోనాల పండగ ఎంతో ఘనంగా జరుగుతుంది. నెలరోజుల పాటు ఎంతో సందడిగా ఉంటుంది. చారిత్రక గోల్కొండ కోటలో ఆషాడమాసం తొలి ఆదివారం నిర్వహించే మొట్టమొదటి బోనంతో అసలు సంబరాలు ప్రారంభమవుతాయి. తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలతో ఉత్సాహభరితంగా ఉత్సవాలు సాగుతాయి. తరువాత రెండవ ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి ఆలయం, బల్కంపేటలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, మూడవ ఆదివారం చిల్కలగూడలోని పోచమ్మ, లాల్ దర్వాజలోని కట్టమైసమ్మ ఆలయంలో బోనాల సమర్పణ చేస్తారు. ఈ ఏడాది జూలై 24 వరకు నగరంలో బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి.
చారిత్రక ప్రాముఖ్యత
19వ శతాబ్దం నుంచి బోనాల పండగ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ప్రాణాంతకమైన ప్లేగు వ్యాప్తి చెందినపుడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారిని అంతంచేయాలని మహాకాళి దేవిని ప్రార్థించి బోనం సమర్పించారు. ప్లేగు వ్యాధి అంతరిస్తే సికింద్రాబాద్‌లో ఆలయాన్ని నిర్మిస్తామని వేడుకున్నారు. కొన్నాళ్లకు ప్లేగు అంతరించింది. దీంతో ఆ దేవతే తమను కాపాడిందని ఇక్కడి ప్రజలు చెప్పినట్లుగానే సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని నిర్మించారు. ప్రతీ ఏడాది బోనాలతో మొక్కులు చెల్లించడం ప్రారంభమైంది. బోనాలతో మైసమ్మ, డొక్కలమ్మ, పెదమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ వంటి వివిధ రూపాల్లో కాళీ దేవిని పూజిస్తారు. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే ఏదైనా సీజనల్ వ్యాధుల నుండి కాపాడుతుందని నమ్ముతారు. తల్లి చల్లని చూపుతో తమ కోరికలు తీరిపోతాయని మొక్కులు చెల్లించుకుంటారు.
సంబంధిత కథనం
టాపిక్