Saturday Motivation: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం మీ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే
Saturday Motivation: ఇప్పుడు ఎంతో మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా ఇంట్లోనే ఉద్యోగం చేయడం వల్ల వృత్తిగత జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య సరిహద్దు రేఖ చాలా సన్నగా మారుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోకతప్పదు.
మహిళలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ను ఇష్టపడుతున్నారని ఎక్కువ సర్వేలు నిర్ధారిస్తున్నాయి. ఇంటి నుండి పనిచేయడం వల్ల పిల్లల్ని, కుటుంబాన్ని కూడా చూసుకోవచ్చని వారు అభిప్రాయపడతారు. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలోని బాధ్యతలను మెరుగ్గా నిర్వహించగలమని అనుకుంటారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ… కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఇంటి నుండి పనిచేయడం రెండు వైపులా పదునుగా ఉన్న కత్తిలా మారుతుంది. ముఖ్యంగా మహిళలకు, ఇంట్లో పని - ఉద్యోగ జీవిత సమతుల్యత దెబ్బతింటున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితి మహిళలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నట్టు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. కొన్ని సార్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే మహిళ ఉద్యోగాన్ని ఇంటిలోని ఇతర సభ్యులు గౌరవించరు కూడా.
తాజాగా ఓ ట్వీట్ బాగా వైరల్ గా మారింది. తన వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఓ మహిళ ఆ పోస్టులో పేర్కొంది. ఉద్యోగానికి రాజీనామా చేయడం పెద్ద విషయం కాదు. ఉద్యోగం మానేయడానికి పెద్ద విషయమే కారణం. ఉద్యోగం మానేయడానికి గల కారణాన్ని వివరిస్తూ… తన తల్లి తన ఉద్యోగాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని, ఆఫీసు పని చేస్తున్నప్పుడు కూడా ఇంటి పనులను తనకు ఇస్తోందని చెప్పుకొచ్చింది. తల్లి తీరుతో విసిగిపోయి ఆ మహిళ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ట్వీట్ లో పేర్కొంది. ముఖ్యంగా మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ డబుల్ షిఫ్ట్ జాబ్ లా అనిపిస్తుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేసినా… ఇంట్లో పని కూడా వారికి అదనపు భారంగా మారింది.
మీరు ఇంట్లో ఏ మూలనైనా కూర్చొని ఆఫీసు పని ప్రారంభిస్తే చాలు, నిత్యం గొణిగే పెద్దవారు ఎన్నో ఇళ్లల్లో కనిపిస్తుంది. చిన్నదైనా సరే, ఇంట్లో మీ సొంత ఆఫీస్ డెస్క్ ను సిద్ధం చేసుకోండి. ఆఫీసు పనులన్నీ అక్కడే కూర్చొని చేయండి. ఇలా చేయడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే, కుటుంబ సభ్యులు కూడా ఆఫీసు పని చేస్తున్నప్పుడు ఇంటి పని బాధ్యతలను మీపై రుద్దకుండా ఉంటారు.
ఈ మల్టీటాస్కింగ్ ను ఆపండి
మల్టీటాస్కింగ్‌ను మంచిదే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ, మిమ్మల్ని మీరు మల్టీటాస్కర్ గా ప్రజెంట్ చేసుకోవడం మానేయండి. మిమ్మల్ని మీరు ఎలా ప్రెజెంట్ చేసుకుంటారో, ప్రపంచం మిమ్మల్ని అలానే చూస్తుంది. ఒకేసారి చాలా పనులు చేయడం ఇష్టమైతే ఎవరినీ అడగకుండానే ఆఫీసు పనుల్లో మధ్యలో కిచెన్ పనులు చక్కబెట్టుకునే అవకాశం ఉంది. మీరు నిరంతరం ఇలా చేయడం చూసి, మీకు ఆఫీసు పని లేదని లేదా మీరు ఇంటి పని చేయడానికి చాలా ఇష్టపడతారని కుటుంబ సభ్యులు భావిస్తారు. తత్ఫలితంగా, వారు క్రమంగా మీ ఉద్యోగ వేళలకు ప్రాముఖ్యత ఇవ్వడం మానేస్తారు.
ఆఫీస్ పని నుండి రెండు గంటలకు ఒకసారి కొన్ని నిమిషాలపాటూ విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విరామ సమయంలో మీరు కొన్ని ఇంటి పనులు చేయాలనుకుంటే, చేయండి. ఆఫీసు వేళల్లో ఆఫీసు పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తుంచుకోండి.
చాలా సార్లు ఆఫీసు పని తీవ్రతను పెద్దలు అర్థం చేసుకోరు. అటువంటి పరిస్థితిలో వారితో స్పష్టంగా మాట్లాడండి. మీ షెడ్యూల్ గురించి వారికి ముందే చెప్పండి. గది వెలుపల ‘డూ నాట్ డిస్టర్బ్’ బోర్డు పెట్టడానికి వెనుకాడక్ండి. హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల అది కుటుంబసభ్యులకు ఆఫీసు వర్క్ అనే సంకేతాన్ని అందిస్తుంది.
• ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) ప్రకారం, అధిక శాతం మంది వర్కింగ్ ఉమెన్స్ ఇంటి నుండి పని చేసే సౌలభ్యం ఉన్న ఉద్యోగం చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఐఎల్ఓ అధ్యయనం ప్రకారం, 34 శాతం గ్రామీణ, 28 శాతం పట్టణ మహిళలు ఇంటి నుండి పనిచేయాలని కోరుకుంటున్నారు.