Detox | ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకే కాదు.. బరువు తగ్గడానికి కూడా..
శరీరానికి, జుట్టుకు, చర్మానికి డిటాక్స్ చాలా అవసరం. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి డిటాక్స్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. మంచి ఫలితాల కోసం ఏదైనా కొత్తగా ప్రారంభిస్తున్నప్పుడు.. ముందు డిటాక్స్ చేసి.. తర్వాత వాటిని ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. అసలు డిటాక్స్ ఎందుకు అవసరమో? డిటాక్స్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టాక్సిన్స్ లేదా విషపూరిత పదార్థాలు శరీరంలో కొంతకాలం పాటు పేరుకుపోయి ఉంటే చాలా సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారిపోవడం, జుట్టు రాలడం, పెళుసుగా మారడం, గోర్లు, చర్మం నిస్తేజంగా, గరుకుగా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. వీటిని బాహ్యంగా, అంతర్గతంగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ సమయంలో డిటాక్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇది టాక్సిన్లను తొలగించడమే కాకుండా.. నూతనోత్తేజాన్ని అందిస్తుంది. ఇప్పుడు డిటాక్స్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మం కోసం బాహ్య నిర్విషీకరణ
ఉదయాన్నే చర్మంపై ఉండే మలినాలను, నూనెను వదిలించుకోవడానికి మీ ముఖాన్ని సున్నితమైన క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోండి. మీ చర్మం నిర్జీవంగా కనిపించేలా చేసే డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడానికి.. వారానికి ఒకసారి ఎక్స్‌ఫోలియేట్ చేయండి. చర్మాన్ని తిరిగి శక్తివంతం చేయడానికి హైడ్రేటింగ్ సీరమ్‌ని ఉపయోగించండి. వారానికి ఒకసారి డిటాక్సిఫైయింగ్ ఫేస్ మాస్క్‌ని అప్లై చేయండి. డీప్ క్లీనింగ్ ఉండేలా ముల్తానీ మట్టి లేదా చార్కోల్ ఫేస్ మాస్క్‌ను ఉపయోగించండి.
స్కిన్ డిటాక్స్ డ్రింక్
మొటిమలు లేని, స్పష్టమైన చర్మం కోసం బయట నుంచే కాదు.. లోపల నుంచి కూడా డిటాక్స్ చేయాల్సి ఉంటుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన పసుపు మీ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపుతో తయారు చేసిన పానీయం.. మొటిమలు లేని, స్పష్టమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని అందించడంలో సహాయం చేస్తుంది. ఈ హెల్తీ డిటాక్స్ వాటర్ రోజూ తాగడం వల్ల మీ పొట్టకు కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తాజా పసుపును నీళ్లతో కలిపి మరిగించాలి. దానిలో నిమ్మరసం, తేనె కలిపి ఉదయాన్నే తాగాలి.
జుట్టు కోసం... బాహ్య డిటాక్స్
యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్లు, మినరల్స్, ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్ ఉంటాయి. ఇవి మీ జుట్టును నిర్విషీకరణ చేయడానికి, చుండ్రును తొలగించడానికి, స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడతాయి. 1/4 కప్పు యాపిల్ సైడర్ వెనిగర్‌ను.. రెండు కప్పుల నీటితో కలపండి. మీ జుట్టుకు పట్టించి.. కొంతసేపు ఉంచాలి. ఆపై మీ జుట్టును చక్కగా, శుభ్రంగా షాంపూ చేసి కండిషన్ చేయండి.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం డిటాక్స్ డ్రింక్
తాజా కివి, పుదీనా, దోసకాయతో చేసిన డిటాక్స్ డ్రింక్ మీ జుట్టుఆరోగ్యానికి చాలా మంచిగా పని చేస్తుంది. కివి మీ స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. దానిలోని జింక్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దోసకాయ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. చల్లని నీటిలో కొన్ని తాజా పుదీనా ఆకులు, కివీ, దోసకాయను ఒక కూజాలో వేసి.. రెండు గంటలపాటు అలాగే ఉంచండి. అనంతరం దానిని తాగేయండి.
శరీరానికి అంతర్గత, బాహ్య నిర్విషీకరణ
శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించడానికి, మీ శరీర సహజ రక్షణను బలోపేతం చేయడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయండి. వ్యాయామాలు శరీరం నుంచి మలినాలను బయటకు పంపించేస్తాయి. మూత్రపిండాలు, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి. ఏరోబిక్స్ లేదా యోగా కూడా ప్రయత్నించవచ్చు.
పుచ్చకాయ, పుదీనా, నిమ్మకాయ, అల్లాన్ని నీటిలో కలపండి. ఈ డ్రింక్ మీ శరీరాన్ని లోపలి నుంచి డిటాక్స్ చేయడానికి, హైడ్రేట్ చేయడానికి సహాయం చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. అంతేకాకుండా రక్తపోటును తగ్గించి.. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.
సంబంధిత కథనం