Kohli's secret: కోహ్లీ రుచి కోసం తినడం మానేశారట.. అతని ఫిట్‌నెస్ రహస్యాలివే..-how virat kohli has stopped eating for taste lessons from his diet regimen ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kohli's Secret: కోహ్లీ రుచి కోసం తినడం మానేశారట.. అతని ఫిట్‌నెస్ రహస్యాలివే..

Kohli's secret: కోహ్లీ రుచి కోసం తినడం మానేశారట.. అతని ఫిట్‌నెస్ రహస్యాలివే..

Koutik Pranaya Sree HT Telugu
Published Jun 25, 2024 06:00 PM IST

Kohli's secret: విరాట్ కోహ్లీ క్రమశిక్షణతో కూడిన ఫిట్‌నెస్ నియమావళి అనుసరించి ఒక గ్లోబల్ బెంచ్‌మార్క్ సెట్ చేశారు. బ్రాడ్‌కాస్టర్ జతిన్ సప్రూ కోహ్లీ అనుసరించే కఠినమైన ఆహారం, కచ్చితమైన దినచర్య గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.

కోహ్లీ ఫిట్‌నెస్ రొటీన్, ఆహారపు అలవాట్లు
కోహ్లీ ఫిట్‌నెస్ రొటీన్, ఆహారపు అలవాట్లు (Instagram)

విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్‌తో కేవలం క్రికెట్ లోనే కాకుండా అన్ని క్రీడల్లోనూ ఒక బెంచ్‌మార్క్ సెట్ చేశాడు. 35 ఏళ్ల వయసుకు దగ్గర్లో ఉన్నా.. క్రమశిక్షణ, సంకల్పంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఫిట్‌నెస్ ఉన్న ఆటగాడిగా నిలిచాడు. కఠినమైన ఫిట్‌నెస్ నియమావళి నుంచి ఆహారపు అలవాట్ల వరకు కోహ్లీ విజయం కోసం అనుసరించిన ఫార్ములా అందరికీ తెలిసిందే.

బ్రాడ్‌కాస్టర్ జతిన్ సప్రు దానికి సంబంధించి చిన్న సంఘటన వివరించారు. ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ కేవలం బేక్ చేసిన చికెన్, ఆవిరి మీద ఉడికించిన కూరగాయ ముక్కలు తిని ఫిట్‌నెస్ కాపాడుకున్నాడన్నారు. కోహ్లీ కచ్చితమైన డైట్ ఫాలో అయ్యేవాడు. క్రమశిక్షణతో కూడిన ఆహార నియమావళి అనుసరించేవాడు. ఆహారంలో రుచికన్నా పోషకాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. తన శరీరానికి అవసరమయ్యే పోషకాల అవసరాన్ని బట్టే కోహ్లీ ఆహారం తీసుకుంటాడు. ఫిట్‌నెస్ మీద అతనికున్న నిబద్ధత అలాంటిదని చెప్పారు.

కోహ్లీ బ్యాగులో ఏముంటాయంటే..

విమాన ప్రయాణాల్లో కోహ్లీ తన వెంట ఒక బ్యాగ్ ఉంచుకోవడం జతిన్ సప్రు గమనించారట. దాంట్లో కాఫీ సెట్, ప్రొటీన్ బార్లు, కొన్ని నట్స్..ఉంటాయట. వాటికోసం సరైన సమయం కేటాయించుకుని అరగంటకోసారి తింటాడట. కోహ్లీ తన పోషకాహార షెడ్యూల్‌కు ఖచ్చితత్వంతో కట్టుబడి ఉంటాడని సప్రు అన్నారు. ఇటువంటి అలవాట్లను తప్పకుండా పాటించడం అతని నియమావళిలో అత్యంత సవాలుతో కూడుకున్న అంశాలలో ఒకటని ఆయన నొక్కి చెప్పాడు.

విరాట్ కోహ్లీ డైట్ రహస్యాలు:

కోహ్లీ పాటించే డైట్ నియమాలు, ఫిట్‌నెస్ సూత్రాల నుంచి మనం కూడా కొన్ని మన జీవితంలోకి అన్వయించుకోవచ్చు. అవేంటో చూడండి..

1. స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు, బలం, ఫ్లెక్సిబిలిటీని పెంచే హై ఇంటెన్సీటీ వ్యాయామాలు విరాట్ కోహ్లీ చేస్తాడు. దానివల్లే అతను క్రికెట్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరచగలుగుతున్నాడు.

2. సంవత్సరం మొత్తం క్రమం తప్పకుండా ట్రైనింగ్ షెడ్యూల్ ను కోహ్లీ పాటిస్తాడు. క్రమశిక్షణే అతని ఫిట్‌నెస్‌కు మూల కారణం. విరామం సమయంలో కూడా వర్కవుట్ చేయడం వదిలిపెట్టడు.

3. అతని వర్కవుట్ ట్రైనింగ్, క్రికెట్ మ్యాచ్‌లకు తగ్గట్లుగా డైట్ ప్లాన్ ఉంటుంది. కావాల్సిన శక్తి అందేలా, దానికి తగ్గట్లుగా ఆహార నియమావళి వ్యూహాత్మకంగా, సమయానుకూలంగా ఉంటుంది. ఫిట్‌నెస్ మీద అతనికున్న నిబద్ధతను ఇది తెలియజేస్తుంది.

4. కోహ్లీ పోషకాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఎక్కువ ఆహారం తీసుకోవడం కాకుండా.. ఎలాంటి పోషకాలున్న ఆహారం తీసుకోవాలనే విషయానికి ప్రాధాన్యత ఇస్తాడు. పండ్లు, కూరగాయలు, ప్రొటీన్ ఉన్న ఆహారాలను తీసుకుంటాడు.

5. హైడ్రేషన్ మరో అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడూ శరీరం హైడ్రెటెడ్‌గా ఉండేలా చూసుకుంటాడు. తన ఆటకు కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాడు.

Whats_app_banner