Rasam Vada: జ్యూసీ రసం వడలు, మీ రుచి దాహం తీర్చే అల్పాహారం
Rasam Vada: రసం ఫ్లేవర్స్ అన్నీ పీల్చుకుని తింటే జ్యూసీగా ఉంటాయి రసం వడలు. వీటి తయారీ మామూలు సాంబార్ వడ కన్నా వేరుగా ఉంటుంది. వాటికన్నా ఈ వడలు మరింత రుచిగానూ ఉంటాయి. తయారీ ఎలాగో తెల్సుకోండి.
జ్యూసీ రసం వడ రెసిపీ
మామూలుగా చేసే మినప్పప్పు సాంబార్ వడలకు ఈ రసం వడలకు చాలా వ్యత్యాసం ఉంది. రసం వడలకు మినప్పప్పు వాడరు. అలాగే రసం తయారీ కూడా భిన్నంగా, చాలా సులువుగా ఉంటుంది. జ్యూసీగా ఉండే ఈ వడలు తింటే తృప్తిగా అనిపిస్తుంది. వీటి తయారీ చూసేయండి.
రసం వడ తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 కప్పులు శనగపప్పు
1 ఉల్లిపాయ, సన్నటి ముక్కల తరుగు
4 పచ్చిమిర్చి
అరచెంచా అల్లం తరుగు
కరివేపాకు రెమ్మ
తగినంత ఉప్పు
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
రసం కోసం:
నిమ్మకాయ సైజు చింతపండు
4 కప్పుల నీళ్లు
అరచెంచా జీలకర్ర పొడి
అరచెంచా కారం
టీస్పూన్ ఇంగువ
చెంచాడు వెల్లుల్లి ముద్ద
1 రెమ్మ కరివేపాకు
రసం వడ తయారీ విధానం:
- ముందుగా రసం తయారీ చేసుకోవాలి. దానికోసం చింతపండును నానబెట్టి గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి.
- స్టవ్ వెలిగించి లోతుగా ఉన్న కడాయి పెట్టుకోవాలి.
- చింతపండు గుజ్జును ఈ కడాయిలో వేసుకోవాలి. నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి. అందులోనే జీలకర్ర పొడి, కారం, ఇంగువ, ఉప్పు, వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి.
- కరివేపాకు కూడా వేసుకుని అన్నీ బాగా ఉడికిపోయేలా చూడాలి. ఒక రెండుసార్లు ఉడుకు వచ్చాక కారం, ఉప్పు చెక్ చేసుకోండి. వడకు రసం సిద్ధం అయినట్లే.
- వడల తయారీ కోసం శనగపప్పును రెండు గంటలు నానబెట్టుకుని మిక్సీలో బరకగా పట్టుకోవాలి.
- ఈ ముద్దలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, ఉప్పు,అల్లం తరుగు వేసుకుని కలుపుకోవాలి.
- వీటిని వడల్లాగా లేదా బోండాల ఆకారంలో చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. రంగు బంగారు వర్ణంలోకి వస్తే సరిపోతుంది.
- ఇప్పడు వేడిగా ఉన్న రసంలోనే ఈ వడల్ని వేసుకోవాలి. సన్నం మంట మీద కనీసం 5 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ కట్టేసి మరో అరగంట పాటూ అలాగే వదిలేయాలి.
- దీంతో వడలు రసం ఫ్లేవర్ పీల్చుకుని జ్యూసీగా తయారవుతాయి. ఒక్కసారి ప్రయత్నిస్తే ఇంటిల్లీపాదికీ నచ్చే ఫేవరైట్ అల్పాహారం అవుతుందిది.