Alu Frankie: ఆలూ మసాలా ఫ్రాంకీ.. లంచ్ బాక్స్, ప్రయాణాల్లో మంచి స్నాక్-how to cook potato or alu masala franky best travel and lunch box recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alu Frankie: ఆలూ మసాలా ఫ్రాంకీ.. లంచ్ బాక్స్, ప్రయాణాల్లో మంచి స్నాక్

Alu Frankie: ఆలూ మసాలా ఫ్రాంకీ.. లంచ్ బాక్స్, ప్రయాణాల్లో మంచి స్నాక్

Koutik Pranaya Sree HT Telugu
Sep 23, 2024 03:30 PM IST

Alu Frankie: ఆలూ మసాల ఫ్రాంకీ రుచి ఒక్కసారి తింటే మర్చిపోలేరు. స్ట్రీట్ స్టైల్ రుచి వచ్చేలా ఇంట్లోనే దాన్నెలా తయారు చేసుకోవచ్చో తెల్సుకోండి.

ఆలూ మసాలా ఫ్రాంకీ
ఆలూ మసాలా ఫ్రాంకీ

ఫ్రాంకీ అంటే బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ అని ఫిక్స్ అయిపోతాం. కానీ ఇంట్లోనే దాన్ని చాలా రుచిగా చేసుకోవచ్చు. చపాతీలు, కర్రీ ఇస్తే పిల్లలు తినరు. కానీ ఫ్రాంకీలా కొన్ని మార్పులు చేసిస్తే తప్పకుండా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ మసాలా ఆలూ ఫ్రాంకీ ప్రయత్నించండి. ఒక్కటి తిన్నా కడుపు నిండిపోతుంది.

మసాలా ఆలూ ఫ్రాంకీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

4 చపాతీలు

మసాలా కోసం:

1 ఉల్లిపాయ తరుగు

1 టమాటా

1 బీట్ రూట్

1 చెంచా కొత్తిమీర తరుగు

1 చెంచా నూనె

ఉప్పు తగినంత

1 చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

2 చెంచాల పల్లీలు

2 చెంచాల ఎండు కొబ్బరి తురుము

2 వెల్లుల్లి రెబ్బలు

1 కరివేపాకు రెమ్మ

1 చెంచా కారం

1 చెంచా గరం మసాలా

1 చెంచా బటర్

ఆలూ కర్రీ కోసం:

2 ఉడికించిన బంగాళదుంపలు

పావు చెంచా ఆవాలు

పావు చెంచా జీలకర్ర

2 చెంచాల నూనె

పావు చెంచా ఇంగువ

పావు చెంచా పసుపు

పావు చెంచా గరం మసాలా

1 చెంచా పచ్చిమిర్చి ముద్ద

1 చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

1 చెంచా కొత్తిమీర తరుగు

2 చీజ్ క్యూబులు

2 చెంచాల బటర్

2 చెంచాల కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద

మసాలా ఆలూ ఫ్రాంకీ తయారు చేసే విధానం:

1. దీనికోసం అప్పటికప్పుడే చేసిన చపాతీలు వాడొచ్చు. లేదా మిగిలిపోయిన చపాతీలు అయినా పరవాలేదు.

2. ఆలూ కర్రీ రెడీ చేసుకుంటే సరిపోతుంది.

3. ఆలూ కర్రీ కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఇంగువ, అల్లం ముద్ద, పచ్చిమిర్చి ముద్ద వేసుకోవాలి. పసుపు వేసుకుని కలియబెట్టి, బాగా మెదుపుకున్న బంగాళదుంప మిశ్రమం వేసుకుని బాగా కలియబెట్టాలి.

4. చివరగా గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకుని దించేసుకుంటే ఆలూ రెడీ అయినట్లే.

5. ఫ్రాంకీలో చల్లడానికి కావాల్సిన మసాలా కోసం ముందుగా తావా మీద నూనె వేసుకుని వెల్లుల్లి, పల్లీలు, కరివేపాకు, కొబ్బరి తురుము వేయించుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పల్లీ మసాలా రెడీ అయినట్లే.

6. ఇప్పుడు ఫ్రాంకీ మసాలా కోసం కడాయిలో నూనె వేసుకుని అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకోవాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అవి మగ్గాక ఉల్లిపాయ ముక్కలు, బీట్ రూట్ తరుము, కొత్తిమీర వేసుకుని కలపాలి. సన్నం మంట మీద ఉడకనివ్వాలి.

7. చివరగా కాస్త గరం మసాలా, బటర్ వేసి బాగా కలపుకుని పక్కన పెట్టుకుంటే మసాలా రెడీ అయినట్లే.

8. ఇప్పుడు ఫ్రాంకీకి కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయి. వాటిని ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఫ్రాంకీ రెడీ చేసుకోవాలి.

9. ముందుగా తయారు చేసుకున్న చపాతీ తీసుకుని చపాతీ అంతటా కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద రాసుకోవాలి. దాని మీద ముందు రెడీ చేసుకున్న కూరగాయల మిశ్రమం పెట్టుకోవాలి. చపాతీ అంతటా రాసుకోవాలి. మీద మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీ మసాలా చల్లుకోవాలి.

10. మధ్యలో ఆలూతో తయారు చేసుకున్న కర్రీ పెట్టుకోవాలి. కర్రీ మీద చీజ్ తురుము వేసుకుని కొద్దిగా గరం మసాలా చల్లుకోవాలి.

11. చపాతీని అన్ని వైపులా మడత పెడుతూ పై వైపు మసాలా కనిపించేలా చుట్టాలి. అంతే మసాలా ఆలూ ఫ్రాంకీ రెడీ అయినట్లే.

Whats_app_banner