Oats: ఓట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏ మొక్కకు కాస్తాయనే సందేహం ఉందా?
Oats: ఓట్స్ గురించి చాలా సార్లు విన్నా అవి ఎక్కడి నుంచి వస్తాయో అనే సందేహం ఉంటుంది. ఓట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వాటిలో రకాల గురించి పూర్తి వివరాలు తెల్సుకోండి.
ఓట్స్ ఇప్పుడు మంచి ఆరోగ్యకరమైన ఆహారం లాగా ప్రాచుర్యం లోకి వచ్చింది. కానీ మొదట్లో దాన్నొక కలుపుమొక్క అనుకున్నారట. గోధుమలు, బార్లీ పంటల మధ్యలో ఓట్స్ మొక్కలు పెరిగడంతో వాటిని కలుపు మొక్కలనుకుని పీకి పడేసేవాళ్లు. వాటిని గుర్రాలకు, పశువులకు మేతగా పెట్టేవాళ్లు. క్రమంగా వాటి విలువ, ఆరోగ్య ప్రయోజనాలు తెలియడం వల్ల మనం తినే ఆహారంలా మారిపోయాయి.
ఓట్స్ ఎలా తయారు చేస్తారు?
మనం ఓట్స్ చూడగానే ఇవి మొక్కలకు పండిన పంట కావు అనిపిస్తుంది. ఫ్యాక్టరీల్లో ఏదో పద్ధతి ద్వారా తయారు చేశారు అనిపిస్తుంది. కానీ నిజానికి బియ్యం, గోధుమలు ఎలా పండుతాయో ఓట్స్ కూడా అలాగే పండుతాయి. చూడ్డానికి లావుపాటి వరి గింజలాగా, కాస్త పొడవుగా, మందంగా ఉంటాయి. వాటిని వరిపంట లాగే కోస్తారు. ప్రాంతాన్ని బట్టి ఓట్స్ రంగులో మాత్రం కాస్త తేడా ఉంటుంది.
అలాగే బియ్యంలో బ్రౌన్ రైస్, వైట్ రైస్, పాలిష్ రైస్.. అని రకాలున్నట్లే.. ఓట్స్ లోనూ చాలా రకాలున్నాయి. వోల్ ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, ఇన్స్టంట్ ఓట్స్.. ఇలా చాలా చాలా రకాల పేర్లు వినిపిస్తాయి. ప్రతి రకం ఓట్స్ ప్రత్యేక అవసరం, రుచిని బట్టి మార్చుకుంటూ వాడాలి. అన్నింటికీ ఒకే రకమైన ఓట్స్ వాడకూడదు.
ఓట్స్ పేర్లకున్న అర్థాలు:
1. వోల్ ఓట్స్ అంటే ఎలాంటి ప్రాసెస్ జరగలేదు అన్నమాట. అంటే బ్రౌన్ రైస్ లాగా ఎలాంటి పాలిషింగ్ లేదా ప్రాసెస్ జరగని ఓట్స్ ఇవి. వీటిని ఉడికించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి ఉడకడానికి నీళ్లు కూడా ఎక్కువగా పోసుకోవాలి.
2. ఇక ఈ వండే సమయం తగ్గించేందుకు తయారు చేసినవాటిని స్టీల్ కట్ ఓట్స్ అంటారు. ఓట్స్ గింజలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వండే సమయం తగ్గేలా చేస్తారు. వీటిని వండకుండా తినాలనుకుంటే.. రాత్రంతా నానబెట్టుకుని ఓవర్ నైట్ ఓట్స్ చేసుకోవచ్చు. వోల్ ఓట్స్ మాత్రం అలా ఉడికించకుండా తినలేం.
3. వీటికన్నా ఇంకాస్త తొందరగా ఓట్స్ ఉడికిపోయే సమయం తగ్గించడానికి వాటిని అటుకుల్లాగా పలుకుల్లాగా చేస్తారు. వాటిని రోల్డ్ ఓట్స్ అంటారు. ఇక్కడ రోల్డ్ అనే పదం ఓట్స్ తయారు చేసిన పద్ధతిని తెలియజేస్తుంది. పెద్ద రోలింగ్ పిన్ కింద ఓట్స్ పంపించి ఫ్లాట్ గా అటుకుల్లాగా తయారు చేస్తారు. అందుకే వీటిని రోల్డ్ ఓట్స్ అంటారు. ఇవి ఉడకడానికి ఒక పదినిమిషాల దాకా సమయం పడుతుంది.
4. ఇక తర్వాత రకం ఇన్స్టంట్ ఓట్స్.. చాలా తక్కువ నీళ్లు పోసి రెండు నిమిషాలు ఉడికించినా ఓట్స్ రెడీ అయిపోతాయి. ఇవి మిగతా వాటితో పోలిస్తే చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి. దాంతో తొందరగా ఉడుకుతాయి. మనకు ప్యాకెట్లలో దొరికే ఇన్స్టంట్ మసాలా ఓట్స్, ఇన్స్టంట్ ఓట్స్ స్నాక్స్.. అన్నీ ఈ రకం ఓట్స్ వాడి తయారు చేసినవే. అందుకే వాటిని తయారు చేసుకోవడం తేలికవుతుంది.
టాపిక్