వయస్సును బట్టి నిద్ర.. 18 నుండి 60 ఏళ్ళ వారు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలంటే!
ఆరోగ్యంగా ఉండానికి మంచి ఆహారం ఎంత అవసరమో, ఆరోగ్యకరమైన శరీరానికి నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు, వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, వయస్సు ప్రకారం ఎవరికి ఎన్ని గంటల నిద్ర అవసరమో తెలుసుకుందాం.
ఆరోగ్యంగా ఉండాలంటే సరియైన నిద్ర అవసరం. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే ప్రశాంతంగా నిద్ర పొవడం చాలా ముఖ్యం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. బిజీ షెడ్యూల్ వల్ల రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయాన్నే తొందరగా లేచేవాళ్లు చాలామందే ఉన్నారు. ఇలా చేయడం వల్ల తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.అందుకే ప్రతి ఒక్కరికి సరైన నిద్ర అవసరం అని నిపుణులు చెబుతున్నారు. వయసును బట్టి నిద్ర అవసరం ఉంటుంది.
ఇది కాకుండా.. మీరు ఎప్పుడు నిద్రపోతున్నారు, ఎంతసేపు నిద్రపోతారు, మీ నిద్ర నాణ్యత వంటి అంశాలు కూడా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిద్రలేమి వల్ల అలసట, మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పాటు అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు తగినంత అవసరమని.. నిద్రపోకపోతే శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతీంటుందని వైద్యులు అంటున్నారు. నిద్రలేమి కారణంగా వారిలో పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది. చిరాకు, మానసిక కల్లోలం, నిరాశ మొదలైన అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు.
వయసును బట్టి నిద్ర
వయసులను బట్టి నిద్ర పోయే విధానం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రను పొందే సామర్థ్యం వయస్సుతో పాటు తగ్గుతుందని పలు సర్వేలు వెల్లడించాయి. వృద్ధులకు ఉండే అనారోగ్యాలు, వారు వేసుకునే మందుల కారణంగా నిద్రపోయే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఇలా వయస్సుతో పాటు నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. వృద్ధుల నిద్రలేమికి రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్, స్లీప్ అప్నియా, అర్ధరాత్రి మూత్రవిసర్జన వంటి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి
నవజాత శిశువులకు రోజులో 11 నుండి 14 గంటల నిద్ర అవపరం కాగా, 3-5 ఏళ్ళ పిల్లలకు 10 నుండి 13 గంటలు నిద్ర అవసరమవుతుంది. యుక్త వయస్సు ఉన్న వారు అంటే 14-17 ఏళ్ళ వారు 8 నుండి 10 గంటల వరకు నిద్ర పోవాలి. ఇక 18 - 60 మధ్య వయసు గల వారు 7 నుండి 9 గంటలు నిదురించడం మంచిది. వృద్ధులు అంటే 60 సంవత్సరాల పైన వారు 6 నుండి 8 గంటల పాటు నిద్రపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.
సంబంధిత కథనం