How much sleep do kids need: చిన్నారులకు ఏ వయస్సులో ఎంత నిద్ర అవసరం.. ఈ చార్ట్
how much sleep do kids need: చిన్న పిల్లలు తగినంత సమయం నిద్ర లేకపోతే మానసికంగా, శారీరకంగా చాలా బలహీనంగా ఉంటారు. వారికి ఏ వయస్సులో ఎంత నిద్ర అవసరమో ఇక్కడ చూడండి.
how much sleep do kids need: పిల్లలకు ఏ వయస్సులో ఎంత నిద్ర అవసరమో తెలుసా? మనం మానసికంగా, శారీరకంగా ప్రతిరోజూ ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. పెద్ద వారైనా నిద్ర లేకుండా ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండలేరు. ఇక అప్పుడు పుట్టిన శిశువుల నుంచి 10 - 15 ఏళ్ల వయస్సు వచ్చేవరకు వారికి ఎక్కువ గంటలు నిద్ర అవసరం. ఏ వయస్సులో ఎంత నిద్ర అవసరమో ఇప్పుడు చూద్దాం.
తొలి 4 వారాల వయస్సు శిశువుకు నిద్ర సమయం
అప్పుడే పుట్టిన శిశువు రోజుకు 15 నుంచి 18 గంటలు నిద్ర పోతారు. అయితే ఇది నిరాటంకంగా కాకుండా, ప్రతి రెండు నుంచి మూడు గంటలకోసారి నిద్ర లేస్తూ ఉంటారు. నెలలు నిండకుండా పుట్టిన వారైతే ఈ వయస్సులో ఇంకా ఎక్కువ గంటలు నిద్ర పోతారు. ఇక కడుపులో లేదా ఇతరత్రా అసౌకర్యంగా ఉన్న శిశువులు ఇంతసేపు నిదురించలేరు.
నెల వయస్సు నుంచి నాలుగు నెలల వయస్సు శిశువు నిద్ర పోవాల్సిన సమయం
ఒక నెల వయస్సు వచ్చాక నాలుగు నెలల వయస్సు వరకు చిన్నారులు కాస్త కుదుటపడుతున్నట్టు కనిపిస్తారు. కనీసం ఐదారు గంటలు లేవకుండా నిద్రపోతారు. రోజులో 15 నుంచి 16 గంటలు నిద్రపోతారు. క్రమంగా ఒకే నిర్ధిష్ట సమయంలో నిద్ర పోవడానికి ప్రయత్నిస్తారు. రాత్రి, పగలు అన్న వ్యత్యాసం తెలిసొస్తుంది.
నాలుగు నెలల నిండి 12 నెలల వరకు..
ఈ వయస్సులో 15 గంటల నిద్ర అవసరం. అయితే చాలా మంది పిల్లలు విభిన్న కారణాల వల్ల ఇంత సమయం నిద్రపోరు. 11 నుంచి 12 నెలల వయస్సు వచ్చేసరికి 12 గంటల పాటు నిద్ర పోతారు. అందువల్ల తగినంత నిద్ర ఉండేందుకు వారిని నిద్ర పుచ్చేందుకు శ్రద్ధ తీసుకోవాలి. వారి ఆకలి, నిద్ర వేళల్లో ఒక క్రమ శిక్షణ రావాలి. ఆరు నెలల వయస్సు వచ్చేసరికి వారు పగటి పూట మెలకువతో ఉండడం, రాత్రి నిద్ర పోవడం చేస్తారు. అయితే ఉదయం పూట ఆహారం ఇచ్చిన తరువాత కాసేపు, మధ్యాహ్నం ఆహారం ఇచ్చిన తరువాత సాయంత్రం ఐదారు గంటల వరకు నిద్ర పోయేలా తగిన వాతావరణం కల్పించాలి.
3 ఏళ్ల వయస్సు వచ్చే వరకు
ఏడాది నిండిన పిల్లలు మూడేళ్లు వచ్చే వరకు రోజుకు 14 గంటల నిద్ర అవసరం. అంటే స్కూలుకు వెళ్లే వయస్సు వచ్చే వరకు ఉదయం, మధ్యాహ్నం భోజనానంతరం నిద్ర పుచ్చాలి. అలాగే రాత్రి కూడా భోజనం అనంతరం త్వరగా నిద్ర పోయేలా చూడాలి. ఉదయం మూడు గంటలు, మధ్యాహ్నం మూడు గంటలు, రాత్రి పూట 8 గంటలు నిద్ర ఉండేలా చూడాలి.
3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు నిద్రించే సమయం
పిల్లలకు మూడేళ్లు వచ్చాయంటే ప్రి-స్కూల్ దశకు చేరుకున్నట్టు. ఈ సమయంలో కనీసం 10 నుంచి 12 గంటల నిద్ర అవసరం. ఒకవేళ వారిని స్కూళ్లో చేర్పించినట్టయితే మధ్యాహ్నం రాగానే భోజనం తినిపించి సాయంత్రం వరకు నిద్ర పోయేలా చూడాలి.
7 నుంచి 12 ఏళ్ల వయస్సు పిల్లలకు:
ఈ వయస్సులో పిల్లలు రోజుకు కనీసం 10 నుంచి 11 గంటలు నిద్ర పోవాలి. అయితే స్కూలు, కుటుంబ సభ్యుల వల్ల ఆటంకాల కారణంగా ఇంతసేపు నిద్ర పోవడం వారికి కష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు వీరు రాత్రి 8 గంటలకే నిద్రకు ఉపక్రమించేలా చూడాలి. మధ్యాహ్నం కాసేపు తప్పనిసరిగా నిద్ర ఉండేలా చూడాలి.
12 ఏళ్ల వయస్సు దాటాక ఇక పెద్దలకు అవసరమైనట్టుగానే సుమారు 8 నుంచి 9 గంటల నిద్ర అవసరం అవుతుంది. పిల్లలకు నిద్ర వ్యవధి తగ్గితే మానసికంగా చాలా వీక్‌గా ఉంటారు. తోటి పిల్లలతో సరిగ్గా ఆడుకోలేరు. దేనిపై కూడా ఫోకస్ చేయలేరు. ఎప్పుడూ ఏడ్వడం, ఆకలి లేకుండా ఉండడం కనిపిస్తుంది. కంటి నిండా నిద్ర ఉంటే వారికి మానసికంగా ఉల్లాసం ఉంటుంది. శారీరకంగా రికవరీ ఉంటుంది.