Hero Xpulse 200 4V Rally Edition । ఆఫ్- రోడ్ రైడింగ్ అడ్వెంచర్ల కోసం ఇది బెస్ట్!
అడ్వెంచర్లను ఇష్టపడే రైడర్ల కోసం హీరో మోటార్ కార్ప్ తమ Xpulse 200 4Vలో ర్యాలీ ఎడిషన్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దీని ప్రామాణిక మోడల్ కంటే ధర స్వల్పంగా 20 వేలు పెంచింది.
ద్విచక్ర వాహనాల తయారీదారు Hero MotoCorp సరికొత్త Xpulse 200 4V ర్యాలీ ఎడిషన్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1.52 లక్షలుగా ఉంది. ఆఫ్-రోడ్ అడ్వెంచర్లను ఇష్టపడే రైడర్లకు ఈ బైక్ సూట్ అవుతుంది. ఆసక్తి గల కొనుగోలుదారులు జూలై 22 నుంచి జూలై 29, 2022 వరకు ఈ సరికొత్త మోటార్‌సైకిల్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. కాగా, కంపెనీ ఇటీవలే సాధారణ Xpulse 200 4V కోసం విడిగా ర్యాలీ కిట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 46,000గా ఉంది. అయితే తాజాగా విడుదల చేసిన ఎడిషన్‌లో ఆఫ్-రోడ్ బయాస్డ్ ర్యాలీ కిట్ స్టాండర్డ్‌గా వస్తుంది.
ప్రామాణిక Xpulse 200 4Vకు ఈ సరికొత్త ఎడిషన్‌లో మార్పు ఏంటంటే, ర్యాలీ ఎడిషన్‌లో ఫ్రంట్ సస్పెన్షన్ 250mm ట్రావెల్‌తో పొడవువైన ఫోర్క్ ఇచ్చారు. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఈ మార్పులతో గ్రౌండ్ క్లియరెన్స్ భారీగా 270mm పెరుగుతుంది. సీటు ఎత్తు 885mmకు పెరుగుతుంది. బీట్ పాత్‌లో మెరుగైన రైడింగ్ పొజిషన్‌ను అందించడానికి, ఎక్స్‌టెండెడ్ గేర్ లివర్, అలాగే స్టాక్ కంటే 40 మి.మీ ఎత్తుగా ఉండే హ్యాండిల్‌బార్ రైజర్‌లు ఉన్నాయి.
అలాగే ఇందులో అల్యూమినియం స్కిడ్ ప్లేట్‌ను అమర్చారు. ఇది రాళ్లు, ఇతర ప్రమాదకరమైన భూభాగాలపై నడుపుతున్నపుడు ఇంజిన్‌ను రక్షిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ 160 కిలోల కర్బ్ బరువును కలిగి ఉంది.
మరిన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
Hero Xpulse 200 4V ర్యాలీ ఎడిషన్ లో 200cc 4-వాల్వ్ ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను ఇచ్చారు. దీనిని 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు.
దీని ఇంజన్ 18.9bhp గరిష్ట శక్తిని, 17.35Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్ ఉష్ణ నిర్వహణ కోసం శీతలీకరణ వ్యవస్థ 7-ఫిన్ ఆయిల్ కూలర్‌తో వస్తుంది.
కొత్త మోటార్‌సైకిల్‌లో LED హెడ్‌లైట్, LED టెయిల్ లైట్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్‌లతో కూడిన పూర్తి డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ ఇండికేటర్, ఎకో మోడ్, టూ ట్రిప్ మీటర్లు, సింగిల్ ఛానల్ ABS వంటి ఫీచర్లు ఉన్నాయి.
అయితే నేరుగా ర్యాలీ ఎడిషన్ కొనుగోలు చేయడం కంటే కూడా ప్రామాణిక బైక్ కు ర్యాలీ కిట్ అమర్చుకుంటే మరింత మెరుగైన పనితీరు లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత కథనం