Thursday Motivation: ముఖేష్ - నీతా అంబానీల నుంచి ప్రతి తల్లితండ్రి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవిగో
Thursday Motivation: ముకేశ్ అంబానీ, నీతా అంబానీ వారి పిల్లల పెంపకం విషయంలో ఎన్నో ప్రశంసలు అందుకుంటారు. ప్రపంచంలోని ధనిక కుటుంబాల్లో ఒకటిగా చోటు దక్కించుకున్న అంబానీ కుటుంబం తమ పిల్లలను చాలా సంస్కారవంతులు, మర్యాదస్తులుగా పెంచింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందంటే ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ కుటుంబం విలాసవంతమైన జీవితానికి మాత్రమే కాదు, ఆచారాలు, సాంప్రదాయాలకు కూడా ఎంతో విలువ ఇస్తుంది. నీతా అంబానీ, ముఖేష్ అంబానీలక ముగ్గురు పిల్లలు. వారి పెంపకం విషయంలో నీతా - ముఖేష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వారి పిల్లలు భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబానికి చెందినప్పటికీ ఎంతో సంస్కారవంతంగా పెరిగారు. నీతా - ముఖేష్ అంబానీల పెంపకం నుండి కొన్ని పేరెంటింగ్ చిట్కాలను ప్రతి తల్లీ దండ్రి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
పిల్లలకు అండగా…
ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ ఎంత బిజీగా ఉన్నా కూడా రోజులో కాసేపు తమ పిల్లలతో కలిసి ఉండేందుకు ప్రాధాన్యతనిస్తారు. ముగ్గురు పిల్లలతో స్నేహంగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలతో ఆరోగ్యకరమైన, బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, పిల్లలు కూడా తల్లిదండ్రులను హృదయపూర్వకంగా గౌరవిస్తారు. అనుబంధాల విలువలు పిల్లలకు నేర్పినప్పుడే వారు రాబోయే జీవితంలో ప్రతి అనుబంధాన్ని కూడా గౌరవిస్తారు. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు, పిల్లలు కూడా తమ భావనలను తల్లిదండ్రుల ముందు చెప్పేందుకు ఇష్టపడతారు. దీనివల్ల వారు ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల నుండి సరైన సలహాలను పొందుతారు.
వాచ్ మెన్‌కు క్షమాపణ
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు పిల్లలు ఆకాశ్, ఇషా, అనంత్. వీరు ఎప్పుడూ ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేశంలో ఇంత ధనిక కుటుంబానికి చెందిన వారైనప్పటికీ, ఈ ముగ్గురూ ఎల్లప్పుడూ వినయంగా ఉంటారు. తల్లిదండ్రులు వారికి నేర్పిన ఆచారాలు ఇవి. చిన్నప్పుడు ఆకాశ్ తమ వాచ్ మెన్‌తో పరుషంగా మాట్లాడాడని, ఆ సమయంలో ముఖేష్ అంబానీ ఆ వాచ్ మెన్‌కు క్షమాపణలు చెప్పించారని నీతా అంబానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖేష్, నీతా అంబానీల మాదిరిగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వినయంగా ఉండటాన్ని నేర్పించాలి.
పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే పనిని తల్లిదండ్రులు మాత్రమే చేయగలరు. తమ తల్లిదండ్రులు తమను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారని, నమ్మకం, ధైర్యంతో ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని అనంత్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ముకేశ్, నీతా అంబానీల ఈ ప్రేరణ ఫలితమే నేడు వారి ముగ్గురు పిల్లలు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పిల్లల్లోని లోటుపాట్లు వారు వెళ్లే మార్గంలో ముళ్లుగా మారనివ్వకుండా, వారిని ముందుకు సాగేలా ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ప్రతి తల్లిదండ్రులు వారికి జీవిత పాఠాలు నేర్పాలి.
అంబానీ కుటుంబం దేశంలోనే అత్యంత ధనిక కుటుంబం. వారి పిల్లలకు డబ్బుకు కొదవలేదు. ఎంత డబ్బు కావాలన్నా, ఎక్కడైనా ఖర్చు పెట్టవచ్చు. కానీ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ ఎప్పుడూ తమ పిల్లలకు డబ్బు విలువను చెబుతుంటారు. ముఖేష్, నీతా తమ పిల్లలకు ఎక్కువ డబ్బును పాకెట్ మనీగా ఇవ్వలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పిల్లలు చిన్నతనం నుంచే డబ్బు విలువను అర్థం చేసుకోవాలని, అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం మానుకోవాలని నీతా - ముకేష్ అభిప్రాయం. ఎంత డబ్బున్నా కూడా రూపాయి విలువ తెలిసేలా పెంచడమే మంచిదని వారు చెబుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు వారి నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవాలి.