Get Rid of Dandruff। తలలో చుండ్రు పోవాలంటే సులభమైన మార్గాలివిగో!
తలలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే దీనిని నివారించటానికి ఇక్కడ సులభమైన చిట్కాలు ఉన్నాయి. వీటిని ప్రయత్నించి చూడండి.
అందమైన రూపం అంటే కేవలం ముఖంపై శ్రద్ధ చూపితే సరిపోదు, కేశాలు కూడా చాలా ముఖ్యం. అయితే జుట్టుకు సంబంధించి రకరకాల సమస్యలు వస్తాయి. ఇందులో చుండ్రు (Dandruff) అనేది చాలా చికాకు పెట్టే సమస్య. జుట్టు పరిశుభ్రంగా లేకపోతే చుండ్రు ఏర్పడుతుంది. వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన ఏర్పడవచ్చు. వర్షాకాలం, శీతాకాలాల్లో జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. పొడి గాలి, తక్కువ తేమ కారణంగా తలపై చుండ్రు ఎక్కువగా వృద్ధిచెందుతుంది. చల్లటి వాతావరణంలో వేడి నీళ్లతో తలస్నానం చేయడం, రూమ్ హీటర్లను ఉపయోగించడం వల్ల చర్మం అలాగే స్కాల్ప్ మీద సహజ నూనెలు తగ్గిపోతాయి. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. దీనిని పట్టించుకోకపోతే అది తల అంతటా విస్తరించి, భుజాలపై రాలుతుంది కూడా.
HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయుర్వేద నిపుణులు, నీమ్ ఆయు (Neem Ayu) వ్యవస్థాపకురాలు డాక్టర్ నీనా శర్మ జుట్టు సరంక్షణ, చుండ్రు సమస్యల గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఆమె ప్రకారం జుట్టు సంరక్షణ అనేది కాలాలకు అతీతంగా ఏడాది పొడగునా ఉండాలి. జుట్టును ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలను తినడం ద్వారా అంతర్గతంగా పోషణ లభించి చుండ్రు, పొడి స్కాల్ప్‌ను నివారించవచ్చునని తెలిపారు.
అయితే చుండ్రు సమస్య అధికంగా ఉంటే స్కాల్ప్‌కి పొడిగా మారకుండా, తలపై చర్మం నిర్జీవంగా పొరలుపొరలుగా మారకుండా ప్రత్యేక చికిత్సలను తీసుకోవాలని డాక్టర్ నీనా శర్మ సూచించారు. ఆయుర్వేదం ప్రకారం.. చుండ్రు నిరోధక నూనెతో ప్రశాంతంగా తలపై మసాజ్ చేసేలా 'షిరో అభ్యంగ' చికిత్సను ఆమె సిఫార్సు చేశారు.
షాంపూలు ఎలాంటివి ఉపయోగించాలి?
చుండ్రు సమస్య ఉన్నపుడు రసాయనాలను కలిగి ఉన్న కఠినమైన షాంపూలకు బదులుగా ఆయుర్వేద మూలికలతో రూపొందించిన సున్నితమైన షాంపూని ఎంచుకోవాలి. రసాయన షాంపూలతో దాని స్కాల్ప్ మీద సహజ నూనెలు కూడా తొలగిపోతాయి. కాబట్టి జుట్టు సంరక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు సహజమైన చుండ్రు నివారణ మూలికలైన అనంతమూల్, తులసి, వేప, మంజిష్ట వంటి ఇంగ్రీడిఎంట్స్ కలిగిన షాంపూను ఎంచుకోవాలి.
అలాగే షాంపూ అప్లై చేసినపుడు వేడినీటితో తలస్నానం చేయకూడదు. అనంతరం జుట్టు ఆరబెట్టడానికి వేడి గాలి ప్రసరింపజేసే బ్లో డ్రైయింగ్ చేసుకోకూడదు. తలను ఎప్పుడూ వేడెక్కించకూడదు అని నీనా శర్మ సూచించారు.
చుండ్రు నివారణకు మరిన్ని చిట్కాలు
చిక్‌న్యూట్రిక్స్‌లో కాస్మోటాలజిస్ట్ డాక్టర్ షిరీన్ సింగ్ కూడా చుండ్రును నివారించటానికి నొన్ని సలహాలు, సూచనలు చేశారు. అవేంటంటే
- శిరోజాల పరిశుభ్రతను పాటించాలి. ఫన్‌ఫస్ మనజాజియా అనే శిలీంధ్రాలు తల నుంచి వదిలిపోయేలా జుట్టును శుభ్రం చేసుకోవాలి.
- జుట్టుకు నూనె ఎక్కువగా రాసుకోవద్దు. స్కాల్ప్‌లో ఈ ఎక్కువ నూనెతో చుండ్రు ఏర్పడుతుంది. చుండ్రు ఉండగా మళ్లీ తలకు నూనె రాస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎందుకంటే నూనెలలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, వీటిలో చుండ్రుకు కారణమయ్యే ఈస్ట్ తింటుంది. అందువల్ల దురదగా ఉన్న తలపై నూనె వేయడం వల్ల చుండ్రు ఇంకా పెరుగుతుంది.
- ప్రతిరోజూ వ్యాయామం చేసినా, మరేవిధంగానైనా చెమటోడ్చినా జుట్టును కూడా శుభ్రం చేసుకోవాలి.
- కెటోకానజోల్, జింక్ పారాథియాన్, చార్ కోల్ లేదా అమైనో సాలిసిలిక్ యాసిడ్ సమ్మేళనాలు ఉన్న షాంపూలు యాంటీ డాండ్రఫ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి.
మొత్తంగా జుట్టు శుభ్రంగా ఉంచుకుంటే చుండ్రు సమస్యలను నివారించవచ్చు. పైచిట్కాలను ఉపయోగించి, చుండ్రు సమస్యల నుంచి బయటపడవచ్చు.
సంబంధిత కథనం