Heineken Silver | బీర్ కాని బీర్.. తాగితే అసలు తాగినట్లే అనిపించదు!
ప్రముఖ బీర్ కంపెనీ హైనెకెన్ ఒక గొప్ప బీరును విడుదల చేసింది. ఆ బీరు తాగితే అసలు తాగినట్లే అనిపించదు. అలా ఉంటుంది మరి.. వివరాలు చూడండి
ప్రముఖ డచ్ బ్రూయింగ్ కంపెనీ హైనెకెన్ తమ బ్రాండ్ నుంచి ఒక ప్రత్యేక బీర్‌ను విడుదల చేస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటివరకు ఎవరూ చూడని, ఎవరూ టేస్ట్ చేయని డిసెంట్రాలాండ్‌లో ప్రత్యేకంగా తయారుచేసిన బీర్ విడుదల చేయనున్నట్లు చాలా హైప్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే మీడియాను, బిజినెస్ ప్రముఖులను అందరినీ ఆహ్వానించి మొన్న గురువారం నాడు మెటావర్స్‌లో వర్చువల్ బీర్‌ను విడుదల చేసింది. 'హీనెకెన్ సిల్వర్' తో లభించే ఈ బీర్ ప్రపంచంలోనే మొట్టమొదటి వర్చువల్ బీర్ అని, ఈ బీర్ కేవలం డిసెంట్రాలాండ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
దీంతో ఈ బీర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చినవారంతా బిక్కమోఖాలేసుకొని ఒకరినొకరు చూసుకున్నారు. ఒక్కసారిగా వారికేం చేయాలో తోచలేదు. అసలు విషయం ఏంటంటే... హైనెకెన్ విడుదల చేసిన బీర్ ఒక వర్చువల్ బీర్. అంటే అది నిజమైన బీర్ కాదు. బీర్ లాంటి ఒక గ్రాఫిక్ బొమ్మ. డిసెంట్రాలాండ్ పేరుతో ప్రపంచంలో ఏ దేశం లేదు, ఏ ఊరు లేదు. అది కేవలం మెటావర్స్ టెక్నాలజీని ఉపయోగించి 3డీలో సృష్టించిన ఒక కల్పిత ప్రదేశం.
దీంతో ఆ ఈవెంట్ కు వచ్చిన ప్రముఖులు, పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైనెకెన్ కంపెనీపై మండిపడుతున్నారు. ఈ మధ్య పలు వాణిజ్య కంపెనీలు తమ ఉత్పత్తులు విడుదల చేస్తున్నాం, సేవలు ప్రాంభిస్తున్నాం అంటూ 'వర్చువల్' గా ఉత్తుత్తి ఉత్పత్తులు విడుదల చేస్తూ పబ్లిక్ స్టంట్‌లు నిర్వహించడం సాధారణం అయిపోతుందని వాపోతున్నారు. వాస్తవిక రూపం పొందని ఇలాంటి వర్చువల్ ఉత్పత్తులతో ఎవరికీ ఒరిగేదేమి ఉండదని, దీనికి అందరినీ పిలిచి పిచ్చి షో చేసి టైమ్ వేస్ట్ చేస్తున్నారని పాత్రికేయులు మండిపడుతున్నారు. అయితే ఇందుకు స్పందించిన హైనెకెన్ కంపెనీ దీనిని ఇక 'జోక్'గా తీసుకోవాలని చెప్పటం వారికి మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.
ఇదిగో ఇదే ఆ బీర్ కాని బీర్
ఏప్రిల్ నెలలో ప్రముఖ మొబైల్ కంపెనీ HTC మెటావర్స్ ఫోన్ పేరుతో ఒక కొత్త ఫోన్ విడుదలను ప్రకటించింది. తమ ఫోన్ VRతో కనెక్ట్ చేసుకోవచ్చని చెప్పింది మరి ఇదైనా నిజమైనా ఫోనా లేక ఇదీ ఉత్తుత్తిదేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్త చదివిన తర్వాత మీకో సీన్ గుర్తుకు వచ్చి ఉండాలి.. ‘అహ నా పెళ్లంట’లో రావోయి మరిది ఈరోజు మా ఇంట్లో కోడికూర అని కోట శ్రీనివాస రావు అతిథిని ఆహ్వానిస్తాడు. ఏదీ కోడి కూర అంటే.. తాడుతో కోడిని వేలాడ దీసి.. అదుగో అక్కడ వేలాడుతున్న కోడిని చూసి ఉత్త అన్నం తినేయడమే.. కోడికూర తిన్నంత తృప్తిగా ఉంటుంది అంటాడు. దీంతో ఆ అతిథి నిజంగానే పిచ్చోడవుతాడు. ఇప్పుడు హైనెకెన్ వ్యవహారం కూడా అలాగే ఉంది. గ్రాఫిక్స్ లో బీర్ బొమ్మను చూసుకుంటూ మంచి నీళ్లు తాగేస్తే సరి.. బీర్ తాగినంత సమ్మగా ఉంటుంది అని అనుకోవాలేమో.
ఇంకేం ఈరోజు ఈ ఉత్తిత్తి బీర్ తో చీర్స్ చెప్పేయండి..
సంబంధిత కథనం