ఛాతీలో మంటగా అనిపిస్తుందా? ఆసిడిటీ కావొచ్చు.. ఆయుర్వేదంతో ఉపశమనం -get rid of acidity naturally with the help of ayurvedam ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఛాతీలో మంటగా అనిపిస్తుందా? ఆసిడిటీ కావొచ్చు.. ఆయుర్వేదంతో ఉపశమనం

ఛాతీలో మంటగా అనిపిస్తుందా? ఆసిడిటీ కావొచ్చు.. ఆయుర్వేదంతో ఉపశమనం

Manda Vikas HT Telugu
Feb 28, 2022 06:18 PM IST

రాత్రిపూట నిద్రపోయే అలవాటు లేనివారు లేదా ఆలస్యంగా నిద్రపోయే వారు ఆసిడిటీ సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే మసాలా, నూనె, పుల్లని, పులియబెట్టిన ఆహారాలను ఎక్కువగా తీసుకునే వారు, కాఫీ, టీలను ఎక్కువగా తాగేవారు కూడా ఈ సమస్యను కలిగి ఉంటారు. మరి అసిడిటీకి గల కారణాలు, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

<p>. Representational Image</p>
. Representational Image (HT_PRINT)

మీకు అప్పుడపుడు ఛాతీలో మంటగా అనిపిస్తుందా? మీ చుట్టూ ఉండే వారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా? ఈ పరిస్థితికి కారణం అసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ అని వైద్యులు అంటున్నారు. మారుతున్న ఆహరపుటలవాట్లు, జీవనశైలి కారణంగా ఇప్పుడు చాలామంది యువత కూడా ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసే యాసిడ్ ఆహారనాళంలోకి ప్రవహించడం వలన ఛాతీకి దిగువ ప్రాంతంలో, గొంతు వద్ద, గుండెలో మండుతున్న అనుభూతి కలుగుతుంది. వీటితో పాటు కడుపులో మంట, తరచుగా పుల్లని తేన్పులు, ఎక్కిళ్లు రావడం, నోటికి ఏదీ రుచించకపోవడం, ఏది తిన్నా పుల్లగా లేదా చేదుగా అనిపించడం లాంటి లక్షణాలు ఉంటాయి.

మరి అసిడిటీకి గల కారణాలు ఏమిటి?

మనం తిన్న ఆహారం అన్నవాహిక ద్వారా కడుపులోకి వెళుతుంది. కడుపులోని గ్యాస్ట్రిక్ గ్రంథులు హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను సృష్టిస్తాయి. ఈ HCL తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి, కడుపులోని సూక్ష్మక్రిములను చంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ గ్రంథులు జీర్ణక్రియ ప్రక్రియకు అవసరమైన దానికంటే పెద్ద మొత్తంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేసినప్పుడు అసిడిటీ సమస్య తలెత్తుతుంది.

అసిడిటీ నివారణ మార్గాలు:

మనం తీసుకునే ఆహారం పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర అనుసరించడం చాలా ముఖ్యం.

ముఖ్యంగా రాత్రిపూట నిద్రపోయే అలవాటు లేనివారు లేదా ఆలస్యంగా నిద్రపోయే వారు అసిడిటీ సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే, మసాలా, నూనె, పుల్లని, పులియబెట్టిన ఆహారాలను ఎక్కువగా తీసుకునే వారు, కాఫీ, టీలను ఎక్కువగా తాగేవారిలో కూడా ఈ సమస్యను కలిగి ఉంటారు.

కాబట్టి, అసిడిటీ సమస్యలను ఎదుర్కొంటున్న వారు ముందుగా వారి ఆహార విషయంలో నియంత్రణ అవసరం. ఏదైనా అతిగా తినకూడదు. పుల్లని పండ్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

ఆకలి వేస్తున్నప్పటికీ, చాలా సమయం పాటు తినకుండా వేచి ఉండకండి. ఇది కూడా ఆసిడిటీకి దారితీస్తుంది. టైం ప్రకారం లంచ్ కచ్చితంగా చేయాలి, లేట్ నైట్ డిన్నర్స్ తగ్గించాలి.

తరచుగా  వెల్లుల్లి, ఉప్పు, నూనె, మిరపకాయలు మొదలైన వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం మానుకోండి. నాన్‌వెజ్‌కి దూరంగా ఉండటం కూడా ఉత్తమం.

తిండితో పాటు సరైన నిద్ర విధానాన్ని అనుసరించడం, రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం

తిన్న వెంటనే పడుకోకుండా కొంత సమయం ఇవ్వాలి. అలాగే తిన్నతర్వాత వెల్లకిలా కాకుండా ఎడమ వైపునకు తిరిగి పడుకుంటే మంచిది.

ధూమపానం, మద్యం, టీ, కాఫీలతో పాటు ఆస్పిరిన్ లాంటి మందులకు దూరంగా ఉండండి. అన్నింటికి మించి ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి.

ఆయుర్వేద చిట్కాలు:

ఒకవేళ మీరు అసిడిటీ సమస్యను ఇప్పటికే ఎదుర్కొంటుంటే ఈ ఆయుర్వేద మూలికలను ప్రయత్నించండి. అయితే వీటిని వినియోగించే ముందు ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించటం తప్పనిసరి.

ఉసిరి: ఉసిరికాయ రసం 15-20ml రోజులో రెండుసార్లు సేవించండి. ఉసిరి పొడి రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు అర టీస్పూన్ తీసుకోవాలి

శాతవరి : 1 టీస్పూన్ రోజుకు రెండుసార్లు పాలతో కలిపి తీసుకోవాలి.

యస్టిమధు (జామతో చేసే పొడి): ఖాళీ కడుపుతో (పరిగడుపున) రోజుకు రెండుసార్లు అర టీస్పూన్ తీసుకోండి.

కలబంద రసం: ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో 20 మి.లీ తీసుకోవాలి.

వీటితో పాటు రోజుకు తగినంత నీరు త్రాగాలి, మంచి నిద్ర కలిగి ఉండాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం ఇతర వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి చేయండి. ప్రాణాయామంలో శీతలీ, షిత్కారి, అనులోమ విలోమ, భ్రమరి విధానాలి ఆసిడిటీకి ఉత్తమంగా పనిచేస్తాయి.

Whats_app_banner