Avoid After a Meal | భోజనం చేసిన వెంటనే ఈ పనులు అస్సలు చేయకూడదు!-from smoking to sleeping 7 things you should not do immediately after a meal ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Avoid After A Meal | భోజనం చేసిన వెంటనే ఈ పనులు అస్సలు చేయకూడదు!

Avoid After a Meal | భోజనం చేసిన వెంటనే ఈ పనులు అస్సలు చేయకూడదు!

HT Telugu Desk HT Telugu
Jun 02, 2023 08:02 PM IST

Things To Avoid After a Meal: భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయకూడదు. ఎందుకంటే వీటి వల్ల ఆహారం జీర్ణం కాదు, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. , తిన్న తర్వాత చేయకూడని పనులు ఏవో ఇక్కడ తెలుసుకోండి

Things To Avoid After a Meal:
Things To Avoid After a Meal: (unsplash)

Things To Avoid After a Meal: చాలా మంది భోజనం చేసిన తర్వాత తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు. కానీ అవి వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. భోజనం చేసిన వెంటనే కొంతమంది సిగరెట్ వెలిగిస్తారు, మరికొంత మంది నేరుగా వెళ్లి మంచంపై పడుకొని రిలాక్స్ అవుతారు. కానీ దీనివలన మీకు కడుపులో అసౌకర్యం లేదా మగతగా అనిపించడం ఇతరత్రా సమస్యలు మీరు గుర్తించలేనివి ఉండవచ్చు. ఇందుకు కారణం మీరు తిన్న ఆహారం కాదు, ఆహారం తిన్న తర్వాత మీరు అనుసరించే అలవాట్లు. భోజనం చేసిన వెంటనే మీరు చేయకూడని పనులు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

నిద్రపోవడం

తిన్న తర్వాత కొద్దిసేపు నిద్రపోవడం రిఫ్రెష్‌గా ఉన్నప్పటికీ, భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంటకు దోహదం చేస్తుంది. తిన్న తర్వాత నిద్రించాలనుకుంటే లేదా అలా పడుకుని విశ్రాంతి తీసుకోవాలనుకుంటే, కొంత సమయం ఆగండి, జీర్ణక్రియకు కొంత సమయం కేటాయించిన తర్వాత నిద్రిస్తే ఎసిడిటీ లాంటి సమస్యలు రావు.

పళ్ళు తోముకోవడం

కొంత మందికి భోజనం చేసిన వెంటనే పళ్ళు తోముకోవడం అలవాటు. ఏదైనా తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం మంచి అలవాటే కానీ, తిన్న వెంటనే దంతాలను బ్రష్ చేయకూడదు. ముఖ్యంగా మీరు ఆమ్ల గుణాలు కలిగిన ఆహారాలు లేదా పానీయాలు తీసుకున్నప్పుడు అస్సలు బ్రష్ చేయకూడదు. ఎందుకంటే యాసిడ్ ఎక్స్పోజర్ కారణంగా మీ దంతాల ఎనామిల్ కాస్త బలహీనపడుతుంది. ఈ సమయంలో బ్రష్ చేస్తే దంతాలపై ఉండే ఎనామిల్ తొలగిపోతుంది. ఫలితంగా అనేక రకాల దంత సమస్యలు వస్తాయి. కాబట్టి భోజనం తర్వాత మీరు పళ్ళు తోముకోవాలనుకుంటే, కనీసం ఒక 30 నిమిషాలు ఆగి, ఆ తర్వాత బ్రష్ చేసుకుంటే మంచిదని సిఫార్సు చేస్తున్నారు.

ద్రవాలు ఎక్కువ తీసుకోవడం

భోజనం చేసిన వెంటనే అతిగా ద్రవాలు తీసుకోవడం ముఖ్యంగా శీతల పానీయాలు తాగడం చేయకూడదు. దీని వల్ల మీ కడుపులోని ఆమ్లాలు పలచబడి జీర్ణక్రియ ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. భోజన సమయంలో మితంగా ద్రవపదార్థాలు తాగడం మంచిది, భోజనం తర్వాత పానీయాలు తాగాలనుకుంటే ఒక 30 నిమిషాలు సమయం ఇవ్వాలి. అంతకుముందు కొద్ది మొత్తంలో తీసుకుంటే పర్వాలేదు.

ధూమపానం

భోజనం తర్వాత సిగరెట్లు తాగేవారు చాలా మంది ఉంటారు. ధూమపానం చెడు అలవాటు, దీనిని తిన్న వెంటనే చేయడం మరింత చెడ్డ అలవాటు. దీని వల్ల జీర్ణ సంబంధింత వ్యాధులతో పాటు కొన్ని క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండటం ఉత్తమం, కానీ మీరు పొగ త్రాగకుండా ఉండలేకపోతే, తిన్న వెంటనే కాకుండా కనీసం 30 నిమిషాల నుండి గంట వరకు వేచి ఉండటానికి ప్రయత్నించండి.

కఠినమైన వ్యాయామం

భోజనం చేసిన వెంటనే కఠినమైన వ్యాయామం చేయడం, తీవ్రమైన శారీరక శ్రమలో పాల్గొనడం చేయకూడదు. దీనివల్ల జీర్ణవ్యవస్థ నుండి రక్త ప్రవాహం మళ్లిపోతుంది, ఇది జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. భోజనం కాసేపు ఆగి నడకకు వెళ్ళవచ్చు. కానీ తీవ్రమైన శారీరక శ్రమ చేయాల్సి వస్తే కనీసం 1-2 గంటలు వేచి ఉండాలని సిఫార్సు చేస్తున్నారు.

పండ్లు తినడం

భోజనం చేసిన వెంటనే సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం తప్పు. తిన్న తర్వాత నారింజ, బత్తాయి, ద్రాక్షపండ్లు మొదలైన సిట్రస్ పండ్లను తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట పెరిగే ప్రమాదం ఉంది. మీరు ఈ పండ్లను తినాలనుకుంటే, భోజనానికి ముందు తినండి లేదా భోజనంతో పాటుగా తీసుకోవడం మంచిది.

స్నానం చేయడం

భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. తిన్న వెంటనే స్నానం చేస్తే శరీరం చల్లబడుతుంది. దీనివల్ల జీర్ణక్రియలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా అజీర్తి, ఎసిడిటీ మొదలైన సమస్యలు వస్తాయి. ఇది మన శరీరం మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తిన్న తర్వాత స్నానం చేయాలనుకుంటే కనీసం 30 నుంచి 45 నిమిషాలు వేచి, ఆ తర్వాత స్నానానికి వెళ్ళండి.

Whats_app_banner

సంబంధిత కథనం