Friday Motivation: ఒక ఊరిలో రాజు, రాము అనే ఇద్దరు రైతులు ఉండేవారు. వీరిద్దరి పొలాలు పక్కపక్కనే ఉండేవి. ఒకరోజు పొలం విషయంలో వీరిద్దరికీ గొడవలు వచ్చాయి. ఎకరం పొలం తమదంటే తమదని గొడవలు పెట్టుకున్నారు. విభేదాలు బాగా పెరగడంతో కోర్టుకు వెళ్లారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తి చాలా తెలివైనవాడు. అతడు వారిద్దరి వాదనలు విన్నాడు.
తనకు కాస్త సమయం ఇవ్వమని అడిగాడు జడ్జి. ఆ పొలం మ్యాపులు ,సాక్షుల వాంగ్మూలాలు, భూమి పత్రాలు అన్నింటినీ పరిశీలించాడు. అలాగే ఊరు వెళ్లి ఆ పొలాన్ని చూసాడు. ఒక పొలం గట్టుపై నిల్చుని కళ్ళు మూసుకున్నాడు. అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తిరిగి కోర్టులో తన తీర్పుని చెప్పాడు.
పొలం ఇద్దరు రైతులకు చెందుతుందని, అది సమానంగా విభజిస్తామని ప్రకటించాడు. దానికి రైతులు ఇద్దరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే జడ్జి రాబోయే పంట సీజన్లో ఆ ఎకరం పొలాల్లో రెండు రకాల పంటలను పండించి చూపిస్తేనే ఆ భూమిని రైతులకు చెరో సగం పంచిస్తానని, లేకుంటే అది ప్రభుత్వ ఆధీనంలోకి వెళుతుందని చెప్పాడు.
దీంతో రైతులు ఎకరం పొలాన్ని అరెకరం, అరెకరంగా విభజించుకుని రెండు పంటలు వేసేందుకు సిద్ధమయ్యారు. రాజు ఒక అరెకరంలో వరి పండిస్తే, రాము మరో అరెకరంలో మినుములు వేశాడు.
భూమిని పండించే సమయంలో వారు పక్కపక్కనే పని చేస్తూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మట్టిని తీయడం, మొక్కల నాటడం, ఎరువులని పంచుకోవడం, సరిహద్దు కంచెను నిర్మించుకోవడం, పనిముట్లను పంచుకోవడం ఇలా వారి మధ్య సఖ్యత కుదరడం ప్రారంభించింది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారాయి. అప్పటివరకు శత్రువుల్లా ఉన్నవారు ఇలా కలిసి పండించడం వల్ల మిత్రులుగా అయ్యారు. వారి భూమి కూడా సమృద్ధిగా పండింది.
ఈ విషయం జడ్జి దాకా చేరింది. జడ్జి వారిద్దరినీ పిలిచి ‘మొదటి నుంచి ఇలా కొట్టుకునే బదులు చెరో అర ఎకరాలో పంటలు వేసుకుంటే ఈపాటికి మీరు ధనవంతులయ్యేవారు... ఐకమత్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకేది లేదు. మీరిద్దరూ అనవసర విషయాలకు పోయి ఇన్నాళ్లు మనశ్శాంతి లేకుండా ఉన్నారు. గొడవలు పడ్డారు. ఇప్పుడు సమిష్టి కృషితో సఖ్యతగా ఉన్నారు. మీ ఇద్దరి కథ మీ గ్రామస్తులకు ఒక పాఠం’ అని అన్నాడు. ఆ ఇద్దరూ రైతులు కూడా స్నేహం కారణంగా తిట్టుకోవడం వంటివి మానేసి చెరో అరెకరాన్ని పండించుకోవడం మొదలుపెట్టారు. దీనివల్ల వారికి మనశ్శాంతి మళ్ళీ దక్కింది. ప్రశాంతంగా కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. ఈ తెలివి ముందే ఉంటే తాను ఇన్నాళ్లు గొడవలకు పోయే వారు కాదని అనుకున్నారు.
రాజు, రాము మాత్రమే కాదు ఎవరైనా కూడా అనవసర గొడవలకు దిగకుండా ఉన్నంతలో సర్దుకుపోవడం మంచిది. అనవసరమైన అంశాలపై గొడవలకు దిగితే మీ మనశ్శాంతి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయంలో పోరాడాలో, ఏ విషయాన్ని వదిలేయాలో తెలివిగా నిర్మించుకోవాల్సిన బాధ్యత మీదే.