Afternoon sleep: మధ్యాహ్నం పూట నిద్ర మబ్బు ఆపుకోలేక పోతున్నారా? ఇలా చేయండి-feeling drowsy and sleepy in afternoons see these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Afternoon Sleep: మధ్యాహ్నం పూట నిద్ర మబ్బు ఆపుకోలేక పోతున్నారా? ఇలా చేయండి

Afternoon sleep: మధ్యాహ్నం పూట నిద్ర మబ్బు ఆపుకోలేక పోతున్నారా? ఇలా చేయండి

Koutik Pranaya Sree HT Telugu
Aug 27, 2024 02:00 PM IST

Afternoon sleepiness: మధ్యాహ్నం పూట నిద్ర పనికి చేటు అంటారు. అయినా ఎంత ప్రయత్నించినా నిద్ర మన అదుపులో ఒక్కోసారి ఉండదు. ఏ పనీ చేయలేనంత నిద్ర మత్తు ఆవహిస్తుంది. అప్పుడు ఏం చేయాలో చూడండి.

మధ్యాహ్నం నిద్ర మబ్బు తగ్గించే చిట్కాలు
మధ్యాహ్నం నిద్ర మబ్బు తగ్గించే చిట్కాలు (freepik)

మధ్యాహ్నం అవ్వగానే ఓ పట్టానా ఏ పనీ చేయబుద్ది కాదు. అలా మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకోవాలి అనిపించేంత నిద్ర మత్తు వస్తుంది. పని ముందు పెట్టుకుని కూర్చున్నా సరే కళ్లు మూసుకుపోతాయి. ఇక మధ్యాహ్న భోజనం తిన్నాక వచ్చే నిద్ర మత్తు రాత్రి పూట ఎందుకు రాదు అనిపిస్తుంది. ఇంట్లో అయితే ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు కానీ బయట పనిలో ఉన్నప్పుడు దీన్నుంచి ఎలా బయటపడాలో చూడండి.

వెట్ టిష్యూ:

మీ బ్యాగులో వెట్ టిష్యూలు ఉంచుకోండి. నిద్ర వచ్చినప్పుడు ముఖం మీద మాస్క్ లాగా ఒకసారి ఆ టిష్యూ వేసి కాసేపు ఉంచుకుని ముఖం తుడిచేసుకోండి. చాలా ప్రశాంతంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది చూడండి. చాలా వరకు వెట్ టిష్యూలలో మెంతాల్, అలోవెరా లాంటి గుణాలుంటాయి. వీటివల్ల చల్లగా అనిపిస్తుంది.

డెస్క్ ఫ్యాన్:

రోజూ ఇదే సమస్యే అయితే ఒక చిన్న డెస్క్ ఫ్యాన్ మీ వెంట ఉంచుకోండి. దాన్ని హై స్పీడ్ మీద పెట్టి మీ ముఖానికి గాలి కొట్టేలా పెట్టండి. దాంతో మెదడు చురుగ్గా పనిచేసి నిద్ర తగ్గుతుంది చూడండి.

చూయింగ్ గమ్:

నోట్లో చూయింగ్ గమ్ వేసుకుని నమలడం వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరుగుతుంది. మీ మబ్బు కాస్త తగ్గిస్తుంది. మీపర్సులో రెండు మూడు చూయింగ్ గమ్‌లు ఉంచుకోండి. అత్యవసరమైనప్పుడు పనికొస్తాయ.ి

తక్కువ తినడం

మధ్యాహ్న భోజనం తర్వాతే చాలా మందిలో నిద్ర మబ్బు కమ్ముకుంటుంది. మీరు తినే ఆహారం మీకు శక్తినివ్వాలి కానీ, ఏ పనీ లేకుండా మార్చేయకూడదు. కాబట్టి తాజా కూరగాయల సలాడ్లు తినండి. కేలరీలు, చక్కెరలు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే బద్దకంగా, నిద్రగా అనిపించదు.

వెలుతురు

మీరు పనిచేసే చోటు చీకటిగా ఉంటే మధ్యాహ్నం ఆ నిద్ర మబ్బు మరీ ఎక్కువే ఉంటుంది. కాబట్టి వెలుతురున్న చోటుకు వెళ్లండి. కిటికీలుంటే వాటి కర్టెయిన్లు తెరవండి. లైట్లు వేసుకోండి. ఇవన్నీ మీ నిద్ర మబ్బు తగ్గిస్తాయి.

స్నాక్

నిద్ర వచ్చిన సమయాన్ని కూడా పని కోసం వాడేయండి. ఈ సమయంలో పని కొన్ని నిమిషాలు పక్కన పెట్టి పోషకాలున్న ఆహారం ఏదైనా తినండి. యోగర్ట్, ఫ్లేవర్డ్ యోగర్ట్, పండ్ల ముక్కలు, సలాడ్ ఏవైనా తీసుకోండి. మీ దృష్టి మరలి నిద్ర రాదు. అలాగే డీ హైడ్రేషన్ వల్ల కూడా నిద్ర రావచ్చు. వీలైతే ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచిది.

విరామం

ఇక ఏం చేసినా పనయ్యేట్లు లేదు అనిపిస్తే వెంటనే డెస్క్ దగ్గర నుంచి పక్కకు వచ్చేయండి. కాసేపు బయట వాకింగ్ చేయండి. అది కూడా చేయలేనంత బద్దకంగా అనిపిస్తే రెస్ట్ రూం లేదా వీలున్న చోటికి వెళ్లి కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా పడుకుని లేవండి. లేదంటే గంటల కొద్దీ సమయం వృథా అవుతుంది.

కాఫీ

కాఫీలో ఉండే కెఫీన్ నిద్రను పూర్తిగా వదిలిస్తుంది. మీకు ఈ సమస్య రోజూ ఉంటే చిన్న మొత్తం కాఫీ తాగండి. వెంటనే ఉత్తేజంగా అనిపిస్తుంది.