Fatty Liver: మీకు మద్యం తాగే అలవాటు లేకపోయినా ఫ్యాటీ లివర్ వ్యాధి రావచ్చు, ఇంటి దగ్గరే ఇలా చెక్ చేసుకోండి
Fatty Liver: మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్లకే ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని ఎక్కువమంది అనుకుంటారు. నిజానికి ఆల్కహాల్ వినియోగం లేకపోయినా కొవ్వు కాలేయ వ్యాధి రావచ్చు. ఇంట్లోనే దీన్ని ఇలా చెక్ చేసుకోండి.
Fatty Liver: ఇప్పుడు ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య ‘కొవ్వు కాలేయ వ్యాధి’. దీన్నే ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇది ఎలాంటి లక్షణాలు చూపించకుండా మొదలైపోతుంది. మన దేశంలో ప్రతి మూడు మందిలో ముగ్గురిలో ఒకరికి కొవ్వు కాలేయ వ్యాధి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కొవ్వు కాలేయ వ్యాధి కొన్ని సూక్ష్మ సంకేతాలను చూపిస్తుంది. వాటిని గుర్తించడం ద్వారా మీరు ఈ వ్యాధి బారిన పడ్డారో లేదో నిర్ధారించుకోవచ్చు.
బరువు పెరగడం
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అనేది కాలేయ వ్యాధికి సంకేతమే. హఠాత్తుగా బరువు పెరగడం లేదా రెండు మూడు నెలల్లో అధిక బరువు పెరగడం వంటివి ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు లక్షణంగా భావించవచ్చు. జీర్ణం చేయడంలో కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే కాలేయం సరిగా పనిచేయదో, కొవ్వు జీవక్రియ మందగిస్తుంది. అప్పుడు ఆ కొవ్వు పొత్తికడుపు ప్రాంతంలో పేరుకుపోతుంది. బొడ్డు చుట్టూ కొవ్వు పెరగడం వల్ల బరువు పెరుగుతారు. పొట్ట చుట్టూ కొవ్వు హఠాత్తుగా పెరుగుతుందంటే మీకు కొవ్వు కాలేయ ఉందేమో అని అనుమానించాలి.
మొటిమలు
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కొవ్వు కాలేయ సమస్యల వల్ల మొటిమల సమస్య పెరుగుతుంది. కాలేయ సమస్యతో బాధపడే వారికి హఠాత్తుగా మొటిమలు వస్తాయి. కాలేయం కొవ్వును విచ్ఛిన్నం చేయనప్పుడు అందులో ఉండే టాక్సిన్స్ చర్మం ద్వారా బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తాయి. అప్పుడు మొటిమలు రావడం మొదలవుతాయి. మొటిమలు ప్రారంభమై కొన్ని నెలల పాటు నిరంతరాయంగా వస్తుంటే జాగ్రత్త పడడం అవసరం.
చర్మంపై మచ్చలు
చర్మం నల్లబడడం అలాగే మెడ, చంకలు, మోచేతుల్లో తీవ్రంగా నలుపు రావడం కూడా కొవ్వు కాలేయ వ్యాధి ప్రధాన లక్షణం. ఇన్సులిన్ నిరోధకత వల్ల ఇలా నలుపు రంగు వస్తుంది. ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌తో ముడిపడి ఉన్న లక్షణం. అంటే ఆల్కహాల్ తాగని వారిలో వచ్చే కాలేయ సమస్యల్లో కనిపించే లక్షణం.
చర్మం రంగు
మీ కళ్ళు, మీ చర్మం రంగు మారితే తేలిగ్గా తీసుకోకండి. చర్మం, కళ్ళు కాస్త పసుపు రంగులోకి మారిన వెంటనే జాగ్రత్తపడాలి. అది కాలేయ సమస్యకు ముందస్తు హెచ్చరిక. ఎర్ర రక్త కణాల నుండి ఉత్పత్తి అయ్యే బిల్‌రుబిన్‌ను కాలేయం సరిగా ఫిల్టర్ చేయకపోతే ఇలా చర్మం కళ్ళ రంగు మారుతుంది. కాబట్టి మీ చర్మం కళ్ళల్లో రంగు మారితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
ఎముక నొప్పి
మీ కుడి వైపు ఉన్న పక్కటెముక కింద నిరంతరం అసౌకర్యంగా అనిపిస్తున్నా, నొప్పిగా అనిపిస్తున్న చాలా జాగ్రత్తగా పడండి. ఎందుకంటే అదే ప్రాంతంలో కాలేయం ఉంటుంది. ఈ నొప్పి కాలేయం ఎర్రబడడం వల్ల లేదా కొవ్వు పేరుకుపోవడం వల్ల జరగవచ్చు. ఎప్పుడైతే కొవ్వు పెరిగిపోతుందో కాలేయం ఉబ్బినట్టు అవుతుంది. అప్పుడు నొప్పి అధికంగా అనిపిస్తుంది. అది ఎముక నొప్పిలాగా కూడా అనిపించవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం ద్వారా కాలేయాన్ని కాపాడుకోవచ్చు.
తీవ్రమైన బలహీనత
ఆహారం తింటున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా కూడా నిరంతరంగా అలసటగా అనిపిస్తే అది కాలేయ సమస్యలతో ముడిపడి ఉందని అర్థం చేసుకోవాలి. కొవ్వు అనేది కాలేయం పనులకు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల అలసట, బలహీనమైన అనుభూతి కలుగుతుంది. కారణం లేకుండా మీరు తీవ్రంగా అలసట చెందితే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. పైన చెప్పిన ఏ ఏ లక్షణం మీలో కనిపించినా... వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోండి.
టాపిక్