TG Local Body Elections : ఈసారి కూడా బ్యాడ్ న్యూస్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులే!-people with more than two children are ineligible to contest in telangana local body elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Local Body Elections : ఈసారి కూడా బ్యాడ్ న్యూస్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులే!

TG Local Body Elections : ఈసారి కూడా బ్యాడ్ న్యూస్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులే!

Basani Shiva Kumar HT Telugu
Dec 21, 2024 10:52 AM IST

TG Local Body Elections : తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల నిబంధనను కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో చాలామందికి నిరాశే ఎదురైంది. ఈ నిబంధనను తొలగిస్తారని చాలామంది ఆశించారు. కానీ.. కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

లోకల్ బాడీ ఎలక్షన్స్‌
లోకల్ బాడీ ఎలక్షన్స్‌

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు అనర్హులనే నిబంధన కొనసాగనుంది. ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనలను తెలంగాణ కేబినెట్ తిరస్కరించింది. పాత నిబంధననే కొనసాగించాలని పంచాయతీరాజ్‌ శాఖను ఆదేశించింది. గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులో దీనికి సవరణ చేయలేదు.

ఉమ్మడి రాష్ట్రంలో..

కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని చట్టం చేశారు. అయితే.. ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన ఉన్నందున.. ఆ నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై కొందరు మంత్రులు కూడా హామీ ఇచ్చారు.

ఆధారాలు లేక..

ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖ.. చట్టసవరణ ప్రతిపాదనల్లో ఈ అంశాన్ని చేర్చింది. కేబినెట్ ఆమోదానికి పంపింది. కానీ.. దీన్ని మంత్రిమండలి ఆమోదించలేదు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటుపై శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, నిబంధన మార్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తాయనే కారణంతో.. ఈ ప్రతిపాదనను నిరాకరించినట్లు చర్చ జరుగుతోంది.

నిరాశే..

గత ఎన్నికల సమయంలో ఈ నిబంధనను తొలగిస్తారని అంతా భావించారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు ఎన్నికలకు రెడీ అయ్యారు. కానీ అప్పుడు కూడా నిబంధనను మార్చలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపీస్తున్న తరుణంలో ఈ చర్చ జరిగింది. మంత్రులు కూడా హామీ ఇవ్వడంతో.. నిబంధనను తొలగిస్తారని ఆశించారు. కానీ.. ఇప్పుడు కూడా నిరాశే ఎదురైంది.

ఏపీలో..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అడ్డంకిగా మారిన నిబంధనపై ఏపీ అసెంబ్లీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఇకపై అనర్హులుగా ప్రకటించే నిబంధనను.. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ రద్దు చేసింది. ఈ మేరకు చట్ట సవరణ బిల్లును ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదించింది.

దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ నిబంధనను ఏపీలో తొలగించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు వృద్ధుల సంఖ్య పెరగడం, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోవడం వంటి అంశాలను పరిశీలించి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2001లో 2.6శాతం ఉంటే 2024నాటికి అది 1.5శాతం మాత్రమే ఉంది.

Whats_app_banner