Evening Walk | సాయంత్రం నడుచుకుంటూ అలా షికారు చేయండి, ఎన్నో లాభాలు తెలుసా?
వేసవిలో చాలామంది ఎండలకు భయపడి బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఆలుగడ్డలు ఉడికినట్లు ఉడుకుతున్నారు. అయితే కాస్త చల్లబడ్డాక సాయంత్రం వేళలో నడకకు వెళ్లండి. దీని వల్ల ఎన్ని లాభాలో ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ కొంత శారీరక శ్రమ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఉదయం జాగింగ్, రన్నింగ్ ఇతర వ్యాయామాలు చేయని వారు కనీసం సాయంత్రం వేళ అయినా నడుచుకుంటూ అలాఅలా షికారుకు వెళ్తే ఆరోగ్యపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. సాయంత్రం నడక మీలో చురుకుదనాన్ని పెంచుతుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఇంకా ఇతర ఆరోగ్యప్రయోజనాలు దక్కుతాయి. సాయంత్రం నడకకు వెళ్లడం ద్వారా మొత్తం శ్రేయస్సుకు ఎలా సహాయపడుతుందో నిపుణులు పేర్కొన్నారు.
అలసట మాయం
రోజంతా ఆఫీసులో, ఇంట్లో వివిధ పనులు చేసిన తర్వాత అలిసిపోయినట్లు ఉంటుంది. అయితే సాయంత్రం అయ్యాక మీ ఇంటి ఆవరణలో లేదా స్థానిక పార్కులో ఒక 30 నిమిషాలపాటు నడిస్తే మీ అలసట దూరం అవుతుంది. సాయంత్రం నడక మీ శరీరం, మనస్సును పునరుజ్జీవింపజేస్తుంది. మీ శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచుకోవడానికి అవసరమైన వ్యాయామాన్ని కల్పిస్తుంది.
స్పష్టత పెరుగుతుంది
ఎండాకాలంలో చాలామంది మధ్యాహ్నం కూడా నిద్రపోతారు. అలాగే సుదీర్ఘంగా పగలంతా కూర్చుని పనిచేస్తూ ఉండవచ్చు. దీనివల్ల మెదడు మొద్దుబారినట్లుగా భారంగా, మబ్బుగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో సాయంత్రం వేళ నడక ప్రభావవంతంగా మనిచేస్తుంది. మీలో నూతన చైతన్యం కలుగుతుంది. మీకు సరైన విశ్రాంతి, స్పృహ లభించినట్లుగా అనిపిస్తుంది. మీలో స్పష్టత పెరుగుతుంది.
రాత్రి ప్రశాంతమైన నిద్ర
పగటిపూట నిద్ర కంటే రాత్రిపూట నిద్ర ఆరోగ్యానికి అనేక విధాలుగా మంచిది. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు సాయంత్రం వేళల్లో నడకకు వెళ్లండి. ఎలాంటి చింతలేని మంచి రాత్రి నిద్రను అనుభవిస్తారు. నడక కోసం సాయంత్రం కొన్ని నిమిషాలు కేటాయించగలిగితే మీలో ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. రాత్రి పడుకునే సమయానికి ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు.
ఆరోగ్యమైన గుండె
సాయంత్రం నడక రక్తపోటును తగ్గిస్తుంది, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. మీరు ఫిట్ గా కూడా ఉండగలుగుతారు. అలాగే రోజంతా పనిచేసినపుడు కండరాలపై ఒత్తిడి పెరుగుంది, వెన్నునొప్పి కలుగుతుంది. వీటన్నింటికి సాయంత్రం నడక ఒక పరిష్కార మార్గంగా ఉంటుంది.
రోగనిరోధక వ్యవస్థకు మేలు
నడక మీ శరీరంలోని అన్ని విభాగాలను చైతన్యవంతం చేయడంతో పాటు మీ రోగనిరోధక వ్యవస్థను పెంపొందించడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపడినట్లు పలు అధ్యయనాల్లో నిర్ధారణ అయింది.
సంబంధిత కథనం